Devaragattu: దేవరగట్టు కర్రల సమరంలో 74 మందికి గాయాలు

ఏపీలోని కర్నూలు జిల్లాలోని హొళగుంద మండలం దేవరగట్టులో ఏటా నిర్వహించే కర్రల సమరంలో 74 మంది గాయాలపాలయ్యారు. ఏటా దసరా రోజున శ్రీమాళ మల్లేశ్వర స్వామికి బన్ని ఉత్సవం నిర్వహిస్తారు. ఉత్సవాల్లో భాగంగా ఆనవాయితీ ప్రకారం కర్రల సమరం జరుగుతుంది. 

Updated : 06 Oct 2022 10:26 IST

హొళగుంద: ఏపీలోని కర్నూలు జిల్లా హొళగుంద మండలం దేవరగట్టులో ఏటా నిర్వహించే కర్రల సమరంలో 74 మంది గాయాలపాలయ్యారు. ఏటా దసరా రోజున శ్రీమాళ మల్లేశ్వర స్వామికి బన్ని ఉత్సవం నిర్వహిస్తారు. ఉత్సవాల్లో భాగంగా ఆనవాయితీ ప్రకారం ఏటా కర్రల సమరం జరుగుతోంది. ఈ ఏడాది వర్షం కారణంగా ఉత్సవం కాస్త ఆలస్యంగా ప్రారంభమైంది.

దేవరగట్టులో మాళ మల్లేశ్వరస్వామి దసరా బన్ని జైత్రయాత్రకు ఎంతో ప్రత్యేకత ఉంది. దేవరగట్టులో సుమారు 800 అడుగుల ఎత్తైన కొండపై స్వామివారి ఆలయం ఉంటుంది. దసరా బన్ని ఉత్సవం సందర్భంగా స్వామి మూర్తులను దక్కించుకోవడానికి దేవరగుట్ట సమీపంలోని గ్రామాల ప్రజలు రెండు వర్గాలుగా విడిపోయి కర్రల సమరంలో పాల్గొంటారు. నెరణికి, నెరణికి తండా, కొత్తపేట గ్రామాల భక్తులు ఓ వైపు.. అరికెర, అరికెరతండా, సుళువాయి, ఎల్లార్తి, కురుకుంద, బిలేహాల్‌, విరుపాపురం తదితర గ్రామాల భక్తులు మరోవైపు కర్రలతో తలపడతారు. గత కొన్నేళ్లుగా కర్రల సమరం అక్కడ ఆనవాయితీగా జరుగుతోంది. స్వామివారి భవిష్యవాణి అనంతరం కర్రల సమరం ముగిసింది. గాయాలపాలైన వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. వారిని ఆలూరు, ఆదోని ఆస్పత్రులకు తరలించారు. కర్రల సమరంలో ఎలాంటి ప్రాణనష్టం జరగపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.

కర్ణాటక యువకుడు మృతి

కర్రల సమరం కారణంగా ఆ మార్గంలో భారీగా వాహనాలు నిలిచిపోవడంతో పాటు రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. కర్రల సమరానికి వెళ్తుండగా ఓ యువకుడు మృతి చెందాడు. ఆ యువకుడిని కర్ణాటకలోని శిరుగుప్పకు చెందిన రవీంద్రనాథ్‌రెడ్డిగా గుర్తించారు. అతడు గుండెపోటుతో మృతి చెందినట్టు భావిస్తున్నామని పోలీసులు తెలిపారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని