Eluru: సీ-విజిల్‌ ఫిర్యాదు బహిర్గతం.. ఇద్దరు ఉద్యోగులు సస్పెండ్‌

సీ-యాప్‌ ద్వారా చేసిన ఫిర్యాదును బహిర్గతం చేసిన ఇద్దరు ఉద్యోగులపై సస్పెన్షన్‌ వేటు పడింది.

Updated : 21 Mar 2024 20:05 IST

ఏలూరు: ఎన్నికల నియమావళి ఉల్లంఘనపై సీ-విజిల్‌ యాప్‌లో ఫిర్యాదు చేసిన వ్యక్తి గురించి వైకాపా నాయకులకు సమాచారం ఇచ్చిన ఘటన ఏలూరు జిల్లాలో చోటుచేసుకుంది. దీంతో ఫిర్యాదును బహిర్గతం చేసిన ఇద్దరు ఉద్యోగులపై సస్పెన్షన్‌ వేటు పడింది. ఏలూరు జిల్లా చేబ్రోలు గ్రామ సచివాలయం-1 పంచాయతీ కార్యదర్శి బి.వి.రవిచంద్ర, ఉంగుటూరు తహసీల్దార్‌ కార్యాలయ జూనియర్‌ అసిస్టెంట్‌ అమృతను సస్పెండ్‌ చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఈ ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేసిన జిల్లా కలెక్టర్‌ ప్రసన్న వెంకటేశ్‌ ఉంగుటూరు ఎంపీడీవో శర్మకు షోకాజ్‌ నోటీసు జారీ చేశారు.

ఏం జరిగిందంటే?

ఉంగుటూరు మండలం నల్లమాడు పంచాయతీ పరిధిలోని రామచంద్రాపురంలో గ్రంథాలయం, వాటర్‌ ప్లాంటుకు వైకాపా రంగులు ఉండటంతో స్థానికుడు ఫొటోలు తీసి సీ-విజిల్‌ యాప్‌లో ఈ నెల 19న ఫిర్యాదు చేశారు. ఈ ఫొటోల్లో ఫిర్యాదుదారుడితో పాటు ఆయన స్నేహితుడు కూడా ఉన్నారు. గంటలోపే అధికారులు స్పందించి వాటికి తెల్లరంగు వేయించారు. ఫిర్యాదుదారుల వివరాలు గోప్యంగా ఉంచాల్సి ఉన్నా స్థానిక అధికారులు ఫిర్యాదు చేసినవారి వివరాలు తెలిసేలా ల్యాప్‌టాప్‌లో స్క్రీన్‌షాట్‌ తీశారు. దాన్ని వైకాపా నాయకులకు పంపించారు. దీంతో ఫిర్యాదుదారుడి స్నేహితుడి సోదరుడికి వైకాపా నాయకులు ఫోన్‌ చేసి ప్రశ్నించారు. ఈ విషయం ఫిర్యాదుదారుడికి తెలియడంతో సీ-విజిల్‌ యాప్‌లో బుధవారం ఫిర్యాదు చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు