Published : 24 May 2022 18:38 IST

KTR in Davos: వాటిపై ప్రజల విశ్వాసం పొందడమే ప్రభుత్వాలకు అసలైన సవాల్: కేటీఆర్‌

దావోస్‌: ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌, మెషిన్ లెర్నింగ్, బ్లాక్ చైన్, డేటా సైన్సెస్ వంటి సాంకేతిక పరిజ్ఞానం రెండు వైపులా పదును ఉన్న కత్తి లాంటివని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. వాటి ఉపయోగాలతో కలిగే లాభనష్టాలపై ప్రభుత్వాలకు పూర్తి స్థాయిలో అవగాహన ఉండాలన్నారు. దావోస్‌లో జరుగుతున్న వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరమ్‌ చర్చాగోష్టిలో ‘‘ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆన్ ది స్ట్రీట్ - మేనేజింగ్ ట్రస్ట్ ఇన్ ది పబ్లిక్ స్క్వేర్’’ అనే అంశంపై కేటీఆర్‌ ప్రసంగించారు. చర్చాగోష్టిలో కేటీఆర్‌తో పాటు ఎన్ఈసీ జపాన్ సీఈఓ తకాయుకి మోరిటా, ఉషాహిది, దక్షిణాఫ్రికాకు చెందిన ఈడీఎంజీ నికోల్ ఎడ్జ్ టెక్ సీఈఓ కోయెన్ వాన్ ఓస్ట్రోమ్ పాల్గొన్నారు.

‘‘ఫేషియల్ రికగ్నిషన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విస్తృత ఉపయోగానికి ప్రజల విశ్వాసం, నమ్మకం పొందడమే ప్రభుత్వాలకు అసలైన సవాల్. డేటా భద్రత, వినియోగంలో నిష్పక్షపాతంగా వ్యవహరించడంతో పాటు అనుమతి లేకుండా ఈ సాంకేతికతను నిఘా కార్యకలాపాలకు ఉపయోగించమన్న భరోసా ప్రజలకు కల్పించాల్సిన అవసరం ఉంది. ఈ టెక్నాలజీ వినియోగంపై ప్రభుత్వ విభాగాలకు ఉండాల్సిన నియంత్రణ, అధికారాలను స్పష్టంగా నిర్దేశించినప్పుడే ఇది సాధ్యమవుతుంది. ఈ అధికారాలను పార్లమెంటరీ పద్ధతిలో, పారదర్శకంగా ప్రభుత్వ విభాగాలకు కల్పించాలి. ఫేషియల్ రికగ్నిషన్ టెక్నాలజీతో నేరస్తులు, తప్పిపోయిన వ్యక్తులను గుర్తించడంలో పోలీసులకు వ్యక్తులపై ఆధారపడే అవసరం తగ్గుతుంది. సరైన విధానంలో ఈ టెక్నాలజీని వినియోగిస్తే పోలీసులతో పాటు ప్రజలకు కూడా విస్తృత ప్రయోజనం కలుగుతుంది. ఫేషియల్ రికగ్నిషన్‌తో సేకరించే డేటా, వచ్చే ఫలితాన్ని ముందుగా ప్రజలతో పంచుకున్నప్పుడే ఈ ప్రక్రియ విజయవంతం అవుతుంది. ఫేషియల్ రికగ్నిషన్‌తోనే నేర నియంత్రణ, సమర్థ పోలీసింగ్ సాధ్యమవుతుంది. ప్రభుత్వ వ్యవస్థలపై ప్రజలకు నమ్మకం కలిగించేలా మరిన్ని చర్యలను తీసుకోవాల్సిన అవసరం ఉంది’’ అని కేటీఆర్‌ పేర్కొన్నారు.

నోవార్టీస్ సీఈవోతో కేటీఆర్‌ భేటీ..

హైదరాబాద్‌లోని కార్యాలయం తమకు రెండో అతిపెద్ద కార్యాలయంగా మారిందని అంతర్జాతీయ ఫార్మా దిగ్గజం నోవార్టిస్ ప్రకటించింది. దావోస్‌లో మంత్రి కేటీఆర్‌తో సమావేశమైన నోవార్టిస్ సీఈవో వసంత్ నరసింహన్.. రాష్ట్రంలో విస్తరణ ప్రణాళికలపై చర్చించారు. హైదరాబాద్‌లో తమ కార్యాలయాన్ని ప్రారంభించిన స్వల్ప కాలంలోనే అద్భుతమైన వృద్ధిని సాధించిందన్నారు. స్విట్జర్లాండ్ బాసెల్‌లోని తమ కేంద్ర కార్యాలయం తర్వాత సుమారు 9000 మంది ఉద్యోగులతో హైదరాబాద్ కేంద్రం రెండో అతి పెద్ద కార్యాలయంగా మారిందన్నారు. హైదరాబాద్‌లో ఉన్న ఇన్నోవేషన్, నైపుణ్యం కలిగిన మానవ వనరుల వల్లే ఇది సాధ్యమైందన్న నరసింహన్.. ఈ కేంద్రాన్ని తమ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా, డిజిటల్ కార్యక్రమాలకు ఆసియా పసిఫిక్ కేంద్రంగా ఎంచుకున్నట్లు తెలిపారు.

కంపెనీ వృద్ధిపై అభినందనలు తెలిపిన కేటీఆర్... హైదరాబాద్ అతిపెద్ద కార్యక్షేత్రంగా మారడం అత్యంత సంతోషదాయకమన్నారు. నోవార్టిస్ కార్యకలాపాల విస్తరణతో తెలంగాణ లైఫ్ సైన్సెస్‌ రంగానికి ఎంతో మేలు చేకూరుతుందని కేటీఆర్ అభిప్రాయపడ్డారు. నోవార్టిస్ వల్ల ప్రపంచ లైఫ్ సైన్సెస్ రంగంలో హైదరాబాద్ ఒక అగ్రశ్రేణి, ఆకర్షణీయ పెట్టుబడుల గమ్యస్థానంగా మారిందన్నారు.

Read latest General News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

మరిన్ని