Piyush Goyal: టెస్లా కోసం నిబంధనలు మార్చలేం: పీయూష్‌ గోయల్‌

ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎలక్ట్రిక్‌ వాహనాల తయారీదారులు భారత్‌లో ప్లాంట్లు నెలకొల్పేందుకు అనుకూలంగా కేంద్రం చట్టాలను రూపొందించిందని కేంద్ర మంత్రి పీయూష్‌ గోయల్‌ అన్నారు.

Published : 10 Mar 2024 16:48 IST

దిల్లీ: అమెరికా (USA)కు చెందిన ఎలక్ట్రిక్‌ కార్ల (Electric Cars) తయారీ సంస్థ టెస్లా (Tesla) కోసం భారత్‌ నిబంధనల్లో మార్పులు చేయబోదని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్‌ గోయల్‌ (Piyush Goyal) తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎలక్ట్రిక్‌ వాహనాల (EV) తయారీదారులు భారత్‌లో ప్లాంట్లు నెలకొల్పేందుకు అనుకూలంగా కేంద్రం చట్టాలను రూపొందించిందని చెప్పారు. చాలా కాలంగా భారత మార్కెట్లోకి అడుగుపెట్టాలని భావిస్తున్న టెస్లా సంస్థ.. దిగుమతి సుంకంలో రాయితీ కోరుతోంది. అయితే, ఇతర కంపెనీలకు ఇవ్వని ప్రాధాన్యం టెస్లాకు మాత్రమే ఇవ్వడం సమంజసం కాదని కేంద్ర ప్రభుత్వం చెబుతోంది. తాజాగా దీనిపై పీయూష్ గోయల్‌ మరోసారి స్పష్టత ఇచ్చారు.

‘‘ఈవీల ప్రాధాన్యాన్ని ప్రభుత్వం గుర్తించింది. వాటితో కాలుష్యం, చమురు దిగుమతులు తగ్గుతాయి. పర్యావరణానికి మేలు జరుగుతుంది. ఇందుకోసం ఏదో ఒక కంపెనీకి అనుకూలంగా నిబంధనల్లో మార్పులు చేయలేం. యూరప్‌ సహా అమెరికా, జపాన్‌, దక్షిణ కొరియాలకు చెందిన సంస్థలతో పలు అంశాల్లో చర్చలు జరుపుతున్నాం. భారత్‌లో పెట్టుబడి పెట్టే సంస్థలు తమ డిమాండ్లను ప్రభుత్వానికి తెలియజేసే స్వేచ్ఛ ఉంటుంది. అయితే, వాటికనుగుణంగా ప్రభుత్వం తప్పనిసరిగా నిర్ణయం తీసుకుంటుందని భావించకూడదు. భవిష్యత్తులో అతిపెద్ద ఎలక్ట్రిక్‌ వాహనాల తయారీ కేంద్రంగా మారే సత్తా భారత్‌కు ఉంది. ఇది మన ఆర్థిక వ్యవస్థకు బలాన్ని చేకూరుస్తుంది’’అని గోయల్‌ తెలిపారు. 

15 ఏళ్లలో 100 బిలియన్‌ డాలర్ల పెట్టుబడులు.. ఈఎఫ్‌టీఏతో భారత్‌ ఒప్పందం!

ప్రస్తుతం భారత్‌లో 40,000 డాలర్లు (దాదాపు 29.75 లక్షలు) లేదా అంతకంటే తక్కువ విలువ ఉన్న విద్యుత్తు వాహనాలపై ప్రభుత్వం 60 శాతం దిగుమతి సుంకం విధిస్తోంది. 40,000 డాలర్ల కంటే ఎక్కువ ధర ఉన్న విద్యుత్తు వాహనాలపై దిగుమతి సుంకం 100 శాతంగా ఉంది. అంటే, అమెరికాలో రూ.34 లక్షల కంటే ఎక్కువ ధర ఉన్న కార్లన్నీ భారత్‌లో రెట్టింపు ధరకు అందుబాటులో ఉంటాయి. దీన్ని 70 శాతానికి పైగా తగ్గించాలని టెస్లా కోరుతోంది. ముందుగా భారత్‌లో కొంతకాలంపాటు కార్లను దిగుమతి చేసి విక్రయిస్తామని, ప్రజల నుంచి వచ్చిన స్పందన ఆధారంగా తయారీ యూనిట్‌ను నెలకొల్పుతామని చెబుతోంది. ఇలా చేయడం వల్ల ఇతర కంపెనీలకు ఇవ్వని ప్రయోజనాలను టెస్లాకు కల్పించినట్లు అవుతుందని, దీనివల్ల మిగతా సంస్థలకు తప్పుడు సంకేతాలు వెళతాయని కేంద్రం భావిస్తోంది. మేకిన్‌ ఇండియా కార్యక్రమానికి అనుగుణంగా తొలుత భారత్‌లో తప్పనిసరిగా తయారీని ప్రారంభించాలని కేంద్రం ఇప్పటికే టెస్లాకు స్పష్టం చేసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని