USA: కెనడా-ఇండియా ఉద్రిక్తతలు.. అమెరికా మొగ్గు ఎటువైపో చెప్పిన పెంటగాన్‌ మాజీ అధికారి

భారత్‌పై కెనడా(India-Canada) ప్రధాని జస్టిన్‌ ట్రూడో(Justin Trudeau) చేస్తోన్న వ్యాఖ్యలతో రెండు దేశాల మధ్య సంబంధాలు క్షీణిస్తున్నాయి. ఈ సమయంలో రెండు మిత్ర దేశాల విషయంలో అగ్రరాజ్యం మొగ్గు ఎటువైపు ఉండొచ్చనేదానిపై పెంటగాన్‌ మాజీ అధికారి స్పందించారు.

Updated : 23 Sep 2023 13:30 IST

వాషింగ్టన్‌: ‘ఖలిస్థానీ’ అంశంలో భారత్‌పై కెనడా(India-Canada) ప్రధాని జస్టిన్‌ ట్రూడో(Justin Trudeau) చేస్తోన్న వ్యాఖ్యలతో రెండు దేశాల మధ్య సంబంధాలు దిగజారుతున్నాయి. ఈ సమయంలో రెండు మిత్ర దేశాల విషయంలో అమెరికా మొగ్గు ఎటువైపు ఉంటుందనే ప్రశ్నలు తలెత్తున్నాయి. వీటికి పెంటగాన్‌ మాజీ అధికారి మైఖెల్ రూబిన్‌ ఏం చెప్పారంటే..?

‘రెండు మిత్రదేశాల(India-Canada) విషయంలో అమెరికా(USA) ఒకరికి మద్దతుగా నిలుస్తుందని నేను అనుకోవడం లేదు. ఒకవేళ అలా ఎంచుకోవాల్సి వస్తే.. ప్రస్తుత వ్యవహారంలో అమెరికా మొగ్గు భారత్‌ వైపే ఉంటుంది. ఎందుకంటే నిజ్జర్‌ ఒక ఉగ్రవాది. అమెరికాకు భారత్ చాలా ముఖ్యమైంది. మా బంధం చాలా ముఖ్యమైంది. కెనడా ప్రధాని హోదాలో జస్టిన్ ట్రూడో(Justin Trudeau) ఎక్కువ కాలం కొనసాగకపోవచ్చు. ఆయన వెళ్లిపోయిన తర్వాత కెనడాతో మా బంధాన్ని పునర్నిర్మించుకుంటాం’ అంటూ అమెరికా వ్యవహారశైలి గురించి మాట్లాడారు.

భారత్‌తో సంబంధాలను బలోపేతం చేసుకోవాలి

అలాగే ఈ విషయంలో అమెరికా బహిరంగంగా జోక్యం చేసుకుంటుందా..? అని మీడియా అడిగిన ప్రశ్నకు బదులిచ్చారు. ‘నిజం చెప్పాలంటే.. ఈ ఘర్షణ భారత్‌ కంటే కెనడాకే ఎక్కువ ప్రమాదం. ఘర్షణే కావాలనుకుంటే.. అది ఏనుగుతో చీమ పోరాటం లాగే ఉంటుంది. భారత్‌ ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమనేది వాస్తవం. చైనాను ఎదుర్కొనే విషయంలో వ్యూహాత్మకంగా భారత్‌తో మా బంధం చాలా ముఖ్యమైంది’ అని స్పష్టం చేశారు.

నిజ్జర్‌.. కేవలం ప్లంబర్‌ కాదు

అలాగే  ట్రాన్స్‌నేషనల్ రిప్రెషన్(సీమాంతర అణచివేత) అంటూ అమెరికా విదేశాంగ మంత్రి బ్లింకెన్ చేసిన వ్యాఖ్యలను మైఖెల్‌ తప్పుపట్టారు. ‘మనల్ని మనం మోసం చేసుకోకూడదు. నిజ్జర్‌ కేవలం ప్లంబర్(కెనడా చెప్పినట్లు) కాదు. ఒసామా బిన్‌ లాడెన్‌ ఒక ఇంజినీర్‌ కాదు. ఎన్నో దాడులు చేసి నిజ్జర్‌ చేతులు రక్తంతో తడిసిపోయాయి. మనం మాట్లాడుతున్నది సీమాంతర అణిచివేత గురించి కాదు.. సీమాంతర ఉగ్రవాదం గురించి’ అని అన్నారు. అమెరికా ట్విన్‌ టవర్స్‌ కూల్చి దాదాపు 3వేల మందిని పొట్టనబెట్టుకున్న అల్‌ఖైదా అధినేత బిన్‌ లాడెన్‌ను 2011 మే 2న అమెరికా దళాలు హతమార్చిన విషయం తెలిసిందే. ప్రత్యేక కమాండో ఆపరేషన్‌ చేపట్టి పాకిస్థాన్‌లోని అబొటాబాద్‌ కంపౌండ్‌లో నక్కిన లాడెన్‌ను మట్టుబెట్టింది. ఇలా తమ దేశానికి హాని కలిగించిన ఉగ్రవాదిని అమెరికా దళాలు పాక్‌లోకి ప్రవేశించి హతమార్చాయని ఈ సందర్భంగా బ్లింకెన్‌కు మైఖెల్ గుర్తుచేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని