Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Updated : 16 Nov 2022 13:08 IST

1. పోలండ్‌లో పేలిన క్షిపణి.. ఉక్రెయిన్‌ నుంచి దూసుకెళ్లింది..!

రష్యా-ఉక్రెయిన్‌ యద్ధంలో మరోసారి ఉద్రిక్తతలు తీవ్రరూపం దాల్చాయి. ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలొదిమిర్‌ జెలెన్‌స్కీ జి-20 సదస్సులో మాట్లాడుతున్న వేళ.. ఆ దేశంపై క్షిపణులు వర్షం కురిసింది. వాటిని ఎదుర్కొనేందుకు ఉక్రెయిన్‌ సైన్యం కూడా దీటుగా స్పందించింది. ఆ క్రమంలో క్షిపణి ఒకటి పొరుగున ఉన్న పోలండ్‌ దేశంలోకి దూసుకెళ్లడంతో ఇద్దరు మృతి చెందారు. ఇది రష్యా నుంచి వచ్చిందని మొదట వార్తలు వచ్చినా.. అది ఉక్రెయిన్‌ ప్రయోగించిన క్షిపణేనని ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైనట్లు సమాచారం. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. Crime News: అప్పుడే చంపేసేవాడు.. కానీ ఆమె ఏడుపే ఆపింది..!

దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించిన శ్రద్ధా వాకర్ హత్య కేసులో పలు కీలక విషయాలు వెల్లడవుతున్నాయి. నిందితుడు అఫ్తాబ్(28) అసలు ఆమెను ఓ పదిరోజుల ముందే అడ్డు తొలగించుకోవాలని అనుకున్నాడట. కానీ, శ్రద్ధా రోదించడంతో ఆ రోజుకు ఆమె హత్య పథకం ఆగిపోయిందని పోలీసులు వర్గాలు వెల్లడించాయి.  మే 18 శ్రద్ధాను అఫ్తాబ్ హత్య చేశాడు. కానీ, దానికి పది రోజుల ముందు కూడా ఒకసారి వారిమధ్య తీవ్ర ఘర్షణ జరిగింది. ఆ రోజే అఫ్తాబ్‌ ఆమెను అంతం చేయాలని భావించాడని ఆ వర్గాలు తెలిపాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. Live Updates: కృష్ణ జీవితం తెల్లకాగితం: కోట శ్రీనివాసరావు

‘‘కృష్ణ జీవితం తెల్లకాగితంలాంటిది. ఆయన గొప్ప సినిమాలు చేశారు. నన్ను ఎంతగానో ప్రోత్సహించారు. నేను ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో ఎన్టీఆర్‌ను విమర్శిస్తూ ‘మండలాధీశుడు’ అనే సినిమా నాతో తీశారు. ఆ మూవీ చేస్తున్నప్పుడు ధైర్యం చెప్పారు. కృష్ణ చాలా మంచి వారు. నేను ఎక్కువ సినిమాలు చేసింది ఆయనతోనే. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నా’’ పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. మోదీతో భేటీ తర్వాత.. భారతీయులకు రిషి సునాక్ గుడ్‌న్యూస్‌

యూకే వెళ్లాలనుకునే భారతీయులకు బ్రిటన్‌ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. భారత యువ నిపుణులకు ఏటా 3000 వీసాలు అందించేలా సరికొత్త వీసా పథకానికి యూకే ప్రధాని రిషి సునాక్‌ ఆమోదం తెలిపారు. జి-20 సదస్సు వేదికగా భారత ప్రధాని నరేంద్ర మోదీతో రిషి సునాక్ భేటీ అయిన కొద్ది గంటలకే యూకే ప్రభుత్వం ఈ ప్రకటన వెలువర్చడం ప్రాధాన్యత సంతరించుకుంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. నవంబరు 29న బ్లూటిక్‌ సేవల పునరుద్ధరణ

ట్విటర్‌ (Twitter)లో నకిలీ ఖాతాలను అరికట్టడంలో భాగంగా నిలిపివేసిన బ్లూటిక్‌ (Blue Tick) సబ్‌స్క్రిప్షన్‌ సేవల పునరుద్ధరణ పనులు వేగంగా కొనసాగుతున్నాయని సంస్థ అధినేత ఎలాన్‌ మస్క్‌ (Elon Musk) తెలిపారు. నవంబరు 29న దీన్ని తిరిగి అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలిపారు. అప్పటికల్లా ఎటువంటి లోపాలు లేకుండా తీర్చిదిద్దేందుకు కృష్టి చేస్తున్నామన్నారు. నెలకు 8 డాలర్లు చెల్లిస్తే.. కొన్ని అదనపు ప్రయోజనాలను అందించేలా బ్లూటిక్‌ (Blue Tick) సేవల్ని ట్విటర్‌ నవంబరు 6న ప్రారంభించిన విషయం తెలిసిందే. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. జడ్డూ.. నువ్వు మాతో ఉండటం ఎనిమిదో వండర్‌.. చెన్నై ట్వీట్‌ వైరల్‌

చెన్నై జట్టు యాజమాన్యంతో విభేదాల కారణంగా రవీంద్ర జడేజా ఇక ఆ జట్టులో ఉండటం కష్టమే అని అందరూ అనుకున్నారు. అయితే.. అందరినీ ఆశ్చర్యపరుస్తూ ఆ జట్టు ఈ ఆల్‌రౌండర్‌ని అట్టిపెట్టుకుంది. గత సీజన్‌ మొదట్లో జడేజాకు సారథ్య బాధ్యతలను అప్పగించింది యాజమాన్యం. కానీ, వరుస పరాజయాల నేపథ్యంలో.. అతడిపై విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో జడేజాను తొలగించి తిరిగి ధోనీకే కెప్టెన్‌ బాధ్యతలను అప్పగించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. 10 రోజులు.. 5 కోట్లు.. యూట్యూబ్‌ని షేక్‌ చేస్తోన్న విజయ్‌ మేనియా

కోలీవుడ్‌ స్టార్‌ విజయ్‌ మేనియా ఇప్పుడు యూట్యూబ్‌ని షేక్‌ చేస్తోంది. ఆయన హీరోగా నటించిన ‘వారిసు’లోని ఫస్ట్‌ సింగిల్‌ నెట్టింట విపరీతమైన క్రేజ్‌ను సొంతం చేసుకుంది. ‘రంజితమే’ అంటూ సాగే ఈ మాస్‌ సాంగ్‌ను విడుదల చేసి పది రోజులవుతోన్నా క్రేజ్‌ ఏ మాత్రం తగ్గలేదు సరికదా.. మరింత పెరుగుతోంది. ఈ విషయాన్నే తెలియజేస్తూ చిత్ర నిర్మాణ సంస్థ శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్‌ ఓ సరికొత్త పోస్టర్‌ షేర్‌ చేసింది. ఇప్పటివరకూ ఈ పాట 5 కోట్ల వ్యూస్‌, 18 లక్షల లైక్స్‌ సొంతం చేసుకుందని పేర్కొంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. అధ్యక్ష అభ్యర్థిత్వ రేసులోకి ట్రంప్‌.. !

 అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ 2024లో జరిగే అధ్యక్ష ఎన్నికల్లో బరిలోకి నిలిచేందుకు సన్నాహాలు మొదలుపెట్టారు. మంగళవారం రాత్రి ఆయన రిపబ్లికన్ల తరఫున అధ్యక్ష అభ్యర్థిత్వాన్ని అధికారికంగా కోరుతూ ప్రకటన జారీ చేశారు. మార్‌ ఎ లాగో ఎస్టేట్‌లో నిర్వహించిన కార్యక్రమంలో ట్రంప్ మాట్లాడుతూ ‘‘అమెరికాను మరో సారి గొప్ప ప్రకాశవంతంగా చేసేందుకు అధ్యక్షపదవికి ఈ రాత్రి అభ్యర్థిత్వాన్ని ప్రకటిస్తున్నాను’’ అని ప్రకటించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. తూర్పుగోదావరి జిల్లాలో రోడ్డు ప్రమాదం.. నలుగురి మృతి

తూర్పుగోదావరి జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. గండేపల్లి మండలం మల్లేపల్లి వద్ద 13 మందితో వెళ్తున్న వాహనం లారీని ఢీకొట్టింది. ఈ ఘటనలో నలుగురు మృతిచెందారు. బుధవారం తెల్లవారుజామున ఈ ప్రమాదం జరిగింది. గండేపల్లి ఎస్సై గణేష్‌కుమార్‌ తెలిపిన వివరాల ప్రకారం.. ఏలూరు జిల్లాలోని వివిధ గ్రామాలు, మండలాలకు చెందిన 13 మంది టాటా మ్యాజిక్‌ వాహనంలో అనకాపల్లి జిల్లా కశింకోటలోని పరమటమ్మ తల్లి ఆలయానికి వెళ్తున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. కృష్ణ పార్థివదేహానికి నివాళులర్పించిన ఏపీ సీఎం జగన్‌

సూపర్‌ స్టార్‌ కృష్ణకు నివాళులు అర్పించేందుకు సినీ, రాజకీయ ప్రముఖులు, భారీగా అభిమానులు పద్మాలయ స్టూడియోకు తరలివస్తున్నారు. కృష్ణ పార్థివదేహానికి ఏపీ ముఖ్యమంత్రి జగన్‌ నివాళులు అర్పించారు. అనంతరం మహేశ్‌బాబు కుటుంబసభ్యులను ఓదార్చి ధైర్యం చెప్పారు. అభిమానుల సందర్శనార్థం కృష్ణ పార్థివదేహాన్ని పద్మాలయ స్టూడియోలో మధ్యాహ్నం 12.30 వరకు ఉంచనున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని