Bihar: ‘ఉచితంగా దుస్తులుతకాలి’.. వినూత్న షరతుతో నిందితుడికి బెయిల్‌

మహిళలపై గౌరవాన్ని పెంపొందించే దిశగా.. ఓ అత్యాచార యత్నం కేసులో నిందితుడికి విభిన్నమైన షరతుతో బెయిల్‌ మంజూరు చేసింది బిహార్‌లోని ఝంఝార్‌పూర్‌ కోర్టు. ఆరు నెలలపాటు ఉచితంగా గ్రామానికి చెందిన మహిళలందరి దుస్తులను ఉతికి, ఇస్త్రీ చేసి ఇవ్వాలని...

Published : 24 Sep 2021 01:20 IST

పట్నా: మహిళలపై గౌరవాన్ని పెంపొందించే దిశగా ఓ అత్యాచార యత్నం కేసులో నిందితుడికి వినూత్నమైన షరతుతో బెయిల్‌ మంజూరు చేసింది బిహార్‌లోని ఝంఝార్‌పూర్‌ కోర్టు. ఆరు నెలలపాటు ఉచితంగా గ్రామానికి చెందిన మహిళలందరి దుస్తులను ఉతికి, ఇస్త్రీ చేసి ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది. వివరాల్లోకి వెళ్తే.. మధుబని జిల్లా మఝోర్‌ గ్రామానికి చెందిన లల్లన్‌ కుమార్‌ (20).. ఓ మహిళపై అత్యాచారానికి యత్నించిన కేసులో ఈ ఏడాది ఏప్రిల్‌లో అరెస్టయ్యాడు. తాజాగా బెయిల్‌ కోసం కోర్టును ఆశ్రయించాడు. ఈ వ్యవహారంలో ఇరు వర్గాల మధ్య రాజీ కుదిరిందని న్యాయస్థానం దృష్టికి తీసుకొచ్చాడు.

నిందితుడికి వయస్సు తక్కువగా ఉందని, పైగా మహిళలపై తన గౌరవాన్ని చాటుకునేందుకు అతడు సమాజ సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నాడని అతడి తరఫు న్యాయవాది కోర్టుకు వివరించారు. ఈ అంశాలను పరిగణనలోకి తీసుకున్న అడిషనల్‌ సెషన్స్‌ జడ్జి అవినాశ్‌ కుమార్‌.. ఇటీవల నిందితుడికి బెయిల్ మంజూరు చేస్తూ.. అతడు వచ్చే ఆరు నెలలపాటు గ్రామంలోని మహిళలందరి దుస్తులను ఉచితంగా ఉతకాలని, ఇస్త్రీ చేసి ఇవ్వాలని ఆదేశాలు జారీ చేశారు. మధ్యలోనే వెనక్కి తగ్గితే తమ దృష్టికి తీసుకురావాలని కోర్టు ఆ గ్రామ సర్పంచికి సూచించారు. మరోవైపు ఈ నిర్ణయంపై గ్రామ మహిళలు హర్షం వ్యక్తం చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని