
రోడ్డుపై నోటు..తీద్దామంటే డౌటు!
ఇండోర్: రోడ్డుపై కరెన్సీనోట్లు కుప్పలుగా పడిఉన్నా, ఒక్కరూ కూడా వాటిని తీసుకోని ఘటన మధ్యప్రదేశ్‌లో చోటుచేసుకుంది. అందుకు కారణం కరోనావైరస్ ఆ నోట్లపై ఉంచవచ్చునేమోనన్న భయమే. వివరాల్లోకి వెళితే ఇండోర్ నగరంలో గురువారం మిట్ట మధ్యాహ్నం రూ. 20, 50, 100, 200, 500 కరెన్సీనోట్లు పెద్దసంఖ్యలో రోడ్డుపై పడి ఉన్నాయి. దీన్ని గమనించిన అక్కడివారు వాటిని తీసుకోకుండా వెంటనే పెట్రోలింగ్పోలీసులకు ఫోన్ చేశారు. వారు అక్కడకు చేరుకుని నోట్లను శానిటైజింగ్ చేసి స్టేషన్‌కు తీసుకెళ్లారు. మొత్తం విలువ రూ.6,480. దీనిపై పోలీసుఅధికారి రాజీవ్‌సింగ్ బదోరియా స్పందిస్తూ ‘‘ఇక్కడి స్థానికులు కంట్రోల్‌రూమ్‌కు ఫోన్‌చేసి కరెన్సీనోట్లు రోడ్డుపై పడిఉన్నాయని అన్నారు. అక్కడికి వెళ్లి మొత్తం నోట్లన్నంటినీ శానిటైజ్ చేసి సీజ్ చేశాం. ఇప్పటివరకు ఈ డబ్బు తమదంటూ ఎవరూ మమ్మల్ని సంప్రదించలేదు. ఎవరైనా అనుకోకుండా పారేసుకున్నారా లేదా? కావాలనే ఇక్కడ వేశారా? అనే విషయాన్ని సీసీటీవీ ఫుటేజి పరిశీలించి తెలుసుకుంటాం’’ అని వివరించారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్‌మీడియాలో చక్కర్లు కొడుతోంది. మరోపక్క మధ్యప్రదేశ్‌లో కరోనాకేసుల సంఖ్య 938కు చేరుకోగా 53 మంది మరణించారు. ఒక్క ఇండోర్‌లోనే 554 కేసులు నమోదవ్వగా.. 37 మంది ప్రాణాలు కోల్పోయారు.
Advertisement