AP PRC: ఉద్యోగుల కోరికలు సమంజసంగా ఉండాలి: మంత్రి బొత్స

పీఆర్సీ జీవోల ప్రకారమే ఉద్యోగులకు జీతాలు అందుతాయని ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. ఒకటో తేదీనే జీతాలు ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని

Updated : 31 Jan 2022 15:31 IST

తాడేపల్లి: కొత్త పీఆర్సీ ప్రకారమే ఉద్యోగుల వేతనాలను చెల్లిస్తామని మంత్రి బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. ఒకటో తేదీనే జీతాలు ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని చెప్పారు. పీఆర్సీ జీవోలపై రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఆయా అంశాలపై చర్చించేందుకు మంత్రుల కమిటీ సీఎంతో సమావేశమైంది. మంత్రులు బొత్స సత్యనారాయణ, సజ్జల రామకృష్ణారెడ్డి, ఆర్థికశాఖ అధికారులు జగన్‌తో భేటీ అయ్యారు.  అనంతం బొత్స మీడియాతో మాట్లాడుతూ.. ఒక్కసారి  జీవో ఇచ్చిన తర్వాత దాని ప్రకారమే వేతనాలు వస్తాయన్నారు. ఫిట్మెంట్ , హెచ్ఆర్ఏ, డీఏలు అన్నీ కొత్త జీవోల ప్రకారమే చెల్లిస్తామన్నారు. ఉద్యోగ సంఘాలను చర్చలకు ఆహ్వానించామని, వారి కోసం ప్రభుత్వం నియమించిన మంత్రుల కమిటీ 3 రోజుల పాటు ఎదురు చూసిందని చెప్పారు.

మరోవైపు ఒకటో తేదీన జీతాలు ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని ఉద్యోగ సంఘాలు అంటున్నాయని, అందుకే వేతనాలు వేస్తున్నామని బొత్స వివరించారు. ఉద్యోగ సంఘాల అభిప్రాయమేంటో తెలియకుండా మంత్రుల కమిటీ ఎలా సిఫార్సులు చేస్తుందని ఆయన ప్రశ్నించారు. ఏపీలో పనిచేస్తున్న ఉద్యోగులకు ఇక్కడి నాయకత్వంపై విశ్వాసం లేకపోతే ఎలా అని మంత్రి బొత్స వ్యాఖ్యానించారు. ప్రభుత్వాన్ని కించపరిచేలా మాట్లాడితే తదుపరి పర్యవసానాలు ఉంటాయని గుర్తుంచుకోవాలన్నారు. బాధ్యతగల వ్యక్తులుగా, రాష్ట్ర ప్రజల కస్టోడియన్లుగా మంత్రులు ఎక్కడా బాధ్యతారాహిత్యమైన ప్రకటనలు చేయటం లేదన్నారు. ప్రజలు, ప్రభుత్వ ఇబ్బందుల దృష్టిలో ఉంచుకుని ఉద్యోగులు తమ డిమాండ్లను వినిపించాలన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని