Nara Lokesh: పత్రాలు తగులబెడితే పాపాలు పోతాయా?: లోకేశ్‌

జగన్ పుణ్యమా అని సీఐడీ క్రైమ్ ఇన్వాల్వ్‌మెంట్‌ డిపార్టుమెంట్‌గా మారిపోయిందని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ ఎక్స్‌(ట్విటర్‌) వేదికగా విమర్శించారు. 

Updated : 08 Apr 2024 15:45 IST

అమరావతి: జగన్ పుణ్యమా అని సీఐడీ క్రైమ్ ఇన్వాల్వ్‌మెంట్‌ డిపార్టుమెంట్‌గా మారిపోయిందని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ ఎక్స్‌(ట్విటర్‌) వేదికగా విమర్శించారు. ‘‘మేం ఎప్పటినుంచో చెబుతున్న మాటలు నేడు నిజమయ్యాయి. రాష్ట్రంలో కొందరు ఐపీఎస్‌లు తమ ఉద్యోగ ధర్మాన్ని వీడి జగన్‌ పోలీస్‌ సర్వీస్‌(జేపీఎస్)గా మారారు. ఐపీఎస్‌లు ఇంతగా బరితెగించడం దేశ చరిత్రలో ఇదే ప్రథమం. మా కుటుంబంపై బురద చల్లేందుకు భారీ కుట్ర జరిగింది. నిబంధనలకు విరుద్ధంగా సీఐడీ డీఐజీ రఘురామిరెడ్డి మా వ్యక్తిగత సమాచారాన్ని సేకరించారు. అధికారం పోతుందని తెలిసే పత్రాలు దహనం చేశారు. పత్రాలు తగులబెడితే పాపాలు పోతాయా? జగన్‌ ప్రభుత్వానికి అంతిమ ఘడియలు సమీపించాయి. చేసిన నేరానికి మూల్యం చెల్లించుకోక తప్పదు.’’ అని లోకేశ్‌ మండిపడ్డారు.

తాడేపల్లి సిట్‌ కార్యాలయం కాంపౌండ్‌లో పలు పత్రాలను సిబ్బంది దహనం చేసిన సంగతి తెలిసిందే. ఇది పలు అనుమానాలకు తావిస్తోంది. వీటిని తగలబెట్టడాన్ని స్థానికులు ప్రశ్నించడంతో పాటు వీడియోలు తీశారు. ఆ వీడియోలను తమకు ఇవ్వాలని స్థానికులపై సీఐడీ ఒత్తిడి తెస్తోంది. సీఐడీ చీఫ్‌ రఘురామ్‌రెడ్డి ఆదేశాల మేరకు పత్రాలు తగలబెట్టినట్లు సిబ్బంది చెబుతున్నారు. హెరిటేజ్‌ సంస్థ కీలక పత్రాలు సహా ఇతర దస్త్రాలు అందులో ఉన్నట్లు తెదేపా నేతలు ఆరోపిస్తున్నారు.

అస్పష్టంగా ప్రింట్‌ అయిన పేపర్లను కాల్చేశాం:  సీఐడీ

పత్రాల దహనంపై సీఐడీ స్పందించింది. ఐదు కేసుల్లో విజయవాడ అనిశా కోర్టులో అభియోగ పత్రాలు దాఖలు చేశామని, ఒక్కో అభియోగపత్రంలో 8 వేల నుంచి 10 వలే పేజీలున్నాయని తెలిపింది. ఫొటోకాపీ మెషీన్‌ వేడెక్కడంతో కొన్ని పేపర్లు అస్పష్టంగా ప్రింట్‌ అయినట్లు తెలిపింది. అలాంటి వాటిని దహనం చేస్తుంటామని, కేసులకు సంబంధించిన ఆధారాలన్నీ కోర్టుకు సమర్పించామని తెలిపింది. ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది.

పత్రాలను దగ్ధం చేయటం వెనుక ఆంతర్యం ఏంటి?: రామకృష్ణ

పత్రాలు తగలబెట్టిన ఘటనపై సమగ్ర విచారణ జరపాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ డిమాండ్ చేశారు. ‘‘సీఐడీ చీఫ్ రఘురామిరెడ్డి ఆదేశాల మేరకు సిట్ ఆఫీసులో సిబ్బంది కీలక పత్రాలు తగలబెట్టినట్లు తెలుస్తోంది. తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలాగే ఏపీలో సిట్ అక్రమ కేసుల వ్యవహారం సాగింది. హెరిటేజ్ సంస్థకు సంబంధించిన పత్రాలను దగ్ధం చేయటం వెనుక ఆంతర్యం ఏంటి? సీఐడీ అక్రమాలు వెలుగులోకి వస్తాయనే కీలక పత్రాలను దగ్ధం చేశారా?’’అని ఆయన ప్రశ్నించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని