Yadadri: యాదాద్రిలో మొదలైన పవిత్రోత్సవాలు

తెలంగాణలో ప్రసిద్ధిగాంచిన యాదాద్రి పంచనారసింహుల మహాదివ్య పుణ్యక్షేత్రంలో వార్షిక ఆలయ పవిత్రోత్సవాలు శనివారం రాత్రి పాంచారాత్రాగమ విధానాలతో మొదలయ్యాయి.

Published : 26 Aug 2023 22:05 IST

యాదగిరిగుట్ట: తెలంగాణలో ప్రసిద్ధిగాంచిన యాదాద్రి పంచనారసింహుల మహాదివ్య పుణ్యక్షేత్రంలో వార్షిక ఆలయ పవిత్రోత్సవాలు శనివారం రాత్రి పాంచారాత్రాగమ విధానాలతో మొదలయ్యాయి. దైవారాధనల్లో ఏవైనా పొరపాట్లు ఏర్పడితే, వాటి నివారణకై ఈ ఉత్సవాలను ఏటా నిర్వహిస్తారు. ఆ క్రమంలోనే మూడ్రోజులుగా కొనసాగే పవిత్రోత్సవాల నిర్వహణలో ఎలాంటి విజ్ఞాలు కలగకుండా దీవించాలంటూ విష్వక్సేన ఆళ్వారుడిని ఆరాధిస్తూ ప్రత్యేక పూజ చేపట్టారు. ఆదిపూజగా విష్వక్సేనుడికి నిర్వహించి, వేడుకలకు అంకురార్పణం చేశారు.

ఆలయ మహాముఖ మండపంలో పవిత్రోత్సవాలకు శ్రీకారం చుట్టారు. ప్రబంధ పారాయణం, హవనం నిర్వహించారు. ప్రత్యేక ఆరాధనలతో వివిధ వర్ణాలకు చెందిన 108 నూలు పోగులతో పవిత్రలు సిద్ధం చేసి, వాటిని మంత్రోచ్చారణల మధ్య సోమవారం గర్భాలయంలోని మూలవరులకు ధరింపజేస్తామని ఆలయ ప్రధాన పూజారులు తెలిపారు. ఈ ఉత్సవాల సందర్భంగా ఆదివారం, సోమవారం శ్రీలక్ష్మీనరసింహస్వామి నిత్యకల్యాణం రద్దు చేస్తున్నట్లు ఆలయ ఈవో తెలిపారు. అనుబంధంగా కొనసాగుతున్న పాతగుట్ట ఆలయంలోనూ వార్షిక పవిత్రోత్సవాలు శనివారం రాత్రి సంప్రదాయ పూజలతో మొదలయ్యాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని