Sridhar Babu: పెట్టుబడులకు తెలంగాణ అనువైన రాష్ట్రం: సౌదీ కంపెనీలతో మంత్రి శ్రీధర్‌బాబు

పెట్టుబడులు పెట్టేందుకు తెలంగాణ అనువైన రాష్ట్రమని, బహుళజాతి కంపెనీలు ముందుకు రావాలని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి డి.శ్రీధర్‌ బాబు కోరారు.

Published : 21 Jan 2024 22:29 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: పెట్టుబడులు పెట్టేందుకు తెలంగాణ అనువైన రాష్ట్రమని, బహుళజాతి కంపెనీలు ముందుకు రావాలని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి డి.శ్రీధర్‌ బాబు కోరారు. రాష్ట్రానికి పెట్టుబడులే లక్ష్యంగా సౌదీ అరేబియాలో పర్యటిస్తున్న ఆయన.. జెడ్డాలో వివిధ సంస్థల ప్రతినిధులతో వరుస సమావేశాల్లో పాల్గొన్నారు. సౌదీ యువరాజు ప్రత్యేక కార్యాలయం జనరల్‌ డైరెక్టర్‌ మహమ్మద్‌ బిన్‌ అబ్దుల్లా అల్‌ రాయెస్‌తో భేటీ అయ్యారు. సౌదీ కంపెనీలు తెలంగాణలో పెట్టుబడులు పెట్టేలా చొరవ తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. 

సౌదీలో దిగ్గజ సంస్థలైన ఆరాంకో, ఆల్‌ షరీఫ్‌ గ్రూప్‌ హోల్డింగ్స్‌, సెడ్కో కాపిటల్స్, జెడ్డా ఛాంబర్స్‌, సవోలా గ్రూప్‌, సౌదీ బ్రదర్స్‌ తదితర సంస్థల ప్రతినిధులతో మంత్రి శ్రీధర్‌బాబు సమావేశమయ్యారు. రాష్ట్రంలో పరిశ్రమలు ఏర్పాటు చేసే సంస్థలకు కల్పించే రాయితీలు, ప్రోత్సాహకాల గురించి వివరించారు. తెలంగాణలో నిరంతర విద్యుత్తు సరఫరా, పుష్కలమైన నీటి లభ్యత, మానవ వనరులు, మంచి మౌలిక సదుపాయాలు, మెరుగైన కనెక్టివిటీ ఉన్నాయన్నారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి పలు సంస్థలు ఆసక్తి కనబర్చాయని, అనేక సంస్థలు సానుకూలంగా స్పందించాయని సౌదీ పర్యటనకు వెళ్లిన రాష్ట్ర బృందం పేర్కొంది. మంత్రి వెంట ఐటీ, పరిశ్రమల శాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి జయేశ్ రంజన్, ఇన్వెస్ట్‌మెంట్‌ అండ్ ప్రమోషన్ ప్రత్యేక కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి ఉన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని