Telangana News: వరంగల్‌ ఎంజీఎం ఘటన.. బాధ్యులపై కఠిన చర్యలు: ఎర్రబెల్లి

వరంగల్‌ ఎంజీఎం ఆస్పత్రిలో శ్రీనివాస్ అనే రోగి కాలు, చేతివేళ్లను ఎలుకలు కరిచిన ఘటనలో బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు స్పష్టం చేశారు.

Updated : 01 Apr 2022 16:21 IST

హనుమకొండ: వరంగల్‌ ఎంజీఎం ఆస్పత్రిలో శ్రీనివాస్ అనే రోగి కాలు, చేతివేళ్లను ఎలుకలు కరిచిన ఘటనలో బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు స్పష్టం చేశారు. ఐసీయూలో ఎలుకలు కరవడం పూర్తిగా బాధ్యతారాహిత్యమన్నారు. ఆస్పత్రులను మెరుగు పరుస్తున్నామని.. ఇలాంటి లోపాలు ఉండటం కూడా సరికాదని మంత్రి పేర్కొన్నారు. జిల్లాకు చెందిన మంత్రిగా ఎంజీఎం ఆస్పత్రిలో సౌకర్యాలపై వైద్యవిద్య సంచాలకులు డాక్టర్ రమేశ్ రెడ్డితో కలిసి ఇవాళ మంత్రి పరిశీలించారు. ఆస్పత్రిలో కలియతిరిగి పరిసరాలను పరిశీలించారు. రోగిని ఎలుక కరిచిన ఘటన వివరాలను అడిగి తెలుసుకున్నారు. బాధితుడు శ్రీనివాస్‌ కుటుంబసభ్యులను మంత్రి పరారమర్శించారు.

‘‘ఆస్పత్రిలో నిర్లక్ష్యం కారణంగా లోపం జరిగింది. దీనిపై పూర్తి స్థాయి విచారణకు ఆదేశించాం. ఘటన జరిగిన తర్వాత విషయాన్ని ఆస్పత్రి సూపరింటెండెంట్‌ దృష్టికి తీసుకెళ్లారని.. ఆస్పత్రిలో పరిశుభ్రత సరిగా లేదనే విషయాలు మా దృష్టికి వచ్చాయి. వీటన్నింటికి బాధ్యులైన వారిపై చర్యలు తీసుకుంటాం. కొవిడ్‌ సమయంలో ఎంజీఎం ఆస్పత్రి పెద్ద ఎత్తున సేవలు అందించింది. వైద్యులు, సిబ్బంది అందరూ బాగా పనిచేశారు. నేను ప్రత్యేకంగా ఎవరినీ ఏమీ అనడం లేదు. కానీ, ఈ ఘటన పూర్తిగా నిర్లక్ష్యం కారణంగానే జరిగిందని స్పష్టంగా తెలుస్తోంది. జిల్లా కలెక్టర్‌ ఇచ్చిన నివేదిక ఆధారంగా ఇప్పటికే ఆస్పత్రి సూపరింటెండెంట్‌ని బదిలీ చేయడంతో పాటు ఇద్దరు వైద్యులను సస్పెండ్ చేశాం. బాధితుడు శ్రీనివాస్‌ కుటుంబసభ్యులతో మాట్లాడాను. మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ నిమ్స్‌కి తరలిస్తామని చెప్పడంతో వారు ఒప్పుకున్నారు’’ అని మంత్రి వివరించారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని