Health: హెపటైటిస్‌ కాటేస్తుంది.. కాలేయం జాగ్రత్త..!

తరచు వాంతులు కావడం, ఎప్పుడూ వికారంగా ఉండటం,ఆకలి లేకపోవడం,తిన్నది సరిగా జీర్ణం కాకపోవడం చూడ్డానికి ఇవీ ప్రమాదకర జబ్బులుగా కనిపించవు

Published : 27 May 2022 02:01 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: తరచూ వాంతులు కావడం, ఎప్పుడూ వికారంగా ఉండటం, ఆకలి లేకపోవడం, తిన్నది సరిగా జీర్ణం కాకపోవడం.. చూడటానికి ఇవి ప్రమాదకర జబ్బులుగా కనిపించవు.. కానీ వీటి వెనుక ప్రాణాంతకమైన హెపటైటీస్‌ ఇన్‌ఫెక్షన్లు ఉండొచ్చని వైద్యులు చెబుతున్నారు. ఈ లక్షణాల్లో చాలా వరకు కాలేయాన్ని కబళించే హెపటైటీస్‌కు సంబంధించినవే. కలుషిత ఆహారం, నీరు తీసుకున్నపుడు వైరస్‌ మనలోకి ప్రవేశిస్తుంది. ఈ ఇన్‌ఫెక్షన్లు ప్రభావం, నివారణ మార్గాలకు సంబంధించి ప్రముఖ గ్యాస్ట్రోఎంటరాలజిస్టు సోమశేఖరరావు పలు కీలక విషయాలను పంచుకున్నారు.

కాలేయం ఏంచేస్తుంది?: శరీరంలో పెద్ద రసాయన కేంద్రం కాలేయం. దాదాపుగా 500 రకాల విధులను నిర్వహిస్తుంది. ఆహారంలోని కొవ్వును వేరు చేసి శక్తిగా మారుస్తుంది. జీర్ణశక్తికి అవసరమైన పైత్య రసాన్ని నిరంతరం స్రవిస్తుంది. శరీరంలో విడుదలయ్యే హానికరమైన విషతుల్యాలను వేరు చేస్తూ రక్షణ కవచంలా పని చేస్తుంది. ఇంతటి కీలకమైన అవయవానికి హెపటైటీస్‌ ఇన్‌ఫెక్షన్లు అతి పెద్ద సవాల్‌గా మారాయి.

హెపటైటిస్‌ ఎలా వస్తుంది?: కాలేయంలోని ప్రతిఒక్క కణానికి వాపు వస్తుంది. ఇది వైరస్‌తో వస్తుంది. దీన్నే హెపటైటీస్‌ అంటాం. ఇవి ఐదు రకాలు. ఎ,డి,ఈ వస్తే  కళ్లు పచ్చగా మారుతాయి. లో గ్రేడు జ్వరం వస్తుంది. బాగా నీరసపడిపోతారు. ఈ ఇన్‌ఫెక్షన్లు రెండు వారాల్లోపే తగ్గిపోతాయి. గర్భిణులకు హెపటైటిస్‌ వస్తే ప్రమాదకరంగా మారుతుంది. హెపటైటిస్‌ బీ,సీలు దీర్ఘకాలికంగా శరీరంలో ఉండిపోతాయి. దీనితో లివర్‌ క్యాన్సర్‌ కూడా వచ్చే అవకాశం ఉంది.

ఇవీ ప్రమాదకరం: హెపటైటీస్‌ బీ,సీ ఇన్‌ఫెక్షన్లు ఎలా వచ్చాయో కూడా తెలియదు. నెమ్మదిగా దూదిపింజంలా ఉండే లివర్‌ గట్టిగా మారిపోతుంది. సిరోసిస్‌ ఆఫ్‌ లివర్‌గా మారిన తర్వాత సమస్యగా మారుతుంది. కడుపులో నీరు చేరుతుంది. కాళ్లు వాపు వస్తుంది. రక్త వాంతులు కూడా అవుతాయి. రక్తమార్పిడి, లైంగిక సంపర్కంతో వస్తుంది. 

నివారణ సాధ్యమేనా: హెపటైటీస్‌ బీ, సీ ప్రమాదకరమే అయినా మందులు మాత్రం అందుబాటులో ఉన్నాయి. సీ వైరస్‌కు 24 వారాల పాటు మందులు వాడితే తగ్గిపోయే అవకాశం ఉంది. హైపటైటిస్‌ బీకి మందులున్నాయి. వైరస్‌ లివర్‌ను దెబ్బతీస్తుందని తెలిసినపుడే మందులు వాడాలి. రోజుకొకటి చొప్పున జీవితాంతం వాడాల్సి రావొచ్చు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని