Top Ten News @ 1 PM

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Updated : 23 Jun 2021 13:18 IST

1. Vaccine: టీకా ‘రికార్డు’.. రహస్యమిదేనేమో..!

 సవరించిన వ్యాక్సిన్‌ విధానం అమల్లోకి వచ్చిన తొలి రోజు రికార్డు స్థాయిలో జరిగిన టీకా పంపిణీ.. ఆ మరుసటి రోజు గణనీయంగా తగ్గింది. దీంతో కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, కేంద్ర మాజీ మంత్రి పి.చిదంబరం స్పందిస్తూ కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. మోదీ ఉంటే.. ఇలాంటి ఆశ్చర్యాలు సాధ్యమేనని ఎద్దేవా చేసిన ఆయన.. బహుశా దీనికి నోబెల్‌ బహుమతి కూడా ఇస్తారేమో అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. TS News : ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో కరోనా చికిత్సల గరిష్ఠ ధరలివే

రాష్ట్రంలో ప్రైవేట్ ఆస్పత్రుల్లో కరోనా చికిత్సలు, పరీక్షల గరిష్ఠ ధరలను తెలంగాణ ప్రభుత్వం ఖరారు చేసింది. ఈ మేరకు కొవిడ్‌ చికిత్సల ఛార్జీలపై వైద్యారోగ్య శాఖ జీవో 40ని జారీ చేసింది. ప్రభుత్వం ఖరారు చేసిన ధరల వివరాలు ఇలా ఉన్నాయి.. సాధారణ వార్డులో ఐసోలేషన్, పరీక్షలకు రోజుకు గరిష్ఠంగా రూ.4వేలు, ఐసీయూ గదిలో రోజుకు గరిష్ఠంగా రూ.7,500, వెంటిలేటర్‌తో కూడిన ఐసీయూ గదికి రోజుకు గరిష్ఠంగా రూ.9వేలు తీసుకోవాలి’’ అని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

ప్రైవేటు ఆసుపత్రుల ఆదాయంలో 15-17%వృద్ధి

3. Ap News: పరీక్షల నిర్వహణతో లక్షల మందికి ముప్పు

దేశంలో పరీక్షలు రద్దుచేయని ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌ అని తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ అన్నారు. పరీక్షల నిర్వహణ ద్వారా లక్షల మంది ప్రాణాలకు ముప్పు పొంచి ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే పరీక్షలను రద్దు చేసి.. నిర్ణయాన్ని అఫిడవిట్ ద్వారా సుప్రీంకోర్టుకు తెలపాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని లోకేశ్‌ డిమాండ్ చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. Delta Plus: 40కి పైగా ‘కొత్తరకం’ కేసులు

దేశంలో కరోనా రెండో దశ ఉద్ధృతి తగ్గుముఖం పడుతున్న సమయంలో ‘డెల్టా ప్లస్‌’ వేరియంట్‌ కేసులు క్రమంగా పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. ఈ రకం వైరస్‌ ఇప్పటికే పలు రాష్ట్రాలకు పాకగా.. 40కి పైగా కేసులు వెలుగు చూసినట్లు కేంద్ర ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. అత్యధికంగా మహారాష్ట్రలో 21 ‘డెల్టా ప్లస్‌’ కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాత మధ్యప్రదేశ్‌లో ఆరు, కేరళలో మూడు, తమిళనాడులో మూడు కేసులు బయటపడ్డాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

* Corona: 3కోట్ల కేసులు..2.9కోట్ల రికవరీలు

5. AP news: కర్నూలులో కుటుంబం ఆత్మహత్య

కర్నూలు నగరంలో విషాదం చోటుచేసుకుంది. నగరంలోని వడ్డెగేరిలో విషం తాగి ఓ కుటుంబం ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. టీవీ మెకానిక్‌ ప్రతాప్‌(42), హేమలత(36) దంపతులు తమ పిల్లలు జయంత్‌(17), రిషిత(14)తో కలిసి వడ్డెగేరిలో నివాసం ఉంటున్నారు. బుధవారం ఉదయం తలుపులు ఎంతకీ తెరవకపోవడంతో అనుమానం వచ్చిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. WTC Final: 5 వికెట్లు తీయనందుకు బాధేం లేదు

తగినన్ని పరుగులు చేశాకే న్యూజిలాండ్‌కు లక్ష్యం నిర్దేశిస్తామని టీమ్‌ఇండియా పేసర్‌ మహ్మద్‌ షమి అన్నాడు. ‘భద్రతే ముందు’ అన్న విధానాన్ని జట్టు అనుసరిస్తుందని తెలిపాడు. భారత్‌కు ఆడటమే గొప్ప విషయమని, ఐదు వికెట్ల ఘనత చేజారినందుకు బాధపడనని స్పష్టం చేశాడు. ఐదో రోజు ఆట ముగిశాక అతడు మీడియాతో మాట్లాడాడు. ఆరో రోజైన బుధవారం టీమ్‌ఇండియా ప్రణాళికలను షమి వివరించాడు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

* WTC Final: ఆరో రోజు వర్షం కురుస్తుందా?

7. Indigo: టీకా వేసుకుంటే.. టికెట్‌పై డిస్కౌంట్‌

ప్రజలంతా కరోనా టీకాలు వేసుకునేలా ప్రోత్సహించడంతో పాటు ప్రయాణికులను ఆకర్షించేలా దేశీయ అతిపెద్ద బడ్జెట్‌ విమానయాన సంస్థ ఇండిగో సరికొత్త ఆఫర్‌ ప్రకటించింది. వ్యాక్సిన్‌ వేసుకున్నవారికి విమాన టికెట్లపై 10శాతం డిస్కౌంట్‌ అందిస్తోంది. ఈ మేరకు ‘వ్యాక్సిఫేర్‌’ పేరుతో కొత్త ఆఫర్‌ను బుధవారం నుంచి అందుబాటులోకి తెచ్చినట్లు కంపెనీ ఓ ప్రకటనలో వెల్లడించింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. Prabhas: రూ.150 కోట్లు వదులుకున్న ప్రభాస్‌

‘బాహుబలి’, ‘బాహుబలి-2’ చిత్రాలతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు స్టార్‌హీరో ప్రభాస్‌. ప్రస్తుతం ఈ పాన్‌ ఇండియా స్టార్‌కి భారత్‌లోనే కాకుండా విదేశాల్లో సైతం విపరీతమైన ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ ఉంది. ప్రభాస్‌ ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ని సొమ్ము చేసుకోవాలని ఎన్నో కంపెనీలు భావించాయి. కాకపోతే ప్రభాస్‌ ఆసక్తి కనబర్చకపోవడంతో ఆయా కంపెనీలు వెనక్కి తగ్గాయి. ఈ క్రమంలో మన బాహుబలి స్టార్‌ సుమారు రూ.150 కోట్లు విలువ చేసే బ్రాండ్స్ వదులుకున్నట్లు నెట్టింట్లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

పూరి నాకు గర్ల్‌ఫ్రెండ్ లాంటోడు!

9. పెళ్లయ్యాక భార్య మహిళ కాదని తెలిస్తే..

వైవాహిక జీవితాన్ని ఆనందంగా గడపాలనుకున్న ఓ వ్యక్తికి ఊహించని షాక్‌ తగిలింది. తాను పెళ్లి చేసుకున్నది మహిళను కాదని తెలిసింది. దీంతో మోసపోయానంటూ పోలీసులను ఆశ్రయించాడు. ఉత్తర్‌ప్రదేశ్‌ కాన్పుర్‌కు చెందిన అతడికి ఏప్రిల్‌ 28న వివాహం జరిగింది. అయితే ఆమె అనారోగ్యం పేరుతో శృంగారంలో పాల్గొనేందుకు అయిష్టత చూపింది. కొన్ని రోజుల తర్వాత భార్య ప్రవర్తనపై అనుమానం వచ్చి ఆసుపత్రికి తీసుకెళ్లి పరీక్షలు చేయించాడు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. IT Returns:2 ఏళ్లుగా రిటర్నులు దాఖలు చేయలేదా?

 గత రెండు ఆర్థిక సంవత్సరాల్లో ఆదాయ మూలం వద్ద పన్ను చెల్లింపు (టీడీఎస్‌), మూలం వద్ద పన్ను వసూలు (టీసీఎస్‌) రూపంలో రూ.50,000 మించి ఉన్నప్పటికీ.. ఆదాయపు పన్ను రిటర్నులు దాఖలు చేయని వారి నుంచి అధిక శాతంలో పన్ను వసూలు చేయాలని ఆదాయపు పన్ను విభాగం నిర్ణయించింది. వీరిని ‘ప్రత్యేక వ్యక్తులు’ (స్పెసిఫైడ్‌ పర్సన్స్‌)గా గుర్తించేందుకు అవసరమైన ఒక యుటిలిటీని టీడీఎస్‌, టీసీఎస్‌ వసూలు చేసేవారికి అందుబాటులోకి తెచ్చింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

* Microsoft: 2 ట్రిలియన్‌ డాలర్ల కంపెనీగా మైక్రోసాఫ్ట్‌..!

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని