Balakrishna: మా కుటుంబం జోలికొస్తే సహించేది లేదు.. ఖబడ్దార్‌: బాలకృష్ణ

తెదేపా అధినేత చంద్రబాబు కుటుంబంపై వైకాపా నేతలు చేసిన అనుచిత వ్యాఖ్యలపై నటుడు,

Updated : 31 Oct 2023 15:54 IST

హైదరాబాద్‌ : తెదేపా అధినేత చంద్రబాబు కుటుంబంపై వైకాపా నేతలు చేసిన అనుచిత వ్యాఖ్యలపై నటుడు, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ స్పందించారు. ఆయన నివాసంలో కుటుంబసభ్యులతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు.

కుటుంబ సభ్యులపై దాడి సరికాదు..

‘ఏపీ అసెంబ్లీలో జరిగిన పరిణామాలు చాలా బాధాకరం. సజావుగా సాగాల్సిన అసెంబ్లీ వ్యక్తిగత దూషణలకు వేదికైంది. అభివృద్ధిపై చర్చకు బదులు వ్యక్తిగత అజెండాను తీసుకొచ్చారు. చంద్రబాబు చాలా ధైర్యంగా ఉండే మనిషి. ఎప్పుడూ ఆయన కంటతడి పెట్టలేదు. అసెంబ్లీలో సవాళ్లు, ప్రతి సవాళ్లు ఆనవాయితే. అయితే కుటుంబ సభ్యులపై దాడి సరికాదు. మేం వ్యక్తిగతంగా ఎప్పుడూ ఎవరిని విమర్శించలేదు. మా సోదరిపై వ్యక్తిగత విమర్శలు చేయడం బాగాలేదు’ అని బాలకృష్ణ అన్నారు.

అందరి కుటుంబాల్లో ఆడవాళ్లు ఉన్నారు..

‘అసెంబ్లీలో ఉన్నామో.. పశువుల దొడ్డిలో ఉన్నామో అర్థం కావడం లేదు. అందరి కుటుంబాల్లో ఆడవాళ్లు ఉన్నారు.. హేళన చేయవద్దు. రాజకీయాలతో సంబంధం లేని వారిపై మాటల దాడి సరికాదు. ఏపీలో దోచుకున్న సొమ్ము ఇంట్లో దాచుకుంటున్నారు తప్ప.. అభివృద్ధి లేదు. కొత్త నీచపు సంస్కృతికి వారు తెరలేపారు.. ఆ పార్టీలోనూ బాధపడే వారున్నారు’

ఇదే నా హెచ్చరిక..

‘ప్రజల తరఫున.. పార్టీ తరఫున.. నా అభిమానుల తరఫున ఇదే నా హెచ్చరిక.. మళ్లీ ఇలాంటి నీచపు, నికృష్టపు మాటలు మాట్లాడితే సహించేది లేదు. ఖబడ్దార్‌.. భరతం పడతాం. ప్రతి విషయానికి హద్దు ఉండాలి. ఆడవాళ్ల జోలికొస్తే చేతులు ముడుచుకొని కూర్చోం. మీరు మారకపోతే మెడలు వంచి మారుస్తాం. మంగళగిరి పార్టీ కార్యాలయంపై దాడి చేయించారు. చంద్రబాబుపై దాడులకు యత్నించినా సంయమనంతో ఉన్నాం. ఇకపై ఎవరు నోరు తెరిచినా ఉపేక్షించేది లేదు. ఆడవాళ్లను తెరపైకి తెచ్చి మైండ్‌గేమ్‌ ఆడుతున్నారు. రాజకీయాల్లో అధికారం ఎప్పుడూ శాశ్వతం కాదు. వ్యవస్థలన్నింటినీ నిర్వీర్యం చేశారు. మీకు దాసోహం చేసేలా చేసుకోవడం మంచిది కాదు’ అని బాలకృష్ణ హెచ్చరించారు.

బాలయ్య ఇంటికి అభిమానులు
జూబ్లీహిల్స్‌లోని బాలకృష్ణ ఇంటికి అభిమానులు తరలివచ్చారు. చంద్రబాబు కుటుంబంపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వైకాపా నేతలకు వ్యతిరేకంగా నందమూరి అభిమానులు నినాదాలు చేశారు. తన నివాసానికి వచ్చిన అభిమానులతో బాలయ్య మాట్లాడారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని