Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Updated : 07 Oct 2023 17:10 IST

1. సుప్రీంకోర్టును ఆశ్రయించిన చంద్రబాబు

ఏపీ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో తెదేపా అధినేత చంద్రబాబు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. స్కిల్ కేసులో క్వాష్‌ పిటిషన్‌పై హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో చంద్రబాబు తరఫు న్యాయవాదులు పిటిషన్ వేశారు. తనపై ఏసీబీ కోర్టు ఇచ్చిన రిమాండ్‌ను క్వాష్ చేయాలని పిటిషన్‌లో చంద్రబాబు కోరారు.పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

2. తెలంగాణ గ్రూప్ - 1 ప్రిలిమ్స్ రద్దు

తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (TSPSC) నిర్వహించిన గ్రూప్‌- 1 ప్రిలిమ్స్‌ (Group 1 Prilims) పరీక్ష రద్దైంది. గ్రూప్ - 1 ప్రిలిమ్స్ పరీక్షను రద్దు చేసి మళ్లీ నిర్వహించాలని హైకోర్టు ఆదేశించింది. జూన్‌ 11న రాష్ట్రవ్యాప్తంగా జరిగిన ఈ పరీక్షకు 2.32 లక్షల మందికి పైగా అభ్యర్థులు హాజరైన విషయం తెలిసిందే.  హైకోర్టు తీర్పుపై డివిజన్‌ బెంచ్‌కు టీఎస్‌పీఎస్సీ వెళ్లనున్నట్లు తెలుస్తోంది.పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

3. రాజమహేంద్రవరం సెంట్రల్‌ జైలులో చంద్రబాబు విచారణ ప్రారంభం

స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో తెదేపా అధినేత చంద్రబాబును సీఐడీ అధికారులు విచారిస్తున్నారు. రాజమహేంద్రవరం జైలులోనే అధికారులు విచారణ చేపట్టారు. 12 మంది సభ్యుల సీఐడీ బృందం ఆయన్ను విచారిస్తోంది. చంద్రబాబు తరఫు న్యాయవాది దమ్మాలపాటి శ్రీనివాస్‌ సమక్షంలో ఈ విచారణ కొనసాగుతోంది.పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

4. జైలు మోహన్‌కు బెయిల్‌డే వార్షికోత్సవ శుభాకాంక్షలు: లోకేశ్‌

జైలులో ఉండాల్సిన సీఎం జగన్‌ పదేళ్లుగా బెయిల్‌పై ఉన్నారని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ విమర్శించారు. జనంలో ఉండాల్సిన నిజాయతీపరుడు, తెదేపా అధినేత చంద్రబాబు ప్రస్తుతం జైలులో ఉన్నారని పేర్కొన్నారు. ఈ మేరకు నారా లోకేశ్‌ ట్వీట్‌ చేశారు.పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

5. పామాయిల్‌ తోటలో విద్యుత్‌ తీగలు తగిలి.. ముగ్గురి మృతి

కాకినాడ జిల్లా గండేపల్లి మండలంలోని ఉప్పలపాడులో విషాదం నెలకొంది. పామాయిల్‌ తోటలో వ్యవసాయ బోరుకు మరమ్మతులు చేస్తుండగా, విద్యుదాఘాతానికి గురై ముగ్గురు మృతి చెందారు. పొలంలోని విద్యుత్ తీగలు పైపులకు తగలడంతో వీరు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులను బోదిరెడ్డి సూరిబాబు (35), కిల్లినాడు (40), గల్ల బాబీ (24)గా గుర్తించారు.పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

6. నటుడు నవదీప్‌ను ప్రశ్నిస్తున్న నార్కోటిక్స్‌ పోలీసులు

మాదాపూర్ డ్రగ్స్ కేసులో సినీ నటుడు నవదీప్‌ నార్కోటిక్స్‌  పోలీసుల విచారణకు హాజరయ్యాడు. డ్రగ్స్ విక్రేత రామచందర్‌తో ఉన్న లింకులపై నవదీప్‌ను పోలీసులు ప్రశ్నిస్తున్నారు. ఇవాళ తమ ముందు హాజరుకావాలని నవదీప్‌కు నార్కోటిక్స్‌ పోలీసులు నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. మాదాపూర్ డ్రగ్స్ కేసులో నవదీప్‌ను నిందితుడిగా పోలీసులు చేర్చారు.పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

7. స్కూల్‌ బస్సుకు తప్పిన పెను ప్రమాదం

వికారాబాద్‌ జిల్లా సూల్తాన్‌పూర్‌లో ఓ ప్రైవేటు స్కూల్‌ బస్సుకు పెను ప్రమాదం తప్పింది. ప్రమాదవశాత్తు బస్సు నీటి కుంటలోకి దూసుకెళ్లింది. ఈ సంఘటనను గమనించిన స్థానికులు హుటాహుటిన వాహనంలోని 40 మంది విద్యార్థులను కాపాడారు. స్టీరింగ్‌ పనిచేయకపోవడంతోనే ఈ ప్రమాదం జరిగిందని బస్సు డ్రైవర్‌ తెలిపారు.పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

8. ప్రభుత్వ అధికార లాంఛనాలతో హరీశ్వర్‌ రెడ్డి అంత్యక్రియలు

వికారాబాద్‌ జిల్లా పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేష్‌రెడ్డి తండ్రి, మాజీ ఉపసభాపతి కొప్పుల హరీశ్వర్‌రెడ్డి (78) (Koppula Harishwar Reddy) శుక్రవారం రాత్రి గుండెపోటుతో మృతి చెందిన విషయం తెలిసిందే. ఆయన అంత్యక్రియలను అధికారిక లాంఛనాలతో నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు జిల్లా కలెక్టర్‌, ఎస్పీలకు మంత్రి పట్నం మహేందర్‌ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు.పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

9. కెనడా-ఇండియా ఉద్రిక్తతలు.. అమెరికా మొగ్గు ఎటువైపో చెప్పిన పెంటగాన్‌ మాజీ అధికారి

‘ఖలిస్థానీ’ అంశంలో భారత్‌పై కెనడా(India-Canada) ప్రధాని జస్టిన్‌ ట్రూడో(Justin Trudeau) చేస్తోన్న వ్యాఖ్యలతో రెండు దేశాల మధ్య సంబంధాలు దిగజారుతున్నాయి. ఈ సమయంలో రెండు మిత్ర దేశాల విషయంలో అమెరికా మొగ్గు ఎటువైపు ఉంటుందనే ప్రశ్నలు తలెత్తున్నాయి. వీటికి పెంటగాన్‌ మాజీ అధికారి మైఖెల్ రూబిన్‌ ఏం చెప్పారంటే..?పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

10. కెప్టెన్సీ అంటే ఇష్టం.. ఇది నాకేం కొత్త కాదు: కేఎల్ రాహుల్

ఆస్ట్రేలియాతో మూడు వన్డేల సిరీస్‌లో భారత్ శుభారంభం చేసింది. శుక్రవారం జరిగిన మొదటి వన్డేలో టీమ్‌ఇండియా (Team India) 5 వికెట్ల తేడాతో గెలుపొందింది. రోహిత్‌ గైర్హాజరీతో కేఎల్ రాహుల్ (KL Rahul) జట్టును విజయ పథంలో నడిపిండమే కాకుండా అర్ధ శతకం (58) బాది బ్యాటర్‌గానూ అదరగొట్టాడు. మ్యాచ్‌ అనంతరం రాహుల్ మాట్లాడాడు.పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని