Cyclone Michaung: తీరం దాటిన మిగ్‌జాం తీవ్ర తుపాను

 తీవ్ర తుపాను మిగ్‌జాం బాపట్ల సమీపంలో తీరం దాటింది. దీంతో తీరం వెంబడి గంటకు 90-100కి.మీ వేగంతో ఈదురుగాలులు వీస్తున్నాయి.

Updated : 05 Dec 2023 16:52 IST

అమరావతి: తీవ్ర తుపాను మిగ్‌జాం (Cyclone Michaung) బాపట్ల సమీపంలో తీరం దాటింది. దీంతో తీరం వెంబడి గంటకు 90-100కి.మీ వేగంతో ఈదురుగాలులు వీస్తున్నాయి. రాగల 2 గంటల్లో మిగ్‌జాం తుపానుగా బలహీనపడనుంది. అనంతరం 6 గంటల్లో వాయుగుండంగా మారుతుందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. తుపాను తీరం దాటినప్పటికీ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

మిగ్‌జాం ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా పలు తీరప్రాంత జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడుతున్నాయి. వర్షాలు, ఈదురుగాలుల తీవ్రతతో రైతులకు తీవ్ర నష్టం జరిగింది. పశ్చిమ గోదావరి, నెల్లూరు, ప్రకాశం, గుంటూరు, పల్నాడు, ఎన్టీఆర్‌, కృష్ణా జిల్లాల్లో నష్టం ఎక్కువగా జరిగింది. రాయలసీమ ప్రాంతంలోని కొన్ని జిల్లాల్లోనూ తుపాను ప్రభావం కనిపించింది. వరి, పొగాకు, పసుపు, అరటి పంటలు దెబ్బతిన్నాయి.

తుపాను ప్రభావంతో ఈదురుగాలులకు పలుచోట్ల చెట్లు, విద్యుత్‌ స్తంభాలు నేల కూలాయి. ఏలూరు ప్రభుత్వ ఆస్పత్రి వద్ద భారీగా నీరు నిలిచిపోయింది. ఆస్పత్రి లోపల కూడా నీరు చేరడంతో రోగులు ఇబ్బంది పడుతున్నారు. పెదవేగి, పెదపాడు, వట్లూరు తదితర ప్రాంతాల్లో రహదారికి అడ్డంగా చెట్లు కూలిపోయాయి. పోలవరం, జీలుగుమిల్లి, జంగారెడ్డిగూడెం, టి.నరసాపురం తదితర మండలాల్లో వేరుశనగ, పొగాకు, మినుము పంటలు నీట మునిగాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని