CM KCR: వైద్య విద్యార్థులతో రాష్ట్రానికి కవచం నిర్మించుకుంటున్నాం: కేసీఆర్‌

తెలంగాణ వైద్యవిద్యలో కొత్త అధ్యాయం ప్రారంభమైంది. జిల్లాకో వైద్యకళాశాలను ఏర్పాటు చేయాలనే సీఎం కేసీఆర్‌ సంకల్పం సాకారమయ్యే దిశగా కీలక ముందడుగు పడింది.

Updated : 15 Nov 2022 12:51 IST

హైదరాబాద్‌: తెలంగాణ వైద్యవిద్యలో కొత్త అధ్యాయం ప్రారంభమైంది. జిల్లాకో వైద్యకళాశాలను ఏర్పాటు చేయాలనే సీఎం కేసీఆర్‌ సంకల్పం సాకారమయ్యే దిశగా కీలక ముందడుగు పడింది. ఒకే ఏడాది ఎనిమిది ప్రభుత్వ వైద్య కళాశాలలు అందుబాటులోకి వచ్చాయి. ప్రగతిభవన్‌లో నిర్వహించిన కార్యక్రమం ద్వారా నూతన వైద్య కళాశాలల్లో ఏకకాలంలో తరగతులను సీఎం కేసీఆర్‌ వర్చువల్‌గా ప్రారంభించారు. దీంతో సంగారెడ్డి, మహబూబాబాద్‌, మంచిర్యాల, జగిత్యాల, వనపర్తి, కొత్తగూడెం, నాగర్‌కర్నూల్‌, రామగుండం వైద్య కళాశాలల్లో 2022-23 వైద్యవిద్య సంవత్సరం నుంచే ఎంబీబీఎస్‌ తరగతులు ప్రారంభమైనట్లు అయింది. వీటి ద్వారా 1,150 సీట్లు విద్యార్థులకు కొత్తగా అందుబాటులోకి వచ్చాయి. దీంతో రాష్ట్రంలో వైద్యవిద్య కళాశాలల సంఖ్య 17కి చేరింది. 

తెలంగాణకు ఇది సువర్ణాధ్యాయం..

వైద్యవిద్య కళాశాలలను ప్రారంభించిన సందర్భంగా సీఎం కేసీఆర్‌ మాట్లాడారు. తెలంగాణకు ఇది సువర్ణాధ్యాయమని.. మరిచిపోలేని రోజు అని చెప్పారు. వైద్య విద్యార్థులు, వైద్యశాఖ అధికారులు, జిల్లా కలెక్టర్లు, వైద్య కళాశాలల నిర్వాహకులకు ఆయన శుభాకాంక్షలు చెప్పారు.  ‘‘గతంలో తాగునీటికి, సాగునీటికి, మెడికల్‌ సీటుకి, ఇంజినీరింగ్‌ సీటుకు ఎన్నో రకాల అవస్థలు పడ్డాం. స్వరాష్ట్రంగా తెలంగాణ ఏర్పడటంతో ఇప్పుడు అద్భుతంగా, ఆత్మగౌరవంతో బతుకుతున్నాం. దేశానికే మార్గదర్శకమైన అనేక వినూత్న కార్యక్రమాలు చేపడుతూ ముందుకెళ్తున్నాం. ఈ క్రమంలో మనం 8 ప్రభుత్వ వైద్యకళాశాలలు ప్రారంభించుకోవడం చాలా గర్వకారణం. మహబూబాబాద్‌, వనపర్తిలాంటి మారుమూల ప్రాంతాల్లో వైద్యకళాశాలల వస్తాయని ఎవరూ కలలో కూడా ఊహించి ఉండరు. దీనికి కారణం సొంత రాష్ట్రం ఏర్పాటు. ఉద్యమకారులుగా ఉన్నవారే పరిపాలనా సారథ్యాన్ని స్వీకరించడం.. అందులో ప్రముఖ ఉద్యమకారుడు హరీశ్‌రావు వైద్యఆరోగ్యశాఖ నిర్వహించడమే కారణం. వైద్యకళాశాలల ఏర్పాటు విషయంలో మంత్రి హరీశ్‌ కృషిని అభినందిస్తున్నా. ఆయనకు సహకరించిన సీఎస్‌ సహా అధికార యంత్రాంగానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. 

వైద్య వ్యవస్థ పటిష్ఠంగా ఉంటే తక్కువ నష్టం

ప్రతి జిల్లాకు ఒక మెడికల్‌ కాలేజ్‌ రావాలని సంకల్పించుకున్నాం. ఇప్పుడు ప్రారంభించిన వాటితో కలిపి ప్రభుత్వ రంగంలో వైద్య కళాశాల సంఖ్య 17కు పెరిగింది. మరో 17 జిల్లాల్లోనూ రావాల్సి ఉంది. అవి కూడా ఏర్పాటు చేస్తాం. గతంలో మనకు ప్రభుత్వ వైద్య కాలేజీల్లో 850 సీట్లు మాత్రమే ఉండేవి.. ఇప్పుడు ఆ సంఖ్య 2,790కి చేరింది. పీజీ సీట్లు, సూపర్‌స్పెషాలిటీ సీట్లు గణనీయంగా పెంచుకోగలిగాం. వైద్య సదుపాయాలు కొరవడి కొవిడ్‌ వేళ ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది మరణించారు. అమెరికాలోనూ వైద్య సదుపాయాలు సరిపోక చనిపోయారు. వైద్య వ్యవస్థ పటిష్ఠంగా ఉన్నచోట నష్టం తక్కువగా ఉంటుంది. కొవిడ్‌ లాంటి మహమ్మారులు, ఇతర వైరస్‌ల బెడద రాకూడదు. వైద్య విద్యార్థులతో రాష్ట్రానికి వైద్య కవచం నిర్మించుకుంటున్నాం’’ అని కేసీఆర్ అన్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని