Chandrababu Arrest : రాజమహేంద్రవరం సెంట్రల్‌ జైలులో చంద్రబాబు విచారణ ప్రారంభం

స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో తెదేపా అధినేత చంద్రబాబును సీఐడీ అధికారులు విచారిస్తున్నారు.

Updated : 23 Sep 2023 10:09 IST

రాజమహేంద్రవరం: స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో తెదేపా అధినేత చంద్రబాబును సీఐడీ అధికారులు విచారిస్తున్నారు. రాజమహేంద్రవరం జైలులోనే అధికారులు విచారణ చేపట్టారు. 12 మంది సభ్యుల సీఐడీ బృందం ఆయన్ను విచారిస్తోంది. చంద్రబాబు తరఫు న్యాయవాది దమ్మాలపాటి శ్రీనివాస్‌ సమక్షంలో ఈ విచారణ కొనసాగుతోంది. చంద్రబాబును ప్రశ్నించేందుకు కాన్ఫరెన్స్‌ హాల్‌ను జైలు అధికారులు సిద్ధం చేశారు. విచారణకు ముందు చంద్రబాబుకు వైద్య పరీక్షలు నిర్వహించారు.

చంద్రబాబును రెండు రోజుల పాటు సీఐడీ కస్టడీకి ఇస్తూ విజయవాడలోని ఏసీబీ న్యాయస్థానం శుక్రవారం ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం జ్యుడిషియల్‌ రిమాండులో ఉన్న చంద్రబాబును రాజమహేంద్రవరం కేంద్ర కారాగారం ప్రాంగణంలోనే విచారించాలని కోర్టు సూచించింది. శని, ఆదివారాలు ఉదయం 9.30 నుంచి సాయంత్రం 5 గంటల మధ్యే విచారించాలని, గంటకోసారి అయిదు నిమిషాల విరామమిచ్చి న్యాయవాదిని సంప్రదించుకునేందుకు అవకాశమివ్వాలని పేర్కొంది. ఈ మేరకు ఏసీబీ న్యాయస్థానం న్యాయాధికారి హిమబిందు ఆదేశాలిచ్చారు. చంద్రబాబుపై థర్డ్‌ డిగ్రీ ప్రయోగించరాదని, ఎలాంటి తీవ్రమైన చర్యలు తీసుకోవద్దని స్పష్టం చేశారు. కస్టడీకి తీసుకునే ముందు, కస్టడీ ముగిసిన తర్వాత ఆయనకు తప్పనిసరిగా వైద్యపరీక్షలు నిర్వహించాలని ఆదేశించారు. విచారణను సీఐడీకి చెందిన వీడియోగ్రాఫర్‌తో మాత్రమే రికార్డు చేయించాలని, ఆ వీడియో మొత్తాన్ని సీల్డ్‌కవర్‌లో న్యాయస్థానానికి సమర్పించాలని పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని