
TS News: ఎనుమాముల మార్కెట్లో మిర్చి రైతుల ఆందోళన.. కాంటాలు ధ్వంసం
వరంగల్: మిర్చి పంటకు గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్ చేస్తూ వరంగల్లోని ఎనుమాముల మార్కెట్లో రైతులు తీవ్రస్థాయిలో నిరసన తెలుపుతున్నారు. తమకు ప్రభుత్వం న్యాయం చేయాలంటూ మార్కెట్ కార్యాలయం వద్ద ధర్నా కొనసాగిస్తున్నారు. రైతుల ఆందోళన నేపథ్యంలో వ్యాపారులతో అధికారులు చర్చలు జరిపారు. మిర్చి నాణ్యత చూసి మరోసారి పరిశీలించాలని.. ధరలు సవరించాలని వ్యాపారులకు అధికారులు సూచించారు. ఈ విషయంలో మార్కెట్ ఛైర్మన్ చెప్పినప్పటికీ రైతులు వినలేదు. నిర్ణయించిన ధరకు రూ.2వేలు అదనంగా ఇవ్వాలని రైతులు డిమాండ్ చేశారు. ఓ వైపు చర్చలు జరుగుతుండగానే మరోవైపు అధికారులు కాంటాలు నిర్వహించడంపై రైతులు భగ్గుమన్నారు. కాంటాలు నిర్వహణను అడ్డుకుని తూకం పూర్తయిన బస్తాలను ట్రాక్టర్ల పైనుంచి కింద పడేశారు. ఈ క్రమంలో కాంటాలతో పాటు డీసీఎం వాహనం అద్దాలను రైతులు ధ్వంసం చేశారు. రైతుల ఆందోళన నేపథ్యంలో మార్కెట్ వద్ద పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.
Advertisement