ఓ అమ్మాయి ‘మత్తులో పడకోయీ’.. హైదరాబాద్‌లో ఆడపిల్లల చుట్టూ మాదకద్రవ్యాల వల

మాదకద్రవ్యాల సరఫరా.. వాడకంలో ఇప్పటివరకూ మగవారి ఆధిపత్యమే కనిపించేది. ఇటీవల హైదరాబాద్‌ నార్కొటిక్స్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ వింగ్‌(హెచ్‌.న్యూ)కు పట్టుబడుతున్న డ్రగ్స్‌ కస్టమర్స్‌/పెడ్లర్స్‌లో మహిళలు, యువతుల సంఖ్య పెరగటం చర్చనీయాంశంగా మారింది.

Updated : 26 Mar 2023 09:26 IST

అలవాటయ్యాక స్మగ్లర్లుగా మారుతున్న వైనం

ఈనాడు, హైదరాబాద్‌: మాదాపూర్‌కు చెందిన ఐటీ ఉద్యోగిని సనాఖాన్‌(34).. భర్త నుంచి విడిపోయాక పబ్‌లో పరిచయమైన వ్యక్తితో సహజీవనం చేయసాగింది.  ముంబయి నుంచి ఎండీఎంఏ తీసుకొచ్చి నగరంలోని ఐటీ నిపుణులకు విక్రయిస్తోంది. 30 నుంచి 40 మందివరకూ ఈమె వద్ద డ్రగ్స్‌ కొనేవారుంటే.. వారిలో 21 మంది మహిళలు/యువతులే ఉన్నారు.

మాదకద్రవ్యాల సరఫరా.. వాడకంలో ఇప్పటివరకూ మగవారి ఆధిపత్యమే కనిపించేది. ఇటీవల హైదరాబాద్‌ నార్కొటిక్స్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ వింగ్‌(హెచ్‌.న్యూ)కు పట్టుబడుతున్న డ్రగ్స్‌ కస్టమర్స్‌/పెడ్లర్స్‌లో మహిళలు, యువతుల సంఖ్య పెరగటం చర్చనీయాంశంగా మారింది. గతేడాది నవంబరులో నగర పోలీసులు ‘డ్రగ్స్‌ చాక్లెట్‌ బార్స్‌’ను స్వాధీనం చేసుకున్నారు. వాటిని కొనుగోలు చేసే 120 మందిలో 50శాతం 18-24 ఏళ్లలోపు యువతులు ఉండటం పరిస్థితి తీవ్రతకు అద్దంపడుతోంది. ఏడాది వ్యవధిలో హెచ్‌న్యూ పోలీసులు 1075 మంది డ్రగ్‌ వాడకందారులను నగరంలో గుర్తించారు. వారిలో 100-120 మంది యువతులే ఉన్నారు. తాజాగా డ్రగ్స్‌ కేసులో అరెస్టయిన ముంబయికి చెందిన జతిన్‌, జావెద్‌ అమ్మాయిలకు డ్రగ్స్‌ అలవాటుచేసి లైంగిక అవసరాలు తీర్చుకుంటున్నట్టు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. ఇదే తరహాలో కొన్ని డ్రగ్స్‌ ముఠాలు నగరంలోని పబ్‌ల్లోకి చేరి.. మత్తు మైకంలో అమ్మాయిలను ముంచి లైంగిక దాడికి పాల్పడుతున్నారా! అనే కోణంలో వివరాలు సేకరిస్తున్నారు.


పార్టీ మైకం.. అదోలోకం..

మెట్రో నగరాల్లోని పబ్‌ల్లో పార్టీ సంస్కృతి భాగం.  పార్టీల్లో ఎక్కువగా వాడే ఎండీఎంఏ, ఎక్సటసీ, ఎల్‌ఎస్‌డీ బ్లాట్స్‌ తీసుకోవటంతో చుట్టూ కొత్త లోకంలో విహరిస్తున్న అనుభూతికి గురవుతారు. అదే భ్రమలో తమను తాము మరచిపోయి ప్రవర్తిస్తారు. దీన్ని అనువుగా మలచుకున్న డ్రగ్స్‌ ముఠాలు యువతులను లైంగిక అవసరాలకు ఉపయోగించుకుంటున్నారు. మరోవైపు, మత్తుకు దగ్గరైన వారిని పెడ్లర్స్‌గా  వాడుకుంటున్నాయి.


నివారణే పరిష్కారమార్గం
- డాక్టర్‌ దేవికారాణి, అమృత ఫౌండేషన్‌ వ్యవస్థాపకురాలు

పిల్లలు డ్రగ్స్‌కు అలవాటుపడ్డాక బాధపడటం కంటే ముందుగానే తల్లిదండ్రులు మేల్కోవాలి. బిడ్డలు తప్పటడుగులు వేయకుండా చూడటమే పరిష్కారమార్గం. వారితో నాణ్యమైన సమయం గడపాలి. పసితనం నుంచే క్రమశిక్షణ తప్పనిసరి చేయాలి. యుక్తవయసు బిడ్డల్లో అనుకోని మార్పు గమనించినపుడు ఆరా తీయాలి. తమకు ఏదైనా ఆపద వస్తే కాపాడేది అమ్మనాన్నలే అనే నమ్మకాన్ని వారిలో కలిగించాలి.


మత్తుదందాలపై ఉక్కుపాదం

- సీవీ ఆనంద్‌, నగర పోలీసు కమిషనర్‌

నగరానికి మాదకద్రవ్యాలు చేరవేస్తున్న కీలకసూత్రధారులను అరెస్ట్‌ చేశాం. గోవా కేంద్రంగా నడిచే దందాకు పూర్తిగా అడ్డుకట్ట వేయగలిగాం. ప్రస్తుతం ముంబయి నుంచి వచ్చే డ్రగ్స్‌ను కట్టడి చేసేందుకు సిద్ధమయ్యాం. మాదకద్రవ్యాలకు సంబంధించిన సమాచారం ఉంటే.. డయల్‌ 100, 87126 61601 నంబర్లకు ఫోన్‌చేసి వివరాలు అందజేయండి.


 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు