గ్యాస్‌ లీకేజీ బాధితులకు పరిహారం అందజేత

విశాఖపట్నం సమీపంలోని ఆర్‌.ఆర్‌ వెంకటాపురంలో ఎల్జీ పాలిమర్స్‌లో గ్యాస్‌ లీకేజీ దుర్ఘటనలో బాధితులకు ప్రభుత్వం ప్రకటించిన నష్టపరిహారాన్ని

Updated : 11 May 2020 13:44 IST

విశాఖపట్నం: విశాఖపట్నం సమీపంలోని ఆర్‌.ఆర్‌ వెంకటాపురంలో ఎల్జీ పాలిమర్స్‌లో గ్యాస్‌ లీకేజీ దుర్ఘటనలో బాధితులకు ప్రభుత్వం ప్రకటించిన నష్టపరిహారాన్ని సోమవారం పంపిణీ చేశారు. విశాఖ కేజీహెచ్‌లో చికిత్స పొందుతున్న బాధిత కుటుంబ సభ్యులను మంత్రులు అవంతి శ్రీనివాస్‌, కన్నబాబు, బొత్స సత్యనారాయణ పరామర్శించారు. మృతి చెందిన వారిలో పలువురి కుటుంబ సభ్యులకు ఒక్కొక్కరికి రూ.కోటి చెక్కులు అందజేశారు. క్షతగాత్రులకు రేపటి నుంచి పరిహారం అందించనున్నట్లు మంత్రులు తెలిపారు.

ఈ సందర్భంగా మంత్రి కన్నబాబు మాట్లాడుతూ... ‘గ్యాస్‌ లీకేజీ ప్రభావిత గ్రామాల్లో పరిస్థితి ప్రస్తుతం అదుపులోకి వచ్చింది. ఆయా గ్రామాల్లో శానిటైజేషన్‌‌ పనులు చేపట్టాం. ఈరోజు సాయంత్రం 4గంటల తర్వాత ప్రజలను గ్రామాల్లోకి అనుమతిస్తాం. ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డి ఆదేశాల మేరకు మంత్రులంతా ఒక్కొక్కరు ఒక్కో గ్రామంలో ఈరోజు రాత్రి బస చేయాలని నిర్ణయించుకున్నాం. ఈ సంఘటన చాలా దురదృష్టకరం. ప్రజలంతా ధైర్యంగా ఉండాలి. విశాఖ ఘటనతో రాష్ట్రంలో పారిశ్రామిక భద్రతకు సంబంధించిన ఒక కొత్త విధానాన్ని తీసుకురావాలని సీఎం జగన్‌ భావిస్తున్నారు’ అని ఆయన తెలిపారు.

‘విశాఖలో ప్రమాదానికి కారణమైన ఎల్జీ పాలిమర్స్‌ పరిశ్రమకు గత ప్రభుత్వమే అనుమతి ఇచ్చింది. సదరు కంపెనీకి వైకాపా ప్రభుత్వం కొత్తగా ఎటువంటి అనుమతులు ఇవ్వలేదు. గత ప్రభుత్వం చేసిన తప్పిదాలు తాము సరిదిద్దుతున్నాం. ఎల్జీ పాలిమర్స్‌తో పాటు ప్రమాదకరమైన కంపెనీలపై విచారణ చేస్తున్నాం. విచారణ కమిటీల నివేదిక ఆధారంగా సంబంధిత కంపెనీపై చర్యలు తీసుకుంటాం’ అని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. 

 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని