5 నిమిషాల్లో ఇంటికి.. అంతలోనే ప్రమాదం

జీడిమెట్ల పోలీస్‌స్టేషన్‌ పరిధి బస్‌డిపో వద్ద ఆదివారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. యూటర్న్‌ తీసుకుంటున్న కంటైనర్‌ను బ్రీజా కారు ఢీకొనడంతో ఓ...

Updated : 02 Jun 2020 08:32 IST

జీడిమెట్ల డిపో వద్ద కంటైనర్‌ను ఢీకొన్న కారు

ఒకరు మృతి, ఇద్దరికి తీవ్ర గాయాలు

షాపూర్‌నగర్‌, న్యూస్‌టుడే: జీడిమెట్ల పోలీస్‌స్టేషన్‌ పరిధి బస్‌డిపో వద్ద ఆదివారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. యూటర్న్‌ తీసుకుంటున్న కంటైనర్‌ను బ్రీజా కారు ఢీకొనడంతో ఓ వ్యక్తి  మృతిచెందాడు. ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. 200 కి.మీ. ప్రయాణించిన వీరు 5 నిమిషాల్లో ఇంటికి చేరుకోవాల్సి ఉండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. పోలీసులు వివరాల ప్రకారం.. సుభాష్‌నగర్‌ నివాసి శివాల వీర్‌శెట్టికి జహీరాబాద్‌ సమీపంలోని మర్పల్లి వద్ద వ్యవసాయక్షేత్రం, స్టీల్‌ గోదాములు ఉన్నాయి. మూడు రోజుల క్రితం గాలివానకు గోదాము ప్రహరీ కూలిపోయింది. దాన్ని పునర్నిర్మించేందుకు ఆదివారం తన బ్రీజా కారులో కుత్బుల్లాపూర్‌ నివాసి నార్లకంటి ప్రతాప్‌, షాపూర్‌నగర్‌ నివాసి సింగర్తి యాదగిరి (45)తో కలిసి వెళ్లారు. రాత్రి తిరుగు ప్రయాణమైన వీరు పటాన్‌చెరువు వద్ద ఔటర్‌ రింగ్‌రోడ్డు ఎక్కి దుండిగల్‌లో నర్సాపూర్‌ రోడ్డుపైకి వచ్చారు. రాత్రి 12 గంటలకు సూరారం మీదుగా షాపూర్‌నగర్‌ వైపు వస్తుండగా జీడిమెట్ల డిపో సమీపంలో ఓ భారీ కంటైనర్‌ యూటర్న్‌ చేసుకోవడం గమనించకుండా ఢీకొట్టారు.దీంతో కారు ముందుభాగం పూర్తిగా నుజ్జయింది. కారును ప్రతాప్‌ నడుపుతుండగా పక్కసీట్లో వీర్‌శెట్టి, వెనుక యాదగిరి కూర్చున్నారు. ప్రమాదం జరిగిన వెంటనే బెలూన్‌లు తెరుచుకోవడంతో ముందుభాగంలో కూర్చున్న వారు గాయాలతో బయటపడ్డారు. వెనుక సీట్లో కూర్చున్న యాదగిరి తలకు బలమైన గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతిచెందాడు.పోలీసులు క్షతగాత్రులను ఆసుపత్రులకు, యాదగిరి మృతదేహాన్ని గాంధీకి తరలించారు. కంటైనర్‌ డ్రైవర్‌ పరారయ్యాడు. ఈ ముగ్గురు మద్యం మత్తులో ఉన్నారని, అతివేగం ప్రమాదానికి కారణమై ఉంటుందని భావిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని