Cm Kcr: గులాబ్‌ తుపాను ప్రభావం.. ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగొద్దు: కేసీఆర్‌

గులాబ్‌ తుపాను నేపథ్యంలో భారీ వర్షాల కురిసే అవకాశం ఉన్నందున అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్‌) సోమేశ్‌కుమార్‌తో తాజా పరిస్థితులపై సీఎం సమీక్షించారు....

Updated : 27 Sep 2021 15:15 IST

హైదరాబాద్: గులాబ్‌ తుపాను నేపథ్యంలో భారీ వర్షాల కురిసే అవకాశం ఉన్నందున అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్‌) సోమేశ్‌కుమార్‌తో తాజా పరిస్థితులపై సీఎం సమీక్షించారు. గులాబ్ తూపాను ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు మరో రెండు రోజుల పాటు కురుస్తాయని.. ఈ పరిస్థితుల్లో ఏ విధమైన ప్రాణ, ఆస్తి నష్టం కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సీఎస్‌ను ఆదేశించారు. పోలీస్, రెవెన్యూ తదితర శాఖలు సమన్వయంతో సహాయక చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు.

సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు మరోసారి జిల్లా కలెక్టర్లతో సీఎస్‌ టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. డీజీపీ మహేందర్‌రెడ్డి, రోడ్లు భవనాల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సునీల్ శర్మ, పంచాయతీ రాజ్ శాఖ కార్యదర్శి సందీప్‌కుమార్‌ సుల్తానియా, విపత్తుల నిర్వహణ శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జ తదితరులతో సీఎస్ సమీక్షించారు. రాష్ట్రవ్యాప్తంగా మరో రెండు రోజులపాటు భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) హెచ్చరికల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్లను సీఎస్ ఆదేశించారు.

జిల్లాల్లో రెవెన్యూ, పోలీస్, పంచాయతీరాజ్, నీటి పారుదల, అగ్నిమాపక శాఖలు పూర్తి సమన్వయంతో పనిచేయాలన్నారు. ప్రాణ, ఆస్తి నష్టం కలుగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. అవసరమైతే హైదరాబాద్, కొత్తగూడెం, వరంగల్‌ జిల్లాల్లో ఉన్న ఎన్‌డీఆర్‌ఎఫ్‌ బృందాలను ఉపయోగించుకోవాలని సూచించారు. అన్ని జిల్లాల కలెక్టరేట్ కార్యాలయాల్లో ప్రత్యేకంగా కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు సమాచారం సచివాలయంలోని కంట్రోల్ రూంకు అందించాలన్నారు. సమస్యాత్మక ప్రాంతాలైన లోతట్టు ప్రాంతాలు, చెరువులు, కుంటలు, ఇతర నీటి వనరులు, వంతెనెల వద్ద ప్రత్యేకంగా అధికారులను నియమించి పరిస్థితులు సమీక్షించాలన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని