Updated : 23 May 2021 20:20 IST

Corona pandemic: నేటి ‘పాజిటివ్‌’ న్యూస్‌

ఇంటర్నెట్‌డెస్క్‌: కరోనా వేళ ‘పాజిటివ్‌’ అంటేనే హడలిపోతున్నారు జనాలు. కానీ కరోనాను ఓడించడంలో ‘పాజిటివ్‌’ దృక్పథం అవసరం అంటున్నారు వైద్యులు. అందుకే కరోనా వేళ ఉపశమనం కలిగించే వార్తలు పాఠకులకు అందిస్తున్నాం. అందులో భాగంగా నేటి ‘పాజిటివ్‌ వార్తలు’ మీకోసం..

  • దేశంలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. రోజూ సుమారు 20 లక్షలకు పైగా పరీక్షలు చేస్తున్నప్పటికీ కొత్త కేసుల సంఖ్య 3 లక్షలలోపే ఉంటోంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 2.40 లక్షల కేసులు నమోదయ్యాయి. మరణాల సంఖ్య కూడా 4వేల్లోపే ఉన్నాయి.
  • దేశ రాజధాని దిల్లీలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. తాజాగా 1,649 పాజిటివ్‌ కేసులు వెలుగుచూశాయి. ఈ ఏడాది మార్చి 30 తర్వాత ఈ స్థాయిలో కేసులు నమోదవ్వడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. దిల్లీలో పాజిటివిటీ రేటు సైతం 2.42కి తగ్గింది.
  • కొవిడ్‌ టీకా విషయంలో పాలిచ్చే తల్లులు భయపడాల్సిన అవసరం లేదంటున్నారు నిపుణులు. టీకా తీసుకున్న తర్వాత విరామం ఇవ్వాల్సిన అవసరం లేదని నీతి ఆయోగ్‌ సభ్యుడు వీకే పాల్‌ స్పష్టం చేశారు. టీకా తీసుకున్న తల్లులు తమ పిల్లలకు పాలివ్వడం ఆపాలని తాము ఎక్కడా చెప్పలేదన్నారు. ఒకటి రెండు రోజులు ఆగాల్సిన అవసరం కూడా లేదన్నారు.
  • నెల్లూరు జిల్లా కృష్ణపట్నానికి చెందిన ఆనంద‌య్య మందుకు అనుమ‌తి వ‌స్తే ఆయుర్వేద ఫార్మసీలో ఔష‌ధం త‌యారీకి తితిదే సిద్ధమని తితిదే పాల‌క‌మండ‌లి స‌భ్యుడు, ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి అన్నారు. వైద్యుల బృందంతో క‌లిసి ఆయుర్వేద ఔష‌ధాన్ని పరిశీలించామ‌ని చెప్పారు. మందులో దుష్ప్రభావం కలిగిన పదార్థాలు లేవని చెబుతున్నార‌ని ఆయ‌న తెలిపారు. ఐసీఎంఆర్‌, ఆయుష్ నివేదిక‌ల కోసం వేచి చూస్తున్నట్లు వివరించారు. ప‌రిశోధ‌నా బృందం ఆనంద‌య్య ఔష‌ధాన్ని క‌రోనా మందు కాద‌ని తేల్చినా ఇమ్యూనిటీ బూస్టర్లుగా పరిశీలిస్తామన్నారు.
  • తెలంగాణ‌లో నేటి నుంచి ఫుడ్ డెలివ‌రీ, ఈ- కామ‌ర్స్‌ సేవ‌లు యథాత‌థంగా కొన‌సాగ‌నున్నాయి. అత్యవసర రాక‌పోక‌లు సాగించేవారిని అడ్డుకోబోమ‌ని డీజీపీ మ‌హేంద‌ర్‌రెడ్డి స్పష్టంచేశారు. ఈ మేర‌కు హైద‌రాబాద్‌, సైబ‌రాబాద్‌, రాచ‌కొండ సీపీల‌కు ఆదేశాలు అందాయి. నిన్న హైద‌రాబాద్‌లో లాక్‌డౌన్ నిబంధ‌న‌లు అమ‌ల్లోకి వ‌చ్చిన స‌మ‌యంలో ప‌లుచోట్ల ఫుడ్ డెలివ‌రీ బాయ్స్‌ను అడ్డుకొని, కొంద‌రి వాహ‌నాల‌ను సీజ్‌ చేసిన సంగతి తెలిసిందే.
  • ఏపీలో కొత్తగా 18,767 మందికి పాజిటివ్‌ నిర్ధారణ అయ్యింది. రోజూ 20వేలకు పైగా కేసులు నమోదువుతుండగా 19 వేలలోపే నమోదు కావడం గమనార్హం.  అదే సమయంలో 20,109 మంది కోలుకోవడం ఊరట కల్పించే అంశం. చిత్తూరు మినహా అన్ని జిల్లాల్లో వెయ్యిలోపే కేసులు నమోదయ్యాయి.

వైరస్‌ గురించి ఆసక్తికర విషయాలు..

  • మీరు సముద్రం ఒడ్డున నిలబడి ఆ నీళ్లలో ఓ మునకేశారనుకుందాం. పొరబాటున మీ నోట్లోకి కొన్ని నీళ్లు పోయాయి. ఆ కాసిని నీళ్లలో ఐదు కోట్ల వైరస్‌లు ఉంటాయని ఓ అంచనా. అమ్మో.. అనుకోకండి. ఆ వైరస్‌లలో ఒకట్రెండు కూడా మీకు హాని చేసేవి ఉండవు. ఇక లీటర్‌ సముద్రం నీటిలోనైతే రెండొందల కోట్ల వరకూ వైరస్‌లు ఉంటాయట. సముద్రంలో అవేం చేస్తుంటాయీ అంటే... అక్కడి బ్యాక్టీరియాని వేటాడుతుంటాయి. వాటివల్లే మనకి స్వచ్ఛమైన ఆక్సిజన్‌ అందుతోంది.
  • 1896 ప్రాంతం... కలరా వ్యాధి విలయతాండవం చేస్తోంది. అప్పటికి కలరాకి ‘విబ్రియో కొలెరె’ అన్న బ్యాక్టీరియానే కారణమని గుర్తించారు. కానీ, దాని వ్యాప్తిని ఎలా అరికట్టాలో తెలియట్లేదు. ఎర్నెస్ట్‌ హ్యాంకిన్‌ అనే బ్రిటిష్‌ ఇండియా శాస్త్రవేత్త అప్పుడో చిత్రమైన విషయం ప్రకటించాడు. గంగ-యమున నదుల్లోని నీటిని కలిపితే అందులో కలరా బ్యాక్టీరియా పెరగదని ప్రకటించి నిరూపించాడు. అప్పట్లో అదో పెద్ద సంచలనం. భారతీయులు పవిత్ర నదులుగా కొలిచే గంగ-యమునలకి నిజంగానే అంత శక్తి ఉందా అనుకున్నారంతా! ఆ తర్వాత 20 ఏళ్లకి- 1917లో డి-హెలె అనే ఫ్రెంచి శాస్త్రవేత్త గంగ-యమున నదుల్లోని బ్యాక్టీరియాఫేగస్‌ అనే వైరస్‌లే అందుకు కారణమని తేల్చాడు. ఇవి బ్యాక్టీరియాని చెండుకు తినే వైరస్‌లన్నమాట!
  • జీవి ఏదైనా సరే... వాటికంటూ ఎంతోకొంత జ్ఞాపకం ఉంటుంది. వెన్నెముక జీవులకి ఈ జ్ఞాపకం మరీ అవసరం. మన మెదడులో జ్ఞాపకశక్తికి కారణమైన ప్రొటీన్‌ని ఆ మధ్య 3డీ ప్రింట్‌ తీశారు అమెరికాకి చెందిన జేసన్‌ షెఫర్డ్‌ అనే న్యూరాలజిస్టు. అది అచ్చం ఓ వైరస్‌ ఆకారంలోనే రూపుదిద్దుకుంది. ఆ ప్రొటీన్‌కి కారణమయ్యే మనలోని జన్యువేంటా అని పరిశోధించి దానికి ‘ఏఆర్‌సీ’ అని పేరు పెట్టారు. చిత్రమేంటంటే ఆ ‘ఏఆర్‌సీ’ జన్యువు కూడా లక్షల సంవత్సరాలకిందట వైరస్‌ వల్లే మనలోకి వచ్చిందట. అదే మనుషులుగా మనం బుద్ధిజీవులం కావడానికి తొలి బీజం వేసిందంటారు జేసన్‌. ఇలా, వైరస్‌ల వల్ల మన శరీరంలో ఎన్నో మంచి జన్యుమార్పులు చోటుచేసుకున్నాయని చెప్పొచ్చు. మానవ శరీరంలో సుమారు పాతికవేల దాకా జన్యువులుంటాయి. వాటిలో ఎనిమిది శాతం వైరస్‌ల కారణంగా మనలోకి వచ్చినవేనట!

వైరస్‌ గురించి ఆసక్తికర కథనం- ఏమిటీ వైరస్‌..? కోసం క్లిక్‌ చేయండి..

Read latest General News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని