Andhra News: ఎమ్మెల్సీ అనంతబాబును అరెస్ట్‌ చేయాల్సిందే: కాకినాడ జీజీహెచ్‌ వద్ద ఆందోళన

వైకాపా ఎమ్మెల్సీ అనంత ఉదయ్‌భాస్కర్‌ మాజీ డ్రైవర్‌ సుబ్రహ్మణ్యం హత్య కేసుకు సంబంధించి కాకినాడ జీజీహెచ్‌ వద్ద ఆందోళన కొనసాగుతోంది.

Updated : 21 May 2022 13:38 IST

కాకినాడ: వైకాపా ఎమ్మెల్సీ అనంత ఉదయ్‌భాస్కర్‌ మాజీ డ్రైవర్‌ సుబ్రహ్మణ్యం హత్య కేసుకు సంబంధించి కాకినాడ జీజీహెచ్‌ వద్ద ఆందోళన కొనసాగుతోంది. దళిత ప్రజా సంఘాల, సీపీఐ, భాజపాల ఆధ్వర్యంలో సుబ్రహ్మణ్యం బంధువులు నిరసన తెలుపుతున్నారు. ఎమ్మెల్సీ అనంతబాబుని తక్షణం అరెస్ట్ చేయాలని మృతుడి బంధువులు జీజీహెచ్‌ మార్చురీ వద్ద డిమాండ్‌ చేస్తున్నారు. పోస్టుమార్టం చేయడానికి కుటుంబ సభ్యుల సంతకాలు చేయాల్సి ఉంది. అనంతబాబును అరెస్ట్‌ చేస్తేనే సంతకాలు పెడతామని వారు చెబుతుండటంతో.. ఇప్పటి వరకు సుబ్రహ్మణ్యం మృతదేహానికి శవపరీక్ష నిర్వహించలేదు. మరోవైపు తెదేపా నిజ నిర్ధరణ కమిటీ కాకినాడలో పర్యటించిన నేపథ్యంలో కాకినాడ జీజీహెచ్‌ వద్ద పోలీసులు భారీగా మోహరించారు. బారికేడ్లు ఏర్పాటు చేసి ఎవరినీ అనుమతించడం లేదు.

వివాహ వేడుకలో ఎమ్మెల్సీ..

నిన్న రాత్రి తునిలో జరిగిన ఓ వివాహా వేడుకకు అనంత ఉదయ్‌ భాస్కర్‌ హాజరయ్యారు. సీసీ కెమెరాల్లో రికార్డైన ఆ దృశ్యాలు బయటికొచ్చాయి. ఈ క్రమంలో పోలీసుల తీరును ప్రముఖ న్యాయవాది శ్రవణ్‌కుమార్‌ తప్పుబట్టారు. ఉదయ్‌భాస్కర్‌ను ఇప్పటికీ అరెస్టు చేయకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వైకాపా ఎమ్మెల్సీని అరెస్టు చేయాల్సిందే అని ఆయన డిమాండ్‌ చేశారు. ఎమ్మెల్సీ కారులోనే సుబ్రహ్మణ్యం మృతదేహం ఉండటం నిన్న రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపింది. సుబ్రహ్మణ్యాన్ని స్వయంగా అనంతబాబే తన కారులో తీసుకెళ్లడం.. ప్రమాదం జరిగిందని అర్ధరాత్రి కుటుంబసభ్యులకు చెప్పిన విషయం తెలిసిందే.



Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని