Published : 13 May 2020 16:04 IST

ప్రత్యేక ప్యాకేజీతో తయారీ రంగానికి ఊతం

ఆంధ్ర విశ్వవిద్యాలయం ఆర్థికశాస్ర్త విభాగాధిపతి ఆచార్య ప్రసాదరావు 

లాక్‌డౌన్‌ కాలంలో ప్రధాని మోదీ ప్రకటించిన రూ.20 లక్షల కోట్ల ఆర్థిక ప్యాకేజీ వలస కార్మికులు, దినసరి కూలీలకు మేలు చేస్తుందని ఆంధ్ర విశ్వవిద్యాలయం ఆర్థికశాస్ర్తం విభాగాధిపతి ఆచార్య ప్రసాదరావు అన్నారు. మిగిలిన దేశాలతో పోల్చుకుంటే మన దేశ ఆర్థిక వ్యవస్థ మెరుగ్గా ఉందంటున్నారు. వ్యవసాయ, ఫార్మా రంగాల పరిస్థితి బాగుందని, లాక్‌డౌన్‌ వల్ల లక్షల కుటుంబాలకుపైగా రోడ్డున పడ్డాయంటున్న ఆచార్య ప్రసాదరావుతో ప్రత్యేక ముఖాముఖి...

ప్రధాని మోదీ ప్రకటించిన ఆర్థిక ప్యాకేజీతో ఏయే వర్గాల వారికి మేలు జరుగుతుందని మీ అభిప్రాయం..?
లాక్‌డౌన్‌ కారణంగా రెండు నెలలుగా ప్రజలు ఎలాంటి ఆదాయం లేకుండా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇలాంటి తరుణంలో రూ.20 లక్షల కోట్ల భారీ ఆర్థిక ప్యాకేజీని ప్రకటించడం ప్రజలకు ఊరటనిచ్చే అంశం. లాక్‌డౌన్‌ ముఖ్యంగా పేదలు, వ్యవసాయదారులు, వలస కూలీలపై చాలా ప్రభావం చూపింది. వీరిలో భరోసా నింపేందుకు ఈ ప్రత్యేక ప్యాకేజీ ఎంతగానో ఉపయోగపడుతుంది. సంక్షోభంలో ఉన్న తయారీ రంగానికి కూడా ఊతమిచ్చినట్లైంది. కరోనా దెబ్బకు రోడ్లు, రైలు, విమాన ప్రయాణాలు నిలిచిపోయాయి. నిరుద్యోగిత బాగా పెరిగిపోయింది. మార్చి 15 వరకు నిరుద్యోగిత రేటు 6.7 శాతం ఉండగా.. ఏప్రిల్‌ 19 నాటికి అది 26 శాతానికి పెరిగింది. చిన్న, మధ్య తరహా పరిశ్రమలు ఆర్థిక వ్యవస్థకు పునాదులుగా ఉంటాయి. లాక్‌డౌన్‌ ప్రభావం వీటిపైనే ఎక్కువగా పడటంతో ఆర్థిక వ్యవస్థ కుదేలైపోయింది. ఇంతటి క్లిష్ట పరిస్థితుల్లోను సైతం తట్టుకొని దేశం ఆర్థికంగా నిలబడటానికి కారణం వ్యవసాయ రంగం. భవిష్యత్తులోనూ ఈ రంగంపై మరింత దృష్టి సారించి అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉంది. 

ఆర్థికంగా చూస్తే కరోనా విపత్తు, లాక్‌డౌన్‌ నుంచి ఎలాంటి పాఠాలు నేర్చుకోవచ్చంటారు..?
మన దేశంలో యువత (18 నుంచి 25 ఏళ్లలోపు వారు) ఎక్కువగా ఉంది. వారే భారత్‌కు వెన్నెముక మాదిరి. ఆర్థికంగా పుంజుకోవడానికి ఈ గ్రూపు వారిని తగిన నైపుణ్యాలతో వినియోగించుకోవాలి.  కొవిడ్‌ ప్రభావం వల్ల సప్లయ్‌, డిమాండ్‌ గొలుసు తెగిపోయింది. ఇటు పరిశ్రమలు, అటు వ్యవసాయ రంగాన్ని సమన్వయం చేసుకుంటూ ఆర్థిక వ్యవస్థను ముందుకు తీసుకువెళ్లాలి.  ప్రధానంగా ఈ రెండు రంగాల మధ్య లింక్‌ బలహీనంగా ఉంది. ప్రజల ప్రాణాలు, అదే సమయంలో ఆర్థిక వ్యవస్థను కాపాడుకోవాల్సిన అవసరం ఉన్న నేపథ్యంలో తగు ప్రణాళికలు రూపొందించుకోవాలి. కొవిడ్‌ను అరికట్టడం చాలా ముఖ్యం. ఈ దిశగా ప్రజలంతా విధిగా సామాజిక దూరం పాటించాలి. ఇంతటి విపత్కర పరిస్థితుల్లోనూ ప్రజలు వెనకడుగు వేయడం లేదు. దేశాలన్నీ ప్రజల త్యాగం మీదే ఆధారపడి ఉంటాయనే విషయం ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలి. మరిన్ని వివరాలు కింది వీడియోలో చూడండి.

 


Read latest General News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

మరిన్ని