Hyderabad news: వాహనం జప్తు చేసే అధికారం ఉంది: సైబరాబాద్ ట్రాఫిక్‌ పోలీస్‌ 

పెండింగ్‌ చలానాలున్న వాహనాలను స్వాధీనం చేసుకోవడానికి చట్ట ప్రకారం ట్రాఫిక్‌ పోలీసులకు ఎలాంటి అధికారాలు లేవని హైకోర్టు ఆదేశించినట్టు సామాజిక మాధ్యమాల్లో వస్తున్న వార్తల్లో వాస్తవం..

Updated : 22 Aug 2021 22:26 IST

హైదరాబాద్‌: పెండింగ్‌ చలానాలున్న వాహనాలను స్వాధీనం చేసుకోవడానికి చట్ట ప్రకారం ట్రాఫిక్‌ పోలీసులకు ఎలాంటి అధికారాలు లేవని హైకోర్టు ఆదేశించినట్టు సామాజిక మాధ్యమాల్లో వస్తున్న వార్తల్లో వాస్తవం లేదని సైబరాబాద్‌ ట్రాఫిక్‌ పోలీసులు తెలిపారు. కొందరు తప్పుడు వార్తలు ప్రచారం చేస్తున్నట్టు తమ దృష్టికి వచ్చిందని, ప్రజల్లో గందరగోళం సృష్టించవద్దని సూచించారు. 

ఈనెల 11న హైకోర్టు ఇచ్చిన ఆదేశాల్లో ... వాహనదారుడు వారం రోజుల్లో దరఖాస్తు చేసుకుంటే విడుదల చేయాలని సూచించిందని తెలిపారు.  దీంతో సదరు వ్యక్తి వాహన చట్టం 1989 రూల్‌ 167 ప్రకారం వాహనంపై ఉన్న చలాన్లు చెల్లించి వాహనం తీసుకుని వెళ్లిపోయారని తెలిపారు.  కానీ, చట్ట ప్రకారం వాహనం జప్తు చేసే అధికారం పోలీసులకు లేదంటూ సదరు వ్యక్తి ఉద్దేశపూర్వకంగా  తప్పుడు వార్తలు వ్యాప్తి చేశారని తెలిపారు. కేంద్ర మోటారు వాహన చట్టం రూల్‌ 167 ప్రకారం 90 రోజులకు పైగా వాహనంపై ఉన్న జరిమానా కట్టకుంటే వాహనాన్ని జప్తు చేసే అధికారం పోలీసులకు ఉంటుందని సైబరాబాద్‌ ట్రాఫిక్‌ పోలీసులు స్పష్టం చేశారు.

సోషల్‌ మీడియాలో ప్రచారం జరిగిందిలా...
‘‘కూకట్‌పల్లి కోర్టులో న్యాయవాదిగా పనిచేస్తున్న ఓ వ్యక్తి ఆగస్టు 1న బైకుపై వెళ్తుండగా పర్వత్‌నగర్‌ చౌరస్తాలో ట్రాఫిక్‌ పోలీసులు ఆపారు. ఆ బైక్‌పై రూ.1635 చలానా పెండింగ్‌ ఉందని, చెల్లించాలని ఎస్సై మహేంద్రనాథ్‌ కోరారు. నిరాకరించిన యజమాని వాహనాన్ని పోలీసులు సీజ్‌ చేశారు. ఒక్క చలానాకే సీజ్‌ చేస్తారా అంటూ న్యాయవాది నిలదీశారు. నిబంధనల ప్రకారమే చేశామని పోలీసులు స్పష్టం చేశారు. ఇక్కడే అసలు కథ మొదలైంది. చలానా ఎక్కడ వేశారు..? ఎందుకు వేశారు? తదితర వివరాలను అడగ్గా ప్రవేశం లేని పైవంతెనపై ప్రయాణించారని, ప్రమాదకర డ్రైవింగ్‌, ఆదేశాల ఉల్లంఘన పేరిట మొత్తంగా రూ.1635 జరిమానా చెల్లించాలనడంతో లాయర్‌ అవాక్కయ్యారు. నో ఎంట్రీకి కేవలం రూ.135 జరిమానా వేయాల్సింది ఇంత ఎలా రాశారు? ఒక్క ఉల్లంఘనకు మూడు శిక్షలా అంటూ పోలీసులతో వాగ్వాదానికి దిగారు. చిర్రెత్తుకొచ్చిన ఆ న్యాయవాది హైకోర్టులో రిట్‌ పిటిషన్‌ వేశారు. విచారించిన హైకోర్టు పోలీసుల తీరుపై ఆగస్టు 11న ఆగ్రహం వ్యక్తం చేసింది. చట్ట ప్రకారం వాహనం సీజ్‌ చేయకూడదని పేర్కొంది. వాహనం తిరిగివ్వాలని ఆదేశించడంతో ఆ వాహనాన్ని తిరిగిచ్చేశారు’’ అని సోషల్‌ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. అయితే, ఇది వాస్తవం కాదని సైబరాబాద్‌ ట్రాఫిక్‌ పోలీసులు తెలిపారు. ట్రాఫిక్‌ పోలీసులపై కోపంతోనే సదరు వ్యక్తి ఇలా ప్రచారం చేశాడని పేర్కొన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని