Chandrababu: చంద్రబాబు సభలో అపశృతి.. తోపులాటలో 8మంది మృతి

నెల్లూరు జిల్లా కందూరులో తెదేపా అధినేత చంద్రబాబు పర్యటన సందర్భంగా అపశృతి చోటు చేసుకుంది. కార్యకర్తలు భారీగా తరలిరావడంతో తోపులాట జరిగి ఎనిమిది మంది కార్యకర్తలు మృతి చెందారు.

Updated : 28 Dec 2022 22:30 IST

హైదరాబాద్‌: తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు పాల్గొన్న నెల్లూరు జిల్లా కందుకూరు సభలో అపశృతి చోటు చేసుకుంది.  కార్యకర్తలు భారీగా తరలి రావడంతో తోపులాట జరిగి కొందరు కార్యకర్తలు పక్కనే ఉన్న కాలువలో  పడిపోయారు. అప్రమత్తమైన తెదేపా నేతలు గాయపడిన కార్యకర్తలను వెంటనే ఆసుపత్రికి తరలించారు. కందుకూరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ  8మంది మృతి  కార్యకర్తలు మృతి చెందారు. వెంటనే చంద్రబాబు నాయుడు తన ప్రసంగం ఆపేసి.. ఆసుపత్రి వెళ్లి బాధితులను పరామర్శించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. అనంతరం చంద్రబాబు బహిరంగ సభవేదిక వద్దకు చేరుకుని మాట్లాడుతూ.. కందుకూరులో ఇలాంటి దుర్ఘటన జరగడం మనసు కలచివేసిందన్నారు. అమాయకులు చనిపోవడం బాధ కలిగిస్తోందన్నారు. మృతుల కుటుంబాలకు పార్టీ తరఫున రూ.10లక్షల చొప్పున ఆర్థిక సాయం అందించనున్నట్టు ప్రకటించారు. బహిరంగ సభను సంతాప సభగా ప్రకటించిన చంద్రబాబు.. బాధిత కుటుంబాలను అన్ని విధాలా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. బాధితుల పిల్లలను ఎన్టీఆర్‌ ట్రస్ట్‌ విద్యాసంస్థల్లో చదివిస్తామన్నారు. మృతులకు పార్టీ తరఫున గురువారం అంత్యక్రియలు నిర్వహించనున్నట్టు చెప్పారు.  మృతులు.. మధుబాబు, చిన కొండయ్య, పురుషోత్తం, కాకుమాని రాజా, దేవినేని రవీంద్రబాబు, ఈదుమూరి రాజేశ్వరి, కలవకూరి యానాదిగా గుర్తించారు.

 బాధితులను పరామర్శించేందుకు ఆసుపత్రికి వచ్చిన చంద్రబాబు

కార్యకర్తల మృతి పార్టీకి తీరని లోటు: నారా లోకేశ్‌

కందుకూరులో చంద్రబాబు పర్యటనలో అపశృతి తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ ఆవేదన వ్యక్తం చేశారు. తమ కుటుంబ సభ్యులైన తెదేపా కార్యకర్తల మృతి పార్టీకి తీరని లోటని విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సంతాపం తెలిపారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించే ఏర్పాట్లు చేశామని, వారంతా కోలుకోవాలని లోకేశ్‌ ప్రార్థించారు. బాధిత కుటుంబాలకు తెలుగుదేశం పార్టీ అన్ని విధాలుగా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని