Heavy Rains: 2 నెలల్లో 125 అతి భారీవర్షాలు

దేశంలో ఈ ఏడాది సెప్టెంబరు-అక్టోబరు మధ్య 125 అతి భారీ వర్షాలు కురిశాయని, గత ఐదేళ్లలో ఇవే అత్యధికమని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) వెల్లడించింది.

Updated : 03 Nov 2021 10:35 IST

దేశంలో సెప్టెంబరు-అక్టోబరు మధ్య నమోదు
గత ఐదేళ్లలో ఇవే అధికం: ఐఎండీ

దిల్లీ: దేశంలో ఈ ఏడాది సెప్టెంబరు-అక్టోబరు మధ్య 125 అతి భారీ వర్షాలు కురిశాయని, గత ఐదేళ్లలో ఇవే అత్యధికమని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) వెల్లడించింది. నైరుతి రుతుపవనాల ఉపసంహరణ ఆలస్యమవడం, అల్పపీడనాలు అధికంగా ఏర్పడటం, పశ్చిమ ప్రాంతం నుంచి అల్పపీడనాలతో కూడిన అవాంతరాలు చోటుచేసుకోవడమే కారణమని విశ్లేషించింది.

ఉత్తరాఖండ్‌లో గతనెల 18, 19 తేదీల్లో అనూహ్యంగా కురిసిన అతి భారీ వర్షాల కారణంగా 79 మంది ప్రాణాలు కోల్పోయారు. అక్టోబరులో ఇక్కడ సాధారణంగా 35.3 మి.మీ. వర్షపాతం నమోదవుతుంది. అందుకు భిన్నంగా ఈసారి 203.2 మి.మీ. వర్షపాతం నమోదైంది.
సాధారణంగా అక్టోబరు 15న రుతుపవనాల ఉపసంహరణ చోటుచేసుకుంటుంది. ఈ సారి 25వ తేదీ వరకూ అవి కొనసాగాయి.
☔ దేశంలో జూన్‌-సెప్టెంబరు మధ్య నైరుతి రుతుపవనాల సమయంలో సాధారణ వర్షపాతమే నమోదైంది. 1961-2010 సంవత్సరాల దీర్ఘకాల సగటు 88 సెంటీ మీటర్లు కాగా, ఈ ఏడాది 87 సెంటీ మీటర్ల వర్షపాతం నమోదైంది.
దేశంలో వరుసగా మూడో ఏడాది కూడా సాధారణ, అంతకంటే ఎక్కువ స్థాయిలో వర్షాలు కురిశాయి.

దక్షిణాదిలో నవంబరులోనూ వర్షాలు
నవంబరు నెలలో కోస్తాంధ్ర, రాయలసీమ, తమిళనాడు, పుదుచ్చేరి, కేరళ, దక్షిణ కర్ణాటక ప్రాంతాల్లో సాధారణం కంటే అధికంగానే వర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది. ఈనెల 11 వరకూ వానలు పడే అవకాశముందని; దీర్ఘకాల సగటుతో పోలిస్తే ఈ వర్షపాతం 122% అధికంగా ఉండొచ్చని ఐఎండీ డైరెక్టర్‌ జనరల్‌ మృత్యుంజయ మహాపాత్ర పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని