Viveka Murder case: వివేకా హత్య కేసు.. అప్పటివరకు అవినాష్‌ను అరెస్టు చేయొద్దు: హైకోర్టు

వివేకా హత్య కేసు విచారణలో భాగంగా సీబీఐ తనపై తీవ్రమైన చర్యలు తీసుకోకుండా ఆదేశించాలని కడప ఎంపీ అవినాష్‌రెడ్డి వేసిన పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.

Updated : 10 Mar 2023 19:49 IST

హైదరాబాద్‌: మాజీ మంత్రి వైఎస్‌ వివేకా హత్యకేసులో (Viveka Murder case) ఆరోపణలు ఎదుర్కొంటున్న కడప ఎంపీ అవినాష్‌రెడ్డిని (MP Avinash Reddy) సోమవారం వరకు అరెస్టు చేయవద్దని సీబీఐని (CBI) తెలంగాణ హైకోర్టు (TS High court) ఆదేశించింది. కేసుకు సంబంధించిన పూర్తి వివరాలు సోమవారం సమర్పించాలని ఆదేశించింది. తనపై తీవ్రమైన చర్యలు తీసుకోకుండా సీబీఐ (CBI)ని ఆదేశించాలని కోరుతూ కడప ఎంపీ అవినాష్‌రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టులో విచారణ జరిగింది.

ఈ సందర్భంగా తీవ్రమైన చర్యలంటే ఏంటని న్యాయస్థానం ప్రశ్నించింది. అరెస్టు చేయకుండా ఆదేశాలివ్వాలని అడుగుతున్నారా? అని వ్యాఖ్యానించింది. దీనిపై అవినాష్‌ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. చెప్పింది చెప్పినట్లు సీబీఐ అధికారులు వాంగ్మూలం నమోదు చేస్తున్నారనే నమ్మకం తమకు లేదని కోర్టుకు తెలిపారు. దీనిపై సీబీఐ తరఫు న్యాయవాది స్పందిస్తూ విచారణను వీడియో రికార్డింగ్‌ చేస్తున్నామని వెల్లడించారు. ఇరువర్గాల వాదనలు విన్న న్యాయస్థానం.. వీడియో రికార్డింగ్‌ ఏ దశలో ఉందో తెలపాలని సీబీఐని  ఆదేశించింది. కేసుకు సంబంధించిన పూర్తి ఫైల్‌ను సోమవారం సమర్పించాలంది.

కేసు విచారణలో భాగంగా ఆడియో, వీడియో రికార్డుల హార్డ్‌ డిస్క్‌ను సీబీఐ ఎస్పీ రామ్‌సింగ్‌ హైకోర్టుకు తీసుకొచ్చామన్నారు. కేసుకు సంబంధించిన హార్డ్‌ డిస్క్‌, కేసు ఫైల్‌ ఇప్పుడే ఇచ్చేందుకు తాము సిద్ధంగా ఉన్నామని న్యాయస్థానానికి తెలిపారు. సోమవారం సీల్డ్‌ కవర్‌లో అవినాష్‌ వివరాలు, హార్డ్‌ డిస్క్‌ ఇవ్వాలని సీబీఐని కోర్టు ఆదేశించింది. అప్పటివరకు అరెస్టు చేయకుండా ఆదేశాలు ఇవ్వాలని అవినాష్‌ తరఫు న్యాయవాది కోరగా.. అవినాష్‌రెడ్డి.. సాక్షా? లేక నిందితుడా? అని సీబీఐని ప్రశ్నించింది. అవినాష్‌రెడ్డికి సీఆర్‌పీసీ 160 నోటీసు ఇచ్చామని.. అవసరమైతే అవినాష్‌ను, ఆయన తండ్రి భాస్కర్‌రెడ్డిని అదుపులోకి తీసుకొనే అవకాశం ఉందని సీబీఐ తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. సోమవారం వరకు అరెస్టు చేయవద్దని సీబీఐకి హైకోర్టు స్పష్టం చేసింది. మంగళవారం అవినాష్‌రెడ్డిని మళ్లీ విచారణకు పిలుస్తామని హైకోర్టుకు సీబీఐ తెలిపింది. విచారణ సందర్భంగా న్యాయవాదిని కూడా అనుమతించాలని అవినాష్‌ తరఫు న్యాయవాది కోరగా.. హైకోర్టు అంగీకరించింది. ఈనెల 14న ఉదయం 11గంటలకు విచారణకు హాజరు కావాలని అవినాష్‌రెడ్డిని న్యాయస్థానం ఆదేశించింది.

హత్యాస్థలంలో దొరికిన లేఖ తమ వద్దే ఉందని హైకోర్టుకు సీబీఐ తెలిపింది. లేఖపై సీఎఫ్‌ఎస్‌ఎల్‌ అభిప్రాయం తీసుకున్నామని చెప్పింది. వివేకా తీవ్ర ఒత్తిడిలో లేఖ రాసినట్లు సీఎఫ్‌ఎస్ఎల్‌ తెలిపిందని కోర్టుకు దృష్టికి తీసుకొచ్చింది. లేఖ, సీఎఫ్‌ఎస్‌ఎల్‌ నివేదిక సమర్పించాలని సీబీఐని హైకోర్టు ఆదేశించింది. మరోవైపు ఈ పిటిషన్‌లో వివేకా కుమార్తె సునీత ఇంప్లీడ్‌ అయ్యారు. పిటిషన్‌లో తన పేరు ప్రస్తావించినందున తన వాదనలు కూడా వినాలని కోరారు. దీనిపై అభ్యంతరం ఉందా? అని హైకోర్టు సీబీఐని అడిగింది.

వివేకా హత్యకేసు విచారణ ఈనెల 31కి వాయిదా

మాజీ మంత్రి వైఎస్‌ వివేకా హత్యకేసు విచారణను హైదరాబాద్‌లోని సీబీఐ ప్రత్యేక కోర్టు ఈనెల 31కి వాయిదా వేసింది. కేసు విచారణలో భాగంగా చంచల్‌గూడ జైలులో రిమాండ్‌ ఖైదీలుగా ఉన్నా సునీల్‌ కుమార్‌ యాదవ్‌, ఉమాశంకర్‌రెడ్డి, దేవిరెడ్డి శంకర్‌రెడ్డిని పోలీసులు కోర్టులో హాజరుపర్చారు. గంగిరెడ్డి సైతం సీబీఐ కోర్టుకు వచ్చారు. కేసు విచారణ వాయిదా పడిన తర్వాత ముగ్గురు నిందితులను పోలీసులు మళ్లీ చంచల్‌గూడ జైలుకు తరలించారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని