కరోనా ముందు స్థాయిలకు వార్షిక వేతన పెంపులు

దేశంలో ఈ ఏడాది సగటు వేతన పెంపు 8.13 శాతంగా ఉండొచ్చని ఓ నివేదిక చెబుతోంది. కరోనా నుంచి దేశం కోలుకుంటుండడం ఇందుకు నేపథ్యమని అంటోంది. గత రెండేళ్ల తరహాలో కాకుండా.. ఈ ఏడాది అన్ని

Published : 15 May 2022 02:49 IST

 ఈ ఏడాది 8.13% ఉండొచ్చు
 టీమ్‌లీజ్‌ నివేదిక

ముంబయి: దేశంలో ఈ ఏడాది సగటు వేతన పెంపు 8.13 శాతంగా ఉండొచ్చని ఓ నివేదిక చెబుతోంది. కరోనా నుంచి దేశం కోలుకుంటుండడం ఇందుకు నేపథ్యమని అంటోంది. గత రెండేళ్ల తరహాలో కాకుండా.. ఈ ఏడాది అన్ని రంగాల్లోని ఉద్యోగాల్లో వేతన పెంపును ఇచ్చారని టీమ్‌లీజ్‌ రూపొందించిన ‘జాబ్స్‌ అండ్‌ శాలరీ ప్రీమియర్‌ రిపోర్ట్‌ ఫర్‌ 2021-22’ పేర్కొంది. అయితే అవి ఓ మోస్తరుగానే ఉండొచ్చని అంచనా కట్టింది. సమీక్షించిన 17 రంగాల్లో 14 రంగాల్లో వేతన పెంపు సగటున 8.13 శాతం మేర ఉండొచ్చని అంటోంది. ‘వేతన పెంపులు రెండంకెలకు చేరాల్సి ఉంది. అయితే గత రెండేళ్లుగా కనిపించిన వేతన తగ్గింపు, పెంపు నిలిపివేత చివరికి వచ్చేసింది. అన్ని రంగాల్లోనూ కరోనా ముందు స్థాయిలకు పెంపులు చేరుతున్నాయ’ని టీమ్‌లీజ్‌ సర్వీసెస్‌ సహ వ్యవస్థాపకులు రితుపర్ణ చక్రవర్తి పేర్కొన్నారు.

కొత్త తరం రంగాల వల్లే..: భారత కార్పొరేట్‌ రంగం కొత్త తరం ఉద్యోగాలపై దృష్టిని కొనసాగించడం ఆసక్తికర అంశం. ఈ కొత్త రంగాలే వ్యాపారాలను ముందుకు నడిపిస్తున్నాయి. 2020-21లో 17 రంగాల్లో కేవలం అయిదు మాత్రమే కొత్త తరం ఉద్యోగాలను సృష్టించగా.. 2021-22లో తొమ్మిది రంగాల్లోకి ఇవి విస్తరించాయి. తొమ్మిది నగరాల్లో 17 రంగాల్లోని 2,63,000 అభ్యర్థుల వేతనాలను పరిశీలించిన అనంతరం ఈ నివేదికను రూపొందించారు. కాగా, అత్యంత స్పెషలైజ్డ్‌ ఉద్యోగ హోదాలకు గిరాకీ కొనసాగుతోంది. ఈ విభాగంలో వృద్ధి ఈ ఏడాది 11-12% మేర కనిపించింది.

హైదరాబాద్‌లో ఎక్కువ: అహ్మదాబాద్‌, బెంగళూరు, చెన్నై, దిల్లీ, హైదరాబాద్‌, ముంబయి, పుణెలలో 12% కంటే అధిక వేతన పెంపులను ఇచ్చాయి. ఇక ఇ-కామర్స్‌-టెక్‌ అంకురాలు, ఆరోగ్య సంరక్షణ-అనుబంధ సంస్థలు, ఐటీ సేవల వంటివి వేతన పెంపు(10% కంటే ఎక్కువ)లో ముందున్నాయి. ఇక వ్యవసాయం, వాహన, బ్యాంకింగ్‌, ఆర్థిక సేవలు-బీమా, బీపీఓ-ఐటీ, నిర్మాణ-స్థిరాస్తి, విద్య, ఎఫ్‌ఎమ్‌సీజీ, ఆతిథ్య, పారిశ్రామిక తయారీ, మీడియా-వినోదం, విద్యుత్‌-ఇంధనం, రిటైల్‌, టెలికాం వంటి రంగాల్లో ఇంక్రిమెంట్లు 10 శాతంలోపు ఉన్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని