AP News: తోలు బొమ్మలతో పాఠాలు చెబుతున్న ఉపాధ్యాయుడు

విద్యార్థులకు నల్లబోర్డుపై పాఠాలు చెప్పడం అందరు ఉపాధ్యాయులు చేసే పనే. కానీ ఆ మాస్టారి శైలి మాత్రం కాస్త

Published : 31 Jul 2021 23:10 IST

తూర్పుగోదావరి: విద్యార్థులకు బోర్డుపై పాఠాలు చెప్పడం అందరు ఉపాధ్యాయులు చేసే పనే. కానీ ఆ మాస్టారి శైలి మాత్రం కాస్త విభిన్నం. ఆకులు, సబ్బులు, కూరగాయలు, పండ్లపై బొమ్మలు చెక్కి పాఠ్యాంశాలు బోధించడం ఆయన ప్రత్యేకత. తాటాకులతో అల్లికల ద్వారా తోలు బొమ్మలు రూపొందించి విద్యార్థులతో పాటు గురువులకూ శిక్షణ ఇస్తున్నారు తూర్పుగోదావరి జిల్లాకు చెందిన ఉపాధ్యాయుడు గోవిందరాజులు.

తూర్పుగోదావరి జిల్లా, గొల్లప్రోలు మండలం, చిన్న జగ్గంపేటలోని ప్రాథమిక పాఠశాలలోని సైన్సుటీచరుగా పనిచేస్తున్నారు గోవిందరాజులు. విద్యార్థులకు అర్థమయ్యేలా బొమ్మలు, కళా రూపాలతో బోధించడం ఈయన ప్రత్యేకత.  ఆకులు, సబ్బులు, సుద్ద ముక్కలు, పండ్లపై బొమ్మలు చెక్కుతున్నారు. కాగితాలతో బొమ్ములు తయారుచేస్తున్నారు. అపురూపమైన వివిధ కళా రూపాలను రూపొందించడంలో గోవిందరాజులు నైపుణ్యం సాధించారు. ఈయన చేతినుంచి జాలువారిన బొమ్మలు, కళారూపాలు విద్యార్థులకు పాఠ్య కథాంశాలుగా మారాయి. 

విద్యార్థుల్లో దాగిఉన్న సృజనాత్మకతను వెలికి తీసేందుకు వివిధ కళారూపాలతో విద్యాబోధన చేస్తున్నారు గోవిందరాజులు. అలాగే అంతరించిపోతున్న తోలుబొమ్మల కళకు తిరిగి ప్రాణం పోసేందుకు సంకల్పించారు. స్పాంజితో తోలుబొమ్మలు తయారుచేసి వాటిద్వారా కూడా పాఠాలు చెబుతున్నారు. ఇలా బోధించడంవల్ల  విద్యార్థులు సులభంగా అవలోకనం చేసుకుంటారని గోవిందరాజులు చెబుతున్నారు. 

ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని ఉపాధ్యాయులు, డైట్ విద్యార్థులకు వర్క్‌షాప్‌లు నిర్వహించి బొమ్మలు, కళారూపాలు రూపొందించడంలో గోవిందరాజులు శిక్షణ ఇస్తున్నారు. ఆయన పాఠాలు పిల్లలకు ఎంతగానో ఉపయోగపడుతున్నాయని తోటి ఉపాధ్యాయులు చెబుతున్నారు. ఈ విధంగా వినూత్న రీతిలో విద్యాబోధన చేస్తున్న గోవిందరాజులు జిల్లా, రాష్ట్ర స్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయునిగా అవార్డులు అందుకున్నారు. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని