TS News: భర్తీ చేస్తున్నా.. భారీగా ఖాళీలు

ప్రభుత్వ పోటీ పరీక్షల్లో కొందరు అభ్యర్థులు విశేష ప్రతిభతో రెండు, మూడు, నాలుగు, అయిదేసి పోస్టులకు ఎంపికవడం మిగిలిన వారికి అశనిపాతంగా మారుతోంది.

Updated : 19 Mar 2024 11:34 IST

కొందరు మూడు, నాలుగు పోస్టులకు ఎంపిక
ఏదో ఒకదాంట్లో చేరడంతో మిగిలినవి బ్యాక్‌లాగ్‌

ఈనాడు, హైదరాబాద్‌: ప్రభుత్వ పోటీ పరీక్షల్లో కొందరు అభ్యర్థులు విశేష ప్రతిభతో రెండు, మూడు, నాలుగు, అయిదేసి పోస్టులకు ఎంపికవడం మిగిలిన వారికి అశనిపాతంగా మారుతోంది. ఎవరైనా అభ్యర్థి తాను ఎంపికైన వాటిలో ఏదో ఒక ఉద్యోగానికి వెళ్తుండగా.. ఆ అభ్యర్థి వదులుకున్న పోస్టులను బ్యాక్‌లాగ్‌గా చూపుతున్నారు. దీంతో అవి దీర్ఘకాలికంగా ఖాళీగా ఉంటున్నాయి. దీన్ని మార్చాలని.. అలా మిగిలినవి మెరిట్‌ ఆధారంగా ఇతరులతో భర్తీ చేయాలని అభ్యర్థులు కోరుతున్నారు.

గురుకులాల్లో నాలుగువేలకుపైగా..

ప్రస్తుతం ఉన్న నియామక విధానం ప్రకారం ఒక్కో అభ్యర్థి ఎన్ని పోస్టులకైనా దరఖాస్తు చేసుకొని పరీక్షలు రాయవచ్చు. యువత పోలీసు నియామకాల్లో ఎస్సై, కానిస్టేబుల్‌ పరీక్షలు రాస్తూ రెండింట్లో అర్హత సాధిస్తున్నారు. తాజాగా గురుకుల నియామకాల్లో డిగ్రీ, జూనియర్‌ కళాశాలల అధ్యాపకులు, పీజీటీ, టీజీటీ పోస్టులకు వేర్వేరుగా దరఖాస్తు చేసుకుని ఒకటికి మించి ఉద్యోగాలకు ఎంపికయ్యారు. మొత్తం 9,210 ఖాళీల్లో నాలుగు వేల మంది ఒకటికి మించి పోస్టులకు అర్హత సాధించినట్లు తెలుస్తోంది. ఎంపికైన వారికి 21 రోజుల నుంచి 3 నెలల వరకు గడువు ఇచ్చి వారు చేరిన తర్వాత నియామకపత్రాలను అధికారులు అందజేస్తున్నారు. నిర్ణీత గడువులోగా చేరకపోతే మరో అవకాశం ఇచ్చి.. చివరికి భర్తీకాని స్థానంగా పేర్కొంటున్నారు. సాధారణంగా రిజర్వ్‌డ్‌ కేటగిరీ పోస్టులను ఇతరులతో భర్తీ చేయడం సాధ్యం కానందువల్ల వాటిని బ్యాక్‌లాగ్‌గా పేర్కొంటూ తదుపరి నియామకాలకు(క్యారీఫార్వర్డ్‌) పంపించే విధానం మొదట్లో ఉండేది. ఆ తర్వాత ఒకే అభ్యర్థి పలు పోస్టులకు ఎంపికైన సందర్భాల్లోనూ ఇదే విధానం అమలు చేయడంతో అర్హులైన వారు ఉండీ వారికి అన్యాయం జరుగుతోందనే భావన అభ్యర్థుల్లో ఉంది. గత పదేళ్లలో 8 వేల పోస్టులు బ్యాక్‌లాగ్‌లు ఏర్పడగా అందులో 5 వేలకుపైగా ఇలా బహుళ ఉద్యోగాలకు ఎంపికైన వారి వల్లేనని తెలుస్తోంది.

సివిల్‌ సర్వీసెస్‌ విధానం పాటించాలి: ఆర్‌.కృష్ణయ్య

రాష్ట్ర ప్రభుత్వం వెంటనే నియామక విధానంలో సమూల మార్పులు చేయాలి. గురుకుల పోస్టుల్లో నాలుగు వేలు ఖాళీగా ఉండబోతున్నందున వాటిని ఆ తర్వాత మెరిట్‌ గల అభ్యర్థులతో భర్తీ చేయాలి. సివిల్‌ సర్వీసెస్‌ పరీక్షల్లో ప్రతిభ ఆధారంగా ఒక అభ్యర్థికి ఒకే పోస్టుని కేటాయిస్తూ అన్ని భర్తీ చేస్తారు. అదే విధానం ఇక్కడ అన్ని పరీక్షలకు వర్తింపజేయాలి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని