CM KCR: దేశంలో పేదరికం పూర్తిగా తొలగితేనే అభివృద్ధి: కేసీఆర్‌

స్వతంత్ర భారత వజ్రోత్సవాలు రాష్ట్రవ్యాప్తంగా అద్భుతంగా జరగాలని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్నారు.

Published : 08 Aug 2022 14:38 IST

 

హైదరాబాద్‌: స్వతంత్ర భారత వజ్రోత్సవాలు రాష్ట్రవ్యాప్తంగా అద్భుతంగా జరగాలని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్నారు. హైదరాబాద్‌ హెచ్‌ఐసీసీలో సీఎం కేసీఆర్‌ త్రివర్ణ పతాకం ఆవిష్కరించి వజ్రోత్సవాలను ప్రారంభించారు. అనంతరం జాతిపిత గాంధీజీకి నివాళులు అర్పించి సీఎం మాట్లాడారు. ‘‘నేటి తరానికి స్వాతంత్ర్య పోరాట ఘటనలు తెలియవు. అనేక పోరాటాలు, త్యాగాలతో మనకు స్వాతంత్ర్యం వచ్చింది. ఉద్యమకారులను ఆనాటి బ్రిటిష్‌ ప్రభుత్వం దారుణంగా అణచివేసింది. ఏ దేశానికైనా స్వాతంత్ర్యం.. అపురూప సందర్భం. గాంధీజీ స్ఫూర్తితోనే అమెరికా అధ్యక్షుడిని అయ్యానని బరాక్‌ ఒబామా అన్నారు. గాంధీజీ ఎన్నో త్యాగాలు చేసి స్వతంత్ర పోరాటానికి నాయకత్వం వహించారు. ఆసేతుహిమాచలం పోరాటం జరిపి స్వాతంత్ర్యం తెచ్చారు. స్వాతంత్ర్యం వచ్చాక ఈ దేశాన్ని కలిపి ఉంచేందుకు ఎంతో కష్టపడ్డారు. వందల మంది సంస్థానాల అధిపతులను ఒప్పించారు. రాజభరణాలు ఇచ్చారు.  జమ్ముకశ్మీర్‌, జునాగఢ్‌, ఇండోర్‌, హైదరాబాద్‌.. దేశంలో విలీనమయ్యాయి. ఎన్నో వ్యయప్రయాసల తర్వత పుదుచ్చేరి, గోవా, సిక్కిం.. భారత్‌లో కలిశాయి’’ అని అన్నారు.

‘‘పేదరికం ఉన్నంతకాలం దేశంలో అలజడులు, అశాంతి ఉంటాయి.  దేశంలో పేదరికం పూర్తిగా తొలగిపోతేనే అభివృద్ధి సాధిస్తాం. ఈ దేశం నాదనే అభిప్రాయం ప్రతి ఒక్కరిలో కలగాలి. అనేక పోరాటాలు, త్యాగాలతో మనకు స్వాతంత్ర్యం వచ్చింది. జాతిపిత గాంధీజీని కొందరు కించపరిచేలా ప్రవర్తిస్తున్నారు. మహాత్ముడు ఎప్పటికీ మహాత్ముడిగానే ఉంటాడు. మనం స్వేచ్ఛావాయువులు పీల్చేందుకు ఎందరో ప్రాణత్యాగం చేశారు. తెలంగాణ వచ్చాక అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాం. రాష్ట్రంలో శాంతిభద్రతలు పరిఢవిల్లుతున్నాయి. చిల్లరమల్లర చేష్టలను ప్రతి ఒక్కరూ చీల్చి చెండాడాలి. ఐకమత్యంతో ఉండి ఈ జాతి ఔన్నత్యం చాటాలి. మహోజ్వల భారత్‌ నిర్వాణానికి ప్రతి పౌరుడు కృషి చేయాలి ’’ అని కేసీఆర్‌ వ్యాఖ్యానించారు. కార్యక్రమానికి వివిధ జిల్లాల నుంచి వచ్చిన ప్రజాప్రతినిధులు హాజరయ్యారు. వజ్రోత్సవాల్లో భాగంగా 15 రోజులపాటు రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వం వివిధ కార్యక్రమాలు నిర్వహించనుంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని