Top 10 News @ 5 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Updated : 10 Mar 2024 17:15 IST

1. బెంగాల్‌లో టీఎంసీ జాబితా.. యూసుఫ్‌ పఠాన్‌, నటి రచనకు ఛాన్స్‌

లోక్‌సభ ఎన్నికల (Lok Sabha Elections)కు సంబంధించి పశ్చిమ బెంగాల్‌లో అధికార టీఎంసీ (TMC) సమర శంఖాన్ని పూరించింది. ‘ఇండియా’ కూటమిలో భాగమైనప్పటికీ.. రాష్ట్రంలో ఒంటరిగానే బరిలోకి దిగుతున్నట్లు సీఎం మమతా బెనర్జీ (Mamata Banerjee) తెలిపారు. మొత్తం 42 స్థానాలకుగానూ అభ్యర్థులను ప్రకటించారు. కోల్‌కతా వేదికగా ఆదివారం పార్టీ ప్రచారానికి శ్రీకారం చుట్టారు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. ఫోన్‌ ట్యాపింగ్‌ వ్యవహారం.. ప్రణీత్‌రావు చుట్టూ బిగుస్తున్న ఉచ్చు

గత ప్రభుత్వంలో స్పెషల్‌ ఇంటెలిజెన్స్‌ బ్రాంచి (ఎస్‌ఐబీ) డీఎస్పీగా పనిచేసిన ప్రణీత్‌ రావుతో పాటు మరికొంత మందిపై పంజాగుట్ట పోలీసులు కేసు నమోదు చేశారు. ఎస్‌ఐబీ అదనపు ఎస్పీ డి.రమేష్ ఫిర్యాదు మేరకు కేసు నమోదైంది. ఎస్‌ఐబీ కార్యాలయంలోని రెండు గదుల్లో ఉన్న 17 కంప్యూటర్లను ప్రణీత్‌రావు అనధికారికంగా వాడుకున్నారు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. వైకాపా నేతలు ఉరవకొండను దోచేస్తున్నారు: లోకేశ్‌

లేపాక్షి నాలెడ్జ్‌ హబ్, సైన్స్‌ సిటీ పేరుతో వైకాపా ప్రభుత్వం సుమారు 17 వేల ఎకరాలు సేకరించిందని.. కానీ ఒక్క పరిశ్రమ అయినా వచ్చిందా? అని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ ప్రశ్నించారు. అనంతపురం జిల్లా ఉరవకొండలో నిర్వహించిన ‘శంఖారావం’ సభలో ఆయన మాట్లాడారు. తెదేపా హయాంలో వందల కిలోమీటర్ల రోడ్లు వచ్చాయన్నారు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4.  ‘సిద్ధం’ సభలకు రూ.600 కోట్లు ఖర్చు: షర్మిల

అధికార పార్టీ వైకాపా ‘సిద్ధం’ సభలతో ప్రభుత్వ ఆదాయాన్ని దోచుకుంటోందని ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల విమర్శించారు. ఒక్కో సిద్ధం సభకు రూ.90 కోట్లు ఖర్చు చేస్తోందని, మొత్తం ఈ సభల కోసం రూ.600 కోట్లు ఖర్చు పెట్టిందని ఆరోపించారు. ఇదంతా ఎవరి డబ్బు అని ప్రశ్నించారు. విజయవాడలోని ఆంధ్రరత్నా భవన్‌లో ఆమె మీడియాతో మాట్లాడారు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. గ్రూప్‌ -1 ప్రిలిమ్స్‌ హాల్‌ టికెట్లు విడుదల

ఏపీపీఎస్సీ గ్రూప్‌ 1 పరీక్ష హాల్‌ టికెట్లు విడుదలయ్యాయి. రాష్ట్రంలోని వివిధ విభాగాల్లో మొత్తం 81 గ్రూప్‌- 1 పోస్టుల భర్తీకి జనవరి 28 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించిన విషయం తెలిసిందే. మార్చి 17న గ్రూప్‌ 1 ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించనున్నారు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. భారాసతో పొత్తుకు మాయావతి అంగీకారం: ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌

లోక్‌సభ ఎన్నికల్లో భారాస (BRS)తో పొత్తుకు బీఎస్పీ (BSP) జాతీయ అధ్యక్షురాలు మాయావతి అంగీకారం తెలిపారు. ఈ మేరకు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ ఎక్స్‌ (ట్విటర్‌)లో పోస్ట్‌ చేశారు. భారాసతో పొత్తుపై త్వరలో ఆ పార్టీ అధినేత కేసీఆర్‌తో తదుపరి చర్చలు ఉంటాయని తెలిపారు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. జీవో నంబర్‌ 3 తెచ్చిందే కేసీఆర్‌ సర్కారు: సీతక్క

మహిళలను కోటీశ్వరులను చేయాలన్నది సీఎం రేవంత్‌రెడ్డి లక్ష్యం అని మంత్రి సీతక్క అన్నారు. హనుమకొండలోని కేయూలో రూ.68 కోట్ల విలువైన పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. కాంగ్రెస్‌ సర్కారు ఒకటో తేదీనే వేతనాలు ఇస్తోందని తెలిపారు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. ఆస్ట్రేలియాలో హైదరాబాద్‌ మహిళ దారుణ హత్య

ఆస్ట్రేలియాలో హైదరాబాద్‌కు చెందిన మహిళ శ్వేత దారుణహత్యకు గురైంది. భర్త అశోక్‌రాజ్‌ ఆమెను హతమార్చాడు. విక్టోరియాలోని బక్లీలో ఈ ఘటన చోటుచేసుకుంది. రోడ్డు పక్కన ఉన్న ఓ చెత్తకుండీలో శ్వేత మృతదేహాన్ని అక్కడి పోలీసులు గుర్తించారు. భార్యను చంపిన తర్వాత కుమారుడిని తీసుకుని అశోక్‌ హైదరాబాద్‌ వచ్చాడు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. గ్యాంగుల చేతిలోకి హైతీ రాజధాని..!

హైతీ (Haiti) రాజధాని పోర్ట్‌ ఒ ప్రిన్స్‌.. దానికి దారి తీసే మార్గాలు మొత్తం క్రిమినల్‌ గ్యాంగుల చేతిలోకి వెళ్లిపోయాయి. చాలా మంది ఇళ్లను వదిలి వెళ్లిపోతున్నారు. దాదాపు 3,62,000 మంది ప్రజలు వలస బాట పట్టారు. ఈ విషయాన్ని ఇంటర్నేషనల్‌ ఆర్గనైజేషన్‌ ఫర్‌ మైగ్రేషన్‌ వెల్లడించింది.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. టెస్లా కోసం నిబంధనలు మార్చలేం: పీయూష్‌ గోయల్‌

అమెరికా (USA)కు చెందిన ఎలక్ట్రిక్‌ కార్ల (Electric Cars) తయారీ సంస్థ టెస్లా (Tesla) కోసం భారత్‌ నిబంధనల్లో మార్పులు చేయబోదని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్‌ గోయల్‌ (Piyush Goyal) తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎలక్ట్రిక్‌ వాహనాల (EV) తయారీదారులు భారత్‌లో ప్లాంట్లు నెలకొల్పేందుకు అనుకూలంగా కేంద్రం చట్టాలను రూపొందించిందని చెప్పారు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని