CM KCR:దేశమంతా దళిత బంధు ఇచ్చే రోజు వస్తుంది: సీఎం కేసీఆర్‌

దేశమంతా ఏటా 25లక్షల కుటుంబాలకు దళితబంధు ఇచ్చే రోజు వస్తుందని భారాస అధినేత, సీఎం కేసీఆర్‌ అన్నారు.

Updated : 14 Apr 2023 18:14 IST

హైదరాబాద్‌: దేశమంతా ఏటా 25లక్షల కుటుంబాలకు దళితబంధు ఇచ్చే రోజు వస్తుందని భారాస అధినేత, సీఎం కేసీఆర్‌ అన్నారు. హైదరాబాద్‌ నడిబొడ్డున ఏర్పాటు చేసిన 125 అడుగుల భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ విగ్రహాన్ని ఆయన మనువడు ప్రకాశ్‌ అంబేడ్కర్‌ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో సీఎం కేసీఆర్‌ మాట్లాడారు.

‘‘అంబేడ్కర్‌ రాజ్యాంగం అమల్లోకి వచ్చి 70ఏళ్లు దాటింది. ఏటా అంబేడ్కర్‌ జయంతిని నిర్వహిస్తున్నాం. కానీ, ఎస్సీలు మాత్రం అభివృద్ధి చెందలేదు. అంబేడ్కర్‌ కలలు సాకారం కావాల్సిన అవసరం ఉంది. ఆయన సిద్ధాంతం విశ్వజనీనం, సార్వజనీనం. ఎవరో అడిగితే హైదరాబాద్‌ నడిబొడ్డున అంబేడ్కర్‌ విగ్రహం ఏర్పాటు చేయలేదు. అంబేడ్కర్‌ విశ్వమానవుడు. విశ్వమానవుడి విశ్వరూపం ప్రతిష్ఠించుకున్నాం. అంబేడ్కర్‌ విగ్రహం సమీపంలోనే బుద్ధుడి విగ్రహం, అమర వీరుల స్మారకం ఉన్నాయి. సచివాలయానికి కూడా అంబేడ్కర్‌ పేరు పెట్టుకున్నాం. ఇది విగ్రహం కాదు విప్లవం. అంబేడ్కర్‌ పేరిట ఏటా అవార్డు ఇవ్వాలని కత్తి పద్మారావు సూచించారు. అవార్డు కోసం ప్రత్యేకంగా రూ.51 కోట్లతో నిధి ఏర్పాటు చేస్తాం. దానిపై ఏటా రూ.3కోట్ల వరకు వడ్డీ వస్తుంది. ఏటా అంబేడ్కర్‌ జయంతి రోజున ఉత్తమ సేవలందించిన వారికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున అవార్డు ప్రదానం చేస్తాం. తెలంగాణ కలలను సాకారం చేసుకునే చిహ్నం ఈ విగ్రహం. విగ్రహ ఏర్పాటుకు కృషి చేసిన అందరికీ ధన్యవాదాలు.

ప్రజలు గెలిచే రాజకీయం రావాలి..

‘‘ప్రజలు గెలిచే రాజకీయం రావాలి. 2024 ఎన్నికల్లో రాబోయే ప్రభుత్వం మనదే. దేశంలో ఏటా 25 లక్షల దళిత కుంటుంబాలకు దళిత బంధు అమలు చేస్తాం.  మహారాష్ట్రలో భారాసకు గొప్ప స్పందన  వచ్చింది. యూపీ, బిహార్‌లో కూడా స్పందన వస్తుంది. మహారాష్ట్ర తరహాలోనే దేశమంతా స్పందించే రోజు వస్తుంది. ఈ మాటలు కొందరికి మింగుడు పడక పోవచ్చు. రాష్ట్రంలో ఇప్పటిరకు 50వేల మందికి దళితబంధు అందింది. ఈ సంవత్సరం మరో 1.25 లక్షల మందికి దళితబంధు అమలు చేస్తాం. ఎస్సీల అభ్యున్నతి కోసం తెచ్చిన కార్యక్రమం దళితబంధు. వాస్తవ కార్యాచరణ దిశగా ఎస్సీ మేధావులు కదలాలి’’ అని సీఎం కేసీఆర్‌ విజ్ఞప్తి చేశారు. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని