Donald Trump: అధ్యక్ష అభ్యర్థిత్వ రేసులోకి ట్రంప్‌.. !

ముందుగా చెప్పినట్లే 15వ తేదీన డొనాల్డ్‌ ట్రంప్‌ కీలక ప్రకటన చేశారు. రిపబ్లికన్ల తరఫున అధ్యక్ష అభ్యర్థిత్వానికి జరిగే రేసులో తాను కూడా ఉన్నట్లు ప్రకటించారు. 

Updated : 16 Nov 2022 10:46 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ 2024లో జరిగే అధ్యక్ష ఎన్నికల్లో బరిలోకి నిలిచేందుకు సన్నాహాలు మొదలుపెట్టారు. మంగళవారం రాత్రి ఆయన రిపబ్లికన్ల తరఫున అధ్యక్ష అభ్యర్థిత్వాన్ని అధికారికంగా కోరుతూ ప్రకటన జారీ చేశారు. మార్‌ ఎ లాగో ఎస్టేట్‌లో నిర్వహించిన కార్యక్రమంలో ట్రంప్ మాట్లాడుతూ ‘‘అమెరికాను మరో సారి గొప్ప ప్రకాశవంతంగా చేసేందుకు అధ్యక్షపదవికి ఈ రాత్రి అభ్యర్థిత్వాన్ని ప్రకటిస్తున్నాను’’ అని ప్రకటించారు. ఆ ఎస్టేట్‌ కేంద్రంగా ట్రంప్‌ ప్రచారకార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ట్రంప్‌ దాదాపు గంటసేపు ప్రసంగించారు.

ప్రస్తుతానికి రిపబ్లికన్‌ పార్టీలో ట్రంప్‌ ఎక్కువ పాపులారిటీ ఉన్న నాయకుడు. కానీ, అమెరికా మధ్యంతర ఎన్నికల్లో తొలుత ఊహించిన స్థాయిలో విజయాలు రాకపోవడంతో ఆయనపై విమర్శలు వస్తున్నాయి. 2020లో ఎన్నికల అవకతవకల ఆరోపణల విషయంలో ట్రంప్‌ పక్షాన నిలిచిన  చాలా మంది అభ్యర్థులు ఈ ఎన్నికల్లో ఓటమి చవిచూశారు. చాలా ముందుగానే అభ్యర్థిత్వానికి పేరు ప్రకటించి రిపబ్లికన్ల ఆమోదం పొందాలని ట్రంప్‌ వ్యూహం. కానీ, ఈ సారి పార్టీ తరఫున బరిలో నిలిచేందుకు చాలా మంది ప్రయత్నాలు మొదలుపెట్టారు. వీరిలో ఫ్లోరిడా గవర్నర్‌ రోన్‌ డెసాంటిస్‌ కూడా ఉన్నారు. ట్రంప్‌ అభ్యర్థిత్వ ప్రకటనపై  స్పందించాలని ఇండోనేషియాలో ఉన్న అమెరికా అధ్యక్షుడు బైడెన్‌ను విలేకర్లు కోరగా ఆయన  నిరాకరించారు. విలేకర్లు ఈ ప్రశ్న అడిగిన వెంటనే పక్కనే ఉన్న ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఇమ్మానియేల్‌ మెక్రాన్‌ వైపు ఒక సారి చూసి.. తాను వ్యాఖ్యానించదల్చుకోలేదనే అర్థం వచ్చేట్లు మాట్లాడారు. 

ట్రంప్‌ ఎదుట ముళ్లబాట..

ట్రంప్‌ తొలిసారి బరిలో దిగిన సమయంలో ఆయనకు ఎటువంటి రాజకీయ చరిత్ర లేదు. దీంతో ఓటర్లు సరికొత్త పాలన లభిస్తుందనే ఆశలతో ఆయనకు ఓటేశారు. కానీ అధికారంలోకి వచ్చాక కొన్ని పాలసీల్లో విజయం సాధించగా.. మరికొన్నింట్లో వైఫల్యాలు ఎదుర్కొన్నారు. మౌలిక వసతుల్లో పెట్టుబడులు అనే వాగ్దానం అసలు నెరవేరలేదు. దీనికి తోడు కరోనావైరస్‌ సమయంలో ట్రంప్‌ వ్యవహారశైలి వంటివి ఆయన్ను వెంటాడుతున్నాయి. ఇక జనవరి 6వ తేదీనాటి వాషింగ్టన్‌ డీసీలో జరిగిన ఘటనలు ఆయన చరిత్రపై మచ్చగా మిగిలిపోయాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని