Omicron: తెలంగాణలో రెండు ఒమిక్రాన్‌ కేసులు

తెలంగాణలో తొలిసారిగా ఒమిక్రాన్‌ కేసులు నమోదయ్యాయి. అబుదాబి నుంచి వచ్చిన ఇద్దరు ప్రయాణికులకు కొవిడ్‌ పాజిటివ్‌ వచ్చింది.

Updated : 15 Dec 2021 15:38 IST

హైదరాబాద్‌: తెలంగాణలో తొలిసారిగా ఒమిక్రాన్‌ కేసులు నమోదయ్యాయి. కెన్యా, సోమాలియా నుంచి వచ్చిన ఇద్దరు ప్రయాణికులకు కొవిడ్‌ పాజిటివ్‌ వచ్చింది. వారి నమూనాలను సీసీఎంబీ జీనోమ్‌ సీక్వెన్సింగ్‌కు పంపగా ఒమిక్రాన్‌గా నిర్ధారణ అయింది.  ఈ మేరకు తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. ఒమిక్రాన్‌కేసుల వివరాలను ప్రజారోగ్యశాఖ సంచాలకులు (డీహెచ్‌) డా.శ్రీనివాస్‌రావు మీడియాకు వివరించారు.

ఒకరిని టిమ్స్‌కు తరలించాం..

ఈ నెల 12వ తేదీ కెన్యాకు చెందిన 24 ఏళ్ల మహిళ రాజీవ్‌ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి వచ్చారని.. ఆమెకు నిర్వహించిన జీనోమ్‌ సీక్వెన్సింగ్ పరీక్షలో ఒమిక్రాన్‌ నిర్ధారణ అయినట్లు డా. శ్రీనివాస్‌రావు తెలిపారు. హైదరాబాద్‌ టోలిచౌకిలో ఆమెను గుర్తించి గచ్చిబౌలిలోని టిమ్స్‌కు తరలించినట్లు చెప్పారు. బాధిత మహిళకు సన్నిహితంగా ఉన్న ఇద్దరు కుటుంబ సభ్యుల శాంపిల్స్‌ కూడా సేకరించినట్లు తెలిపారు.

పారమౌంట్ కాలనీలో సోమాలియా వ్యక్తి గుర్తింపు..

కెన్యా మహిళతో పాటు సోమాలియాకు చెందిన 23ఏళ్ల వ్యక్తికి కూడా ఒమిక్రాన్‌ సోకినట్లు డీహెచ్‌ వెల్లడించారు. ఈ వ్యక్తిని నగరంలోని పారామౌంట్ కాలనీలో పోలీసులు గుర్తించినట్లు చెప్పారు. బాధితుడిని వెంటనే గచ్చిబౌలి టిమ్స్‌కి తరలించారు. బాధితుడి కుటుంబసభ్యులు, చుట్టుపక్కల వారికి వైద్య సిబ్బంది టెస్టులు చేస్తున్నారు. అయితే పరీక్షలకు నమూనాలు ఇచ్చేందుకు కొంత మంది స్థానికులు నిరాకరిస్తున్నారు. ఇప్పటివరకు బాధితుడి ఎంత మందిని కలిశాడనే వివరాలను పోలీసులు సేకరించే పనిలో పడ్డారు. సోమాలియాకు చెందిన బాధితుడు తన తండ్రి వైద్య కోసం నగరానికి వచ్చినట్లు పోలీసులు గుర్తించారు. తండ్రీకొడుకులిద్దరూ వైద్యం కోసం నగరంలోని పలు కార్పొరేట్‌ ఆస్పత్రులకు వెళ్లినట్లు తేలింది. బాధితుడి తండ్రి శాంపిల్స్ తీసుకుని జీనోమ్‌ సీక్వెన్సింగ్ పరీక్షకు పంపామని వైద్యశాఖ అధికారులు తెలిపారు.

మూడో వ్యక్తి రాష్ట్రంలోకి ప్రవేశించలేదు..

ఒమిక్రాన్‌ సోకిన మూడో వ్యక్తి ఏడేళ్ల బాలుడని.. అతను రాష్ట్రంలోకి ప్రవేశించలేదని డీహెచ్‌ చెప్పారు. బాలుడు కుటుంబంతో కలసి విదేశాల నుంచి శంషాబాద్‌ విమానాశ్రయానికి వచ్చి.. ఇక్కడి నుంచి పశ్చిమ బెంగాల్‌కు దేశీయ విమానంలో వెళ్లినట్లు ఆయన వివరించారు. బాలుడు వెళ్లే ముందు ఇచ్చిన శాంపిల్‌ను పరిశీలించగా అతడికి ఒమిక్రాన్‌ పాజిటివ్‌ వచ్చిందని.. ఈ సమాచారాన్ని ఆ రాష్ట్ర అధికారులకు చేరవేసినట్లు డీహెచ్‌ చెప్పారు.

ఆ వార్తల్లో వాస్తవం లేదు..

రాష్ట్రంలో ప్రస్తుతం ఇద్దరు ఒమిక్రాన్ బాధితులు ఉన్నారని డీహెచ్‌ వివరించారు. నాన్ రిస్క్ దేశాల నుంచి వచ్చే వారికి పరీక్షలను పెంచుతామన్నారు. ఓ ప్రైవేట్ ఆస్పత్రి నుంచి ఒమిక్రాన్‌ వచ్చిన ఒకరు పారిపోయారనే వార్తల్లో వాస్తవం లేదని వివరించారు. రాష్ట్రంలో 4.19 కోట్ల వ్యాక్సిన్ డోస్‌లు పంపిణీ చేశామని.. 97శాతం మందికి మొదటి డోస్ పూర్తి అయిందని డీహెచ్‌ వివరించారు.

స్వల్ప లక్షణాలే..

మూడో వేవ్‌ను ఎదుర్కొనేందుకు సన్నద్ధంగా ఉన్నామని డీహెచ్‌ వివరించారు. ఒమిక్రాన్ సైతం గాలి ద్వారా సోకుతుందని.. చాలా వేగంగా వ్యాప్తి చెందుతుందని చెప్పారు. రెండు రోజుల్లోనే డబుల్ అయ్యే సామర్థ్యం ఉందని వెల్లడించారు. ఒమిక్రాన్‌ సోకిన వారికి చాలా స్వల్ప లక్షణాలే ఉన్నాయన్నారు. ప్రజలెవరూ ఆందోళన పడాల్సిన పనిలేదని చెప్పారు. వ్యాక్సిన్‌ వేసుకున్నా కరోనా నిబంధనలు పాటిస్తూ అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని