Rain effect: ఇంట్లో ఉండలేరు.. బయటకు రాలేరు! 

గత రెండురోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో భాగ్యనగర వాసులు అల్లాడుతున్నారు. వరద సమస్య ఒకవైపు అయితే దీనికితోడు డ్రైనేజీ సమస్య మరో వైపు. ..

Updated : 05 Sep 2021 19:20 IST

హైదరాబాద్‌: గత రెండురోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో భాగ్యనగర వాసులు అల్లాడుతున్నారు. వరద సమస్య ఒకవైపు అయితే దీనికితోడు డ్రైనేజీ సమస్య మరో వైపు. దీంతో ఇంట్లో ఉండలేక, బయటకి వెళ్లలేక కాలనీ వాసులు ఇబ్బందులు పడుతున్నారు. మీర్‌పేట కార్పొరేషన్ పరిధిలోని జిల్లెలగూడ పరిధిలోని సాయినగర్‌ కాలనీలో వరదనీటితో ప్రజలు సతమతమవుతుండగా.. దీనికి తోడు డ్రైనేజీ నీరు కూడా కలిసి కాలనీల్లో పొంగి ప్రవహిస్తూ దుర్గంధం వెదజల్లుతోంది. వరద నీటితో కాలనీల్లో రోడ్లన్నీ దెబ్బతిన్నాయి. రెండేళ్లుగా స్థానికులు ఇదే సమస్యతో ఇబ్బంది పడుతుంటే ఆరు నెలల క్రితం అండర్‌ గ్రౌండ్‌ డ్రైనేజీ పనులు ప్రారంభించారు. కానీ, అసంపూర్తిగా వదిలేశారు. దీంతో డ్రైనేజీ వాటర్‌ మొత్తం రోడ్లపైకి చేరి ఇళ్లలోంచి జనం బయటకు వెళ్లలేని పరిస్థితి ఏర్పడింది. దుర్వాసన, దోమల బెడదతో అనారోగ్యానికి గురై ఆసుపత్రి పాలవుతున్నామని కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులకు పలుమార్లు విన్నవించినా పట్టించుకోలేదని, ఇప్పటికైనా డ్రైనేజీ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని వారంతా కోరుతున్నారు. 

వరదనీటిలో ఎల్బీనగర్‌లోని లోతట్టు కాలనీలు

భారీ వర్షాలకు ఎల్బీనగర్‌లోని లోతట్టు కాలనీలన్నీ వరద నీటిలోనే నానుతున్నాయి. వనస్థలిపురం పరిధిలోని శారదానగర్‌, శాంతి నగర్‌ కాలనీ, గాంధీ నగర్‌, విజయపురి కాలనీలో రోడ్లపై వర్షపు నీరు నిలిచిపోయింది. హయత్‌నగర్‌ పరిధిలో రాత్రి కురిసిన వర్షానికి మునగనూర్‌, తొర్రూర్‌, బంజారా కాలనీ, అంబేడ్కర్‌ నగర్‌, భగత్‌సింగ్‌ కాలనీల్లో రోడ్లన్నీ జలమయం కావడంతో కాలనీ వాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని