అందరం కలిసి పనిచేద్దాం: నిర్మలాసీతారామన్‌

కరోనావైరస్‌తో దేశం మొత్తం సంక్షోభంలో కూరుకుపోయినవేళ అందరం కలిసి పనిచేయాలని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్‌ ఆదివారం అన్నారు.

Published : 17 May 2020 17:12 IST

దిల్లీ:  కరోనావైరస్‌తో దేశం మొత్తం సంక్షోభంలో కూరుకుపోయినవేళ అందరం కలిసి పనిచేయాలని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్‌ ఆదివారం అన్నారు. కరోనావైరస్‌ విజృంభిస్తున్నవేళ వలసకార్మికులను ఆదుకోవడంలో భాజపా ప్రభుత్వం విఫలమైందంటూ కాంగ్రెస్‌నాయకులు విమర్శలు గుప్పిస్తున్న సంగతి తెలిసిందే. దీనిపై  ఆమె స్పందిస్తూ  ‘‘చేతులు కట్టుకుని మరీ ప్రతిపక్షపార్టీని అడుగుతున్నాను, ఈ కష్టకాలంలో అందరం కలిసి పనిచేద్దాం. వలసకార్మికుల ఇబ్బందులను తొలగిద్దాం’’ అని వ్యాఖ్యానించారు. కేంద్రం రాష్ట్రప్రభుత్వాలతో సమన్వయపరుచుకుంటూ ప్రత్యేకంగా  ఏర్పాటుచేసిన శ్రామిక్‌రైళ్ల ద్వారా ఇప్పటికే పెద్దసంఖ్యలో వలసకార్మికులను వారి స్వస్థలాలకు తరలించామన్నారు. వారికి అవసరమైన నిత్యావసరాలను, ఆహారాన్ని అందిస్తున్నామన్నారు. అయినప్పటికి చాలామంది ఇంకా కాలినడకన వెళ్తుండటం తమను బాధిస్తుందని, వారిని కూడా అన్నిరకాలుగా ఆదుకుంటామని స్పష్టం చేశారు. దీనిపై తమ ప్రభుత్వాన్ని విమర్శిస్తున్న ప్రతిపక్ష కాంగ్రెస్‌పార్టీ పాలిత రాష్ట్రాల్లో వలసకార్మికులకు ఇంతకంటే మెరుగైనసేవ చేస్తున్నారా..అని ఆమె ప్రశ్నించారు. మరిన్ని రైళ్లు కావాలంటే కేంద్రాన్ని అడగవచ్చని, అలా కాకుండా రోడ్డుపై నడిచివెళ్లే కార్మికులతో మాట్లాడటం, కలిసి కూర్చోటం వల్ల ఉపయోగం ఉండదని, అవసరమైతే వారి బ్యాగులు మోయండంటూ కాంగ్రెస్‌ నాయకుడు రాహుల్‌గాంధీని ఉద్దేశించి విమర్శించారు. ప్రస్తుత సంక్షోభసమయాన్ని స్వార్థరాజకీయాల కోసం ఉపయోగించడం మానేసి, కలిసి పనిచేసేందుకు ముందుకువచ్చేలా కాంగ్రెస్‌పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీని కోరుతున్నానని ఆమె తెలిపారు. కేంద్రం ప్రకటించిన 20 లక్షలకోట్ల ప్యాకేజీకి సంబంధించి ఏ రంగానికి ఎంతెంత కేటాయించారనే దానిపై గత రెండురోజులుగా ఆర్థికమంత్రి సీతారామన్‌ స్పష్టతను ఇస్తున్న సంగతి తెలిసిందే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని