Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు

ఈనాడు.నెట్‌లోని పది ముఖ్యమైన వార్తలు మీ కోసం.. 

Published : 09 Dec 2021 08:56 IST

1. తదుపరి సీడీఎస్‌గా జనరల్‌ నరవణె!

జనరల్‌ బిపిన్‌ రావత్‌ ఆకస్మిక మృతితో తదుపరి త్రిదళాధిపతి (సీడీఎస్‌)గా ఎవరు నియమితులవుతారన్న విషయం ఆసక్తికరంగా మారింది. ఆర్మీ అధిపతి జనరల్‌ మనోజ్‌ ముకుంద్‌ నరవణె ఈ బాధ్యతలు చేపట్టే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఆర్మీ, నేవీ, వాయుసేన అధిపతుల్లో ఒకరిని సీనియార్టీ ప్రకారం ఈ పదవికి ఎంపిక చేస్తారు. నేవీ, వాయుసేనల అధిపతులు ఇటీవల కాలంలోనే పదవులు చేపట్టినందున వారిలో సీనియర్‌ అయిన జనరల్‌ నరవణెకే అవకాశాలు అధికంగా ఉన్నాయి.

2. సేవా కార్యక్రమాల్లో మధులిక ముందంజ

హెలికాప్టర్‌ ప్రమాదంలో దుర్మరణం పాలైన త్రిదళాధిపతి జనరల్‌ బిపిన్‌ రావత్‌ సతీమణి మధులికా రావత్‌.. ఆపన్నుల పాలిట అమృతమూర్తిగా పేరు పొందారు. భారత సైన్యంలో సేవా కార్యక్రమాలకు ఆమె ప్రతిరూపంగా నిలిచారు. సైనికుల సతీమణుల సంక్షేమ సంఘం (ఏడబ్ల్యూడబ్ల్యూఏ) అధ్యక్షురాలిగా పనిచేశారు. ఇది దేశంలోనే అతిపెద్ద స్వచ్ఛంద సంస్థల్లో ఒకటి. సైనిక కుటుంబాల బాగోగులు చూడటం దీని ప్రధాన విధి. 

3. పేదలకు సదవకాశం

జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం (ఓటీఎస్‌) పూర్తిగా స్వచ్ఛందమేనని ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి పునరుద్ఘాటించారు. దీని ద్వారా పేదలకు మంచి అవకాశం కల్పిస్తున్నామని, వాడుకోవాలా వద్దా అన్నది వారిష్టమని స్పష్టం చేశారు. గృహ నిర్మాణానికి పేదలు తీసుకున్న రుణాల్ని ఓటీఎస్‌ ద్వారా మాఫీ చేస్తున్నామని, రిజిస్ట్రేషన్‌ ఉచితంగా చేస్తున్నామని తెలిపారు.

4. నాలుగు కోల్‌బ్లాకుల వేలం ఆపాలి

కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖ సింగరేణిలో తలపెట్టిన జేబీఆర్‌ఓసీ-3, శ్రావణ్‌పల్లి ఓసీ, కోయగూడెం ఓసీ-3, కేకే -6 యూజీ కోల్‌ బ్లాకుల వేలాన్ని వెంటనే ఆపాలని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రధానమంత్రి నరేంద్రమోదీని కోరారు. ఇలా చేయడం సింగరేణిలో బొగ్గు అవసరాలపై తీవ్ర ప్రభావం చూపుతుందని... కాబట్టి వేలాన్ని నిలిపేసి, ఆ బ్లాకులను సింగరేణికే కేటాయించేలా చూడాలని ప్రధానికి కేసీఆర్‌ విజ్ఞప్తి చేశారు. 

5. సింగరేణిలో సమ్మె గంట

బొగ్గు బ్లాకుల ప్రైవేటీకరణను నిరసిస్తూ గురువారం నుంచి సింగరేణిలో కార్మిక సంఘాలు మూడు రోజులపాటు సమ్మె చేయనున్నారు. సింగరేణిలో 23 భూగర్భ, 19 ఉపరితల గనులున్నాయి. 42 వేల మంది కార్మికులు పనిచేస్తున్నారు. ఈ నెల 3, 6 తేదీల్లో సింగరేణి యాజమాన్యంతో జరిపిన చర్చలు ఫలించకపోవడంతో గురువారం ఉదయం షిఫ్టు నుంచి 72 గంటల సమ్మెలోకి దిగేందుకు కార్మిక సంఘాలు నిర్ణయించాయి.

6. విశాఖ జోన్‌ మాటేమిటి?

విశాఖ కేంద్రంగా దక్షిణ కోస్తా (సౌత్‌ కోస్టు) రైల్వే జోన్‌ ఏర్పాటవుతుందా లేదా అన్నది మరోమారు చర్చనీయాంశమయింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 17 రైల్వే జోన్లున్నాయని, కొత్త జోన్లు ఏర్పాటు చేసే ఉద్దేశం లేదని రైల్వే శాఖ మంత్రి అశ్వనీ వైష్ణవ్‌ పార్లమెంటులో ప్రకటించడంతో విశాఖ జోన్‌పై మరోమారు చర్చకు తెరలేచింది. 

7. కుప్పం నుంచే పార్టీ ప్రక్షాళన

పార్టీలో ప్రక్షాళన కుప్పం నుంచే ప్రారంభిస్తానని, వచ్చే ఆరు నెలలపాటు కుప్పంపై ప్రత్యేక దృష్టి పెడతానని తెదేపా అధినేత చంద్రబాబు తెలిపారు. పార్టీకి నష్టం చేసేవారిని, క్షేత్ర స్థాయిలో పని చేయకుండా తన దగ్గరకొచ్చి కబుర్లు చెప్పేవారికి ఉపేక్షించబోనని.. రాబోయే 6 నెలల్లో కొత్త రక్తంతో పార్టీకి జవసత్వాలు తీసుకువస్తానని స్పష్టం చేశారు. ఇకపై పార్టీని సమర్థంగా ముందుకు నడిపించేవారికి పట్టం కడతామన్నారు.

8. 9 కంటే ఎక్కువ సిమ్‌ కార్డులుంటే మళ్లీ ధ్రువీకరణ

దేశంలో ఒకే వినియోగదారుడి పేరు మీద 9 కంటే ఎక్కువ సిమ్‌ కార్డులుంటే, మళ్లీ ధ్రువీకరణ చేయాల్సిందిగా టెలికమ్యూనికేషన్ల శాఖ (డాట్‌) ఆదేశాలు జారీ చేసింది. పునఃధ్రువీకరణ జరగని పక్షంలో ఆ మొబైల్‌ కనెక్షన్‌ను తొలగిస్తారు. వినియోగదారులు ఏ సిమ్‌ కార్డులను అట్టేపెట్టుకుంటారో ఎంపిక చేసుకునే సౌలభ్యం కల్పించి, మిగతా కనెక్షన్‌లకు డీ యాక్టివేట్‌ చేయాల్సిందిగా డాట్‌ ఆదేశించింది.

9. కోహ్లీకి షాక్‌

ఇటీవలే టీ20 సారథ్యాన్ని వదులుకున్న విరాట్‌ కోహ్లి ఇప్పుడు వన్డే కెప్టెన్సీని కూడా కోల్పోయాడు. అతణ్ని బాధ్యతల నుంచి తప్పించిన జాతీయ సెలక్షన్‌ కమిటీ టీ20 సారథి రోహిత్‌ శర్మను కొత్త వన్డే కెప్టెన్‌గా నియమించింది. దక్షిణాఫ్రికా పర్యటనకు టెస్టు వైస్‌ కెప్టెన్‌గా కూడా అతడికి బాధ్యతలు అప్పగించింది. ఆ పర్యటనలోనే రోహిత్‌  వన్డే సారథిగా తన ఇన్నింగ్స్‌ మొదలెడతాడు. 

10. వచ్చే ఏడాది వేతనంతో కూడిన సెలవులివే..

రాష్ట్రంలో దుకాణాలు, సంస్థల చట్టం కింద వచ్చే ఏడాది తొమ్మిది పర్వదినాలు, ముఖ్యమైన రోజులను వేతనంతో కూడిన సెలవులుగా కార్మికశాఖ నోటిఫై చేసింది. సంక్రాంతి (జనవరి 15), గణతంత్ర దినోత్సవం (జనవరి 26), మహాశివరాత్రి మరుసటి రోజు (మార్చి 2), మే డే, రంజాన్‌ (మే 3), తెలంగాణ అవతరణ దినోత్సవం (జూన్‌ 2), స్వాతంత్య్ర దినోత్సవం, గాంధీ జయంతి, దసరా (అక్టోబరు 5)లను వేతనంతో కూడిన సెలవులుగా పేర్కొంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని