Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Updated : 15 May 2022 11:17 IST

1. అదే ద్రోహం... అవే అబద్ధాలు

భాజపా ద్రోహచింతన, అబద్ధాలతో జీవిస్తోందని మంత్రి కేటీఆర్‌ అమిత్‌షా పర్యటన అనంతరం ట్విటర్‌లో ధ్వజమెత్తారు. గత ఎనిమిదేళ్లుగా తెలంగాణకు ఏమీ ఇవ్వలేదని... ఇప్పుడూ అదే నిర్లక్ష్యం కొనసాగుతోందన్నారు. ‘‘భాజపా(బక్వాస్‌, జుమ్లా పార్టీ) అంటేనే మతిలేని, బూటకపు హామీల పార్టీ. తెలంగాణలో రాజకీయ పర్యాటక సీజన్‌ కొనసాగుతోంది. మొన్ననే ఒక పర్యాటకుడు వచ్చి వెళ్లారు. ఇప్పుడు మరో పర్యాటకుడు వచ్చారు. తిన్నారు..తాగారు..వెళ్లారు (ఖాయా, పియా...చల్‌దియా).’’ అని పేర్కొన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. ‘ఇన్‌స్పైర్‌’.. విజేతలకు ఉచితంగా బీటెక్‌ సీట్లు

మీ పిల్లలు జాతీయ, అంతర్జాతీయ స్థాయి పోటీలైన ఇన్‌స్పైర్‌, హ్యాక్‌థాన్‌, కిషోర్‌ వైజ్ఞానిక ప్రోత్సాహన్‌ యోజన, నాసా కాంటెస్ట్‌ వంటి వాటిల్లో ప్రతిభ చూపారా? అయితే వారు జేఈఈ మెయిన్‌, ఎంసెట్‌ లాంటి ప్రవేశ పరీక్షలు రాయకున్నా.. రాసినా ర్యాంకు రాకున్నా ఉన్నత ప్రమాణాలున్న కళాశాలల్లో బీటెక్‌లో చేరొచ్చు. అంతేకాదు వారు ట్యూషన్‌ ఫీజు కూడా చెల్లించాల్సిన అవసరం లేదు. అఖిల భారత సాంకేతిక విద్యా మండలి(ఏఐసీటీఈ) తాజాగా ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. రోడ్డు ప్రమాదంలో ఆండ్రూ సైమండ్స్‌ మృతి

ఆస్ట్రేలియా దిగ్గజ క్రికెటర్‌, మాజీ ఆల్‌రౌండర్‌ ఆండ్రూ సైమండ్స్‌ (46) రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. క్విన్స్‌లాండ్‌లోని టౌన్స్‌విల్లేలో ఆయన నివాసం ఉంటున్న ప్రాంతంలో గతరాత్రి కారు ప్రమాదానికి గురయ్యాడు. ఈ దుర్ఘటనలో సైమండ్స్‌ కన్నుమూసినట్లు అక్కడి పోలీసులు వెల్లడించారు. అతడి మృతి పట్ల పలువురు ఆటగాళ్లు, మాజీ సహచరులు విచారం వ్యక్తం చేశారు. సైమండ్స్‌ 1998 నుంచి 2012 వరకు క్రికెట్‌ ఆడాడు. ఆస్ట్రేలియా తరఫున 26 టెస్టులు, 198 వన్డేలు, 14 టీ20ల్లో ప్రాతినిధ్యం వహించాడు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. ఒక్క గేటు పెట్టలేరా!

ఒకే ఒక్క గేటు...! కావాల్సింది కేవలం రూ.7.75 కోట్లు...చిన్నాచితకా ప్రాజెక్టులో కూడా కాదు. కృష్ణా డెల్టాకు బ్యాలెన్సింగ్‌ జలాశయంగా ఉన్న పులిచింతలలో... ఏకంగా 45.77 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యం ఉన్న ప్రాజెక్టులో...నిరుటి ఆగస్టులో వరదలకు నిర్వహణ లోపాలతో గేటు కొట్టుకుపోయింది...ఇప్పటికే 9 నెలలు పూర్తయింది..దాని స్థానంలో తాత్కాలికంగా స్టాప్‌లాగ్‌ గేటు ఏర్పాటు చేశారు...మళ్లీ వరదల కాలం వస్తోంది. ఆ స్టాప్‌లాగ్‌ గేటు ఎంతవరకు భద్రమో తెలియడంలేదు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

అప్పులపై ఉక్కపోత

5. ‘అందం పెట్టుబడి..’ బలహీనతే రాబడి!

పెళ్లయిన మహిళ వ్యామోహంలో పడిన యశ్వంత్‌.. ప్రియురాలితో సహా హత్యకు గురయ్యాడు. అక్రమసంబంధంతో దగ్గరైన ప్రియురాలిని పెళ్లి చేసుకుందామని బెదిరింపులకు దిగిన యశ్మకుమార్‌ ఆమె స్నేహితుల చేతిలో మరణించాడు. మహానగరంలో తాజాగా వెలుగుచూసిన దారుణాల్లో కొన్ని మాత్రమే. సామాజిక మాధ్యమాలు.. పబ్‌లు.. క్లబ్‌ల్లో పరిచయమైన అమ్మాయిలను లోబరచుకోవాలని అబ్బాయిలు. కాసులున్న కుర్రోడితో జతకట్టి అందినంత దోచుకోవాలని కిలేడీలు చేస్తున్న మోసాలు.. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. Andhra News: నిండు గర్భిణి.. భర్తతో గొడవపడి 65 కి.మీ. నడక

వర్షిణి నిండు గర్భిణి... ఆమె కళ్లు ఏకధారగా వర్షిస్తూనే ఉన్నాయి... అడుగు తీసి అడుగు ముందుకు వేయాలంటే నిస్సత్తువ... అయినా కాళ్లు ముందుకు సాగుతూనే ఉన్నాయి. ఓపక్క తన బాగోగులు చూడకుండా నిత్యం గొడవ పెట్టుకునే భర్తపై గొంతు దాకా కోపం... మరోపక్క గర్భంలోని శిశువుపై గుండె నిండుగా ప్రేమ... బిడ్డను ఎలాగైనా కాపాడుకోవాలనే తపన... అలా అలా 65 కిలోమీటర్లు నడుస్తూ వెళ్లింది... తిరుపతిలో బయలుదేరి నాయుడుపేట చేరుకుంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. ఫైవ్‌స్టార్‌ హోటల్లో సాధువుల భేటీ!

సాధువులూ ట్రెండు మార్చారు. గతంలో మాదిరి మఠాలు, పుణ్యక్షేత్రాలు కాకుండా ఇప్పుడు ఫైవ్‌స్టార్‌ హోటళ్లలో సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఉత్తరాఖండ్‌ రాష్ట్రం హరిద్వార్‌లో అఖిల భారత అఖాడా పరిషత్‌ నిర్వహించిన ఓ కార్యక్రమానికి సంబంధించిన ఫొటోలు ఇపుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. ప్రజలు ఆధునిక జీవనానికి అలవాటుపడుతున్న మాట సాధారణమే అయినా.. అటువంటి ఆడంబరాలకు దూరంగా ఉండే సాధువులు కూడా ఆ జాబితాలో చేరడం విశేషం. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. Thomas Cup: చరిత్ర ముంగిట భారత్‌..

చిరస్మరణీయమైన ప్రదర్శనతో థామస్‌కప్‌ ఫైనల్‌కు దూసుకెళ్లిన భారత పురుషుల జట్టు సిసలు సమరానికి సిద్ధమైంది. ఇండోనేసియాతో ఆదివారం జరిగే ఫైనల్లో గెలిచి చరిత్ర సృష్టించేందుకు కుర్రాళ్లు ఉవ్విళ్లూరుతున్నారు. క్వార్టర్స్‌లో మలేసియా.. సెమీస్‌లో డెన్మార్క్‌ లాంటి బలమైన జట్లను ఓడించిన భారత్‌కు పద్నాలుగుసార్లు ఛాంపియన్‌ ఇండోనేసియాతో పోరు అంత సులభం కాదు. ప్రస్తుత టోర్నీలో ఒక్క ఓటమి కూడా చవిచూడని ఇండోనేసియాకు షాక్‌ ఇవ్వాలంటే.. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. కరోనా ముందు స్థాయిలకు వార్షిక వేతన పెంపులు

దేశంలో ఈ ఏడాది సగటు వేతన పెంపు 8.13 శాతంగా ఉండొచ్చని ఓ నివేదిక చెబుతోంది. కరోనా నుంచి దేశం కోలుకుంటుండడం ఇందుకు నేపథ్యమని అంటోంది. గత రెండేళ్ల తరహాలో కాకుండా.. ఈ ఏడాది అన్ని రంగాల్లోని ఉద్యోగాల్లో వేతన పెంపును ఇచ్చారని టీమ్‌లీజ్‌ రూపొందించిన ‘జాబ్స్‌ అండ్‌ శాలరీ ప్రీమియర్‌ రిపోర్ట్‌ ఫర్‌ 2021-22’ పేర్కొంది. అయితే అవి ఓ మోస్తరుగానే ఉండొచ్చని అంచనా కట్టింది. సమీక్షించిన 17 రంగాల్లో 14 రంగాల్లో వేతన పెంపు సగటున 8.13 శాతం మేర ఉండొచ్చని అంటోంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. Gun Fire న్యూయార్క్‌లో కాల్పుల మోత.. 10మంది దుర్మరణం

అమెరికాలో మరోసారి కాల్పుల మోత మోగింది. న్యూయార్క్‌లోని ఓ సూపర్‌ మార్కెట్‌లో దుండగుడు కాల్పులకు తెగబడ్డాడు. ఈ ఘటనలో పది మంది దుర్మరణం చెందారు. సూపర్‌ మార్కెట్‌లోకి సైనికుడి వేషంలో తుపాకీతో ప్రవేశించిన దుండగుడు.. అక్కడున్న వారిపై విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు. ఈ దుశ్చర్యలో 10 మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా.. పలువురు గాయపడ్డారు. దుండగుణ్ని ఎఫ్‌బీఐ అధికారులు అదుపులోకి తీసుకొని దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

మరో మహిళతో సంబంధం... ఆయన్ని మార్చేదెలా?

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని