TS News: పాకాల సరస్సుకు పెనుశాపంగా ప్లాస్టిక్ మహమ్మారి!

చుట్టూ దట్టమైన అటవీ ప్రాంతం. ఎన్నో రకాల పక్షి జాతులు, ప్రకృతి సోయగాలతో పర్యాటకులను అమితంగా ఆకట్టుకునే ప్రాంతం.. పాకాల సరస్సు.

Published : 11 Dec 2021 19:32 IST

వరంగల్‌: చుట్టూ దట్టమైన అటవీ ప్రాంతం. ఎన్నో రకాల పక్షి జాతులు, ప్రకృతి సోయగాలతో పర్యాటకులను అమితంగా ఆకట్టుకునే ప్రాంతం.. పాకాల సరస్సు. స్వచ్ఛతకు చిరునామాగా పేరొందిన ఈ సరస్సు.. ఆసియాలోనే ఏడో స్వచ్ఛమైన సరస్సుగా నిలిచింది. ఇలా ఎన్నో విశిష్టతలున్న ఈ తటాకానికి.. ప్లాస్టిక్ మహమ్మారి పెనుశాపంగా మారింది. సందర్శకులు, సమీప ప్రాంతాల ప్రజల విచ్చలవిడి ప్లాస్టిక్ వాడకంతో పాకాల సరస్సు క్రమంగా కాలుష్యపు కోరల్లో చిక్కుకుంటోంది.

కాకతీయుల పాలనకు సజీవ సాక్ష్యం.. అన్నదాతలకు అండగా, ప్రకృతి ప్రేమికులను కనువిందు చేసే పాకాల సరస్సు క్రమంగా కలుషితమవుతోంది. వరంగల్ జిల్లా ఖానాపూర్‌ మండలంలోని ఈ సరస్సు.. ప్రకృతి రమణీయతకు మారుపేరుగా నిలుస్తోంది. వందలాది మొసళ్లకు ఆవాసంగా ఉన్న ఈ తటాకానికి ప్లాస్టిక్‌ శాపంగా మారుతోంది. చెరువు పరిసర గ్రామాలకు చెందిన ప్రజలు, వివిధ ప్రాంతాల నుంచి వచ్చే సందర్శకులు విచ్చలవిడిగా ప్లాస్టిక్‌ వినియోగిస్తున్నారు. పాలిథీన్‌ కవర్లు, వాటర్‌ బాటిళ్లు, ఇతర ఆహార పొట్లాలను ఇష్టానుసారంగా అక్కడి పరిసరాల్లో పడేస్తుండటంతో.. అవన్నీ సరస్సులోకి కొట్టుకువస్తున్నాయి. పర్యాటక ప్రాంతాల్లో ప్లాస్టిక్‌ నిషేధాన్ని కొన్ని చోట్ల అమలు చేస్తున్నా.. పాకాల వద్ద మాత్రం విచ్చలవిడిగా ఉపయోగిస్తున్నారు. హైదరాబాద్‌లోని జూ పార్కులో ప్లాస్టిక్‌ను పూర్తిగా నిషేధించిన అధికారులు.. జూ లోపలికి పంపేముందు పక్కాగా తనిఖీలు చేస్తున్నారు. సందర్శకులు తెచ్చిన ప్లాస్టిక్‌ వస్తువులను అందులోకి అనుమతించడంలేదు. ప్రకృతి రమణీయతకు మారుపేరుగా నిలిచే పాకాల వద్ద సైతం అలాంటి నిబంధనలు విధిస్తే కాలుష్యం బారిన పడకుండా కాపాడే అవకాశం ఉంటుంది. అలా చేయకపోతే భవిష్యత్తులో సరస్సు మనుగడకు ముప్పు సంభవించే ప్రమాదం ఉందని పర్యావరణ ప్రేమికులు హెచ్చరిస్తున్నారు.

Read latest General News and Telugu News


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని