Elon Musk: ‘అవును కెటమిన్‌ తీసుకున్నా’.. డ్రగ్స్‌ వినియోగంపై మస్క్‌

మానసిక కుంగుబాటు నుంచి బయటపడేందుకు గతంలో డ్రగ్స్‌ వినియోగించినట్లు టెస్లా అధినేత ఎలాన్‌ మస్క్ ఒక ఇంటర్వ్యూలో అంగీకరించారు.

Updated : 19 Mar 2024 12:19 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: టెస్లా (Tesla) అధినేత ఎలాన్‌ మస్క్‌ (Elon Musk) మాదకద్రవ్యాలను వినియోగించినట్లు అంగీకరించారు. మానసిక కుంగుబాటు నుంచి బయటపడేందుకు వైద్యుడి సూచన మేరకు కెటమిన్‌ (Ketamine) అనే డ్రగ్‌ను తీసుకున్నట్లు తాజాగా ఒక ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఇది తన ప్రభుత్వ కాంట్రాక్టులు, పెట్టుబడి సంబంధాలపై ప్రభావం చూపదని భావిస్తున్నట్లు తెలిపారు. రెండు నెలల క్రితం మస్క్‌ డ్రగ్స్‌ వినియోగంపై వాల్‌ స్ట్రీట్‌ జర్నల్‌ (WSJ) ఒక కథనాన్ని ప్రచురించింది. ప్రపంచంలో వివిధ ప్రాంతాల్లో జరిగే పార్టీల్లో మస్క్ తరచుగా పాల్గొంటూ.. నిషేధిత డ్రగ్స్‌ను తీసుకుంటున్నారని దానిలో పేర్కొంది. ఈ విషయంపై టెస్లా, స్పేస్‌ ఎక్స్‌ సంస్థల బోర్డు సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారని తెలిపింది. తాజాగా డ్రగ్స్‌ వినియోగంపై స్వయంగా మస్క్‌ చెప్పడం చర్చనీయాంశమైంది. 

‘‘గతంలో నా మెదడులో సంభవించిన మార్పుల వల్ల నేను మానసిక కుంగుబాటుకు గురయ్యాను. ఆ సమయంలో దాన్నుంచి బయటపడేందుకు కెటమిన్‌ నాకు ఉపయోగపడింది. వైద్యుడి సూచన మేరకు వారానికి ఒకసారి చిన్న మొత్తంలో దాన్ని తీసుకునేవాణ్ని. అప్పట్లో రోజుకు 16 గంటలు పనిచేసేవాణ్ని. దాంతో నాపై తీవ్ర ఒత్తిడి ఉండేది. నేను ఎక్కువ కాలం మానసిక కుంగుబాటులో ఉంటే టెస్లా పనితీరుపై ప్రభావం పడుతుంది. దానిని అధిగమించేందుకే కెటమిన్‌ తీసుకున్నా. ఒకవేళ ఎవరైనా దానిని పరిమితి మించి ఉపయోగిస్తే ఏ పని సక్రమంగా పూర్తి చేయలేరు’’ అని మస్క్ వెల్లడించారు. 

2018లో అమెరికన్‌ పాడ్‌కాస్టర్‌ జో రోగన్‌ షోలో మస్క్‌ పాల్గొన్నారు. ఆ సమయంలో అతడు గంజాయి పీల్చిన ఫొటో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ఈ ఘటనపై స్పేస్‌ఎక్స్‌ సంస్థను నాసా లిఖిత పూర్వక వివరణ కోరింది. ఫెడరల్‌ చట్టాల ప్రకారం తమ సంస్థను డ్రగ్స్‌ రహిత కార్యాలయంగా నిర్వహిస్తామని హామీ ఇస్తూ స్పేస్‌ఎక్స్‌ లేఖ రాసినట్లు పలు కథనాలు పేర్కొన్నాయి. తాజాగా మరోసారి డ్రగ్స్‌ వినియోగించినట్లు మస్క్‌ స్వయంగా వెల్లడించారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని