Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం..

Updated : 19 Mar 2024 13:06 IST

1.సుప్రీంకోర్టులో రిట్‌ పిటిషన్‌ను వెనక్కి తీసుకున్న కవిత

దిల్లీ మద్యం కేసులో అరెస్టయిన కవిత.. సుప్రీంకోర్టులో వేసిన రిట్‌ పిటిషన్‌ను వెనక్కి తీసుకున్నారు. ఈడీ సమన్లు ఇవ్వడాన్ని సవాలు చేస్తూ దాఖలు చేసిన ఈ పిటిషన్‌ను ఆమె ఉపసంహరించుకున్నారు. ఈ కేసులో ఇప్పటికే ఈడీ అరెస్టు చేసిన నేపథ్యంలో.. రిట్‌ పిటిషన్‌పై విచారణ అవసరం లేనందున వెనక్కి తీసుకుంటున్నామని కవిత తరఫు సీనియర్‌ న్యాయవాది విక్రమ్‌ చౌదరి వెల్లడించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

2.‘అవును కెటమిన్‌ తీసుకున్నా’.. డ్రగ్స్‌ వినియోగంపై మస్క్‌

టెస్లా (Tesla) అధినేత ఎలాన్‌ మస్క్‌ (Elon Musk) మాదకద్రవ్యాలను వినియోగించినట్లు అంగీకరించారు. మానసిక కుంగుబాటు నుంచి బయటపడేందుకు వైద్యుడి సూచన మేరకు కెటమిన్‌ (Ketamine) అనే డ్రగ్‌ను తీసుకున్నట్లు తాజాగా ఒక ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఇది తన ప్రభుత్వ కాంట్రాక్టులు, పెట్టుబడి సంబంధాలపై ప్రభావం చూపదని భావిస్తున్నట్లు తెలిపారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

3.తప్పుదోవ పట్టించే ప్రకటనల కేసులో.. రామ్‌దేవ్‌బాబాకు సుప్రీంకోర్టు సమన్లు

యోగా గురువు రామ్‌దేవ్‌ బాబా(Yoga Guru Ramdev)కు మంగళవారం సుప్రీంకోర్టు(Supreme Court) సమన్లు జారీచేసింది. పతంజలి ఆయుర్వేద సంస్థ వ్యవస్థాపకుల్లో ఒకరైన ఆయనతో  పాటు మేనేజింగ్‌ డైరెక్టర్‌ ఆచార్య బాలకృష్ణ కోర్టు ఎదుట హాజరుకావాలని ఆదేశించింది. తప్పుదోవ పట్టించే ప్రకటనల కేసులో ధిక్కార పిటిషన్‌పై సమాధానం ఇవ్వకపోవడంతో ఈ సమన్లు ఇచ్చింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

4.మ్యాచ్‌ జరుగుతుండగా డ్రెస్సింగ్‌ రూమ్‌లో సిగరెట్ తాగిన క్రికెటర్

పాక్‌ ఆల్‌రౌండర్‌ ఇమాద్‌ వసీమ్‌ (Imad Wasim) వివాదంలో చిక్కుకున్నాడు. పాకిస్థాన్‌ సూపర్‌ లీగ్‌ (PSL)లో ఇస్లామాబాద్‌ యునైటెడ్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న అతడు.. సోమవారం ఫైనల్‌ మ్యాచ్‌ జరుగుతుండగా టీమ్‌ డ్రెస్సింగ్‌ రూమ్‌లో సిగరెట్ తాగుతూ కెమెరాకు చిక్కాడు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

5.ఈనాడు-ఈటీవీ కథనంపై స్పందించిన సీఎం రేవంత్‌రెడ్డి

 ‘ఈనాడు-ఈటీవీ తెలంగాణ’లో వచ్చిన కథనానికి సీఎం రేవంత్‌ రెడ్డి స్పందించారు. మెదడు సంబంధిత సమస్యతో బాధపడుతున్న బాలుడి పరిస్థితిని వివరిస్తూ కథనం వచ్చింది. దీనిపై స్పందించిన సీఎం.. వరంగల్‌ పశ్చిమ ఎమ్మెల్యే రాజేందర్‌ రెడ్డికి ఫోన్‌ చేశారు. బాధిత కుటుంబాన్ని పిలిపించి మాట్లాడాలని ఆదేశించారు.  పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

6.మల్లారెడ్డి అక్రమాలను బయటపెడతాం: మైనంపల్లి రోహిత్‌ 

గత ప్రభుత్వ హయాంలో మాజీ మంత్రి మల్లారెడ్డి దోచుకున్న ప్రతి పైసాను బయటకు తీసుకువస్తామని మెదక్ ఎమ్మెల్యే మైనంప్లలి రోహిత్ తెలిపారు. మల్లారెడ్డి అగ్రికల్చర్ వర్సిటీలో విద్యార్థుల ఆందోళనకు మద్దతు తెలిపిన రోహిత్.. మల్లారెడ్డి అక్రమాలకు అడ్డుకట్ట వేస్తామన్నారు. మల్లారెడ్డి కుటుంబం విద్య, వైద్యం, రాజకీయం పేరుతో రూ. కోట్లు దండుకుంటున్నారన్న రోహిత్.. విద్యార్థులకు అన్యాయం జరిగితే సహించే ప్రసక్తే లేదని హెచ్చరించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

7.పల్లెల్లో మార్పు కోసం ‘యూత్‌ ఫర్‌ ఇండియా’ ఫెలోషిప్‌.. స్టైఫండ్‌ ఎంతంటే?

దేశానికి పట్టు కొమ్మలైన గ్రామాల్లో మార్పు కోసం కృషిచేయాలనుకొనే యువతకు భారతీయ స్టేట్‌ బ్యాంక్‌ (SBI) సువర్ణావకాశం కల్పిస్తోంది. ‘యూత్‌ ఫర్‌ ఇండియా’ (YouthforIndia) పేరిట వారికి ఫెలోషిప్‌లను అందిస్తోంది.  దేశంలోని గ్రామాల స్థితిగతులు, అక్కడి ప్రజలు ఎదుర్కొనే సమస్యలపై పలు ఎన్జీవోలతో కలిసి యువతతో అధ్యయనం చేయిస్తూ.. వారికి ఆర్థిక చేయూతనందిస్తోంది. గ్రామాల్లో క్షేత్రస్థాయిలో పర్యటించాలనే ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈ ఫెలోషిప్‌లకు ఆన్‌లైన్‌లో https://youthforindia.org/  ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.  పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

8.త్వరలో షూటింగ్‌.. మహేశ్‌ మూవీపై జక్కన్న అప్‌డేట్‌

రాజమౌళి-మహేశ్‌బాబు కాంబినేషన్‌లో రానున్న సినిమాకు సంబంధించి కీలక అప్‌డేట్‌ వచ్చింది. ఇటీవల జపాన్‌ వెళ్లిన దర్శకుడు రాజమౌళి స్థానిక మీడియాతో మాట్లాడుతూ ‘‘మహేశ్‌ బాబుతో సినిమా చేస్తున్నా. ఆయన మంచి నటుడు. చాలా అందంగా ఉంటారు. మీలో కొందరికి ఆయన గురించి తెలిసే ఉంటుంది. ఈ చిత్రానికి సంబంధించి ప్రీప్రొడక్షన్‌ వర్క్‌ జరుగుతోంది. త్వరలో చిత్రీకరణను ప్రారంభిస్తాం. వేగంగా నిర్మాణం పూర్తి చేసి మహేశ్‌బాబును ఇక్కడికి తీసుకురావాలని భావిస్తున్నా’’ అని వెల్లడించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

9.అబ్బాయితో భాజపా దోస్తీ.. కేంద్రమంత్రి పదవికి బాబాయ్‌ రాజీనామా

లోక్‌సభ ఎన్నికలకు బిహార్‌ (Bihar)లో ఎన్డీయే (NDA) భాగస్వామ్య పార్టీల మధ్య సీట్ల పంపకం పూర్తయింది. ఇందులో చిరాగ్‌ పాసవాన్‌ (Chirag Paswan) నేతృత్వంలోని ఎల్జేపీ (రాంవిలాస్‌) పార్టీకి ఐదు సీట్లు కేటాయించారు. ఈ పరిణామాలతో అసంతృప్తికి గురైన చిరాగ్‌ బాబాయి, రాష్ట్రీయ లోక్‌ జనశక్తి పార్టీ అధ్యక్షుడు పశుపతి కుమార్‌ పరాస్‌ (Pashupati Paras) కేంద్రమంత్రి పదవికి రాజీనామా చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

10.భర్తీ చేస్తున్నా.. భారీగా ఖాళీలు

ప్రభుత్వ పోటీ పరీక్షల్లో కొందరు అభ్యర్థులు విశేష ప్రతిభతో రెండు, మూడు, నాలుగు, అయిదేసి పోస్టులకు ఎంపికవడం మిగిలిన వారికి అశనిపాతంగా మారుతోంది. ఎవరైనా అభ్యర్థి తాను ఎంపికైన వాటిలో ఏదో ఒక ఉద్యోగానికి వెళ్తుండగా.. ఆ అభ్యర్థి వదులుకున్న పోస్టులను బ్యాక్‌లాగ్‌గా చూపుతున్నారు. దీంతో అవి దీర్ఘకాలికంగా ఖాళీగా ఉంటున్నాయి. దీన్ని మార్చాలని.. అలా మిగిలినవి మెరిట్‌ ఆధారంగా ఇతరులతో భర్తీ చేయాలని అభ్యర్థులు కోరుతున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని