ఈ వయసులో మరో మహిళతో సంబంధం... ఆయన్ని మార్చేదెలా?

హాయ్ మేడమ్.. మా నాన్నకు అరవయ్యేళ్లు. సాధారణంగా అన్ని విషయాల్లోనూ ఆయన మంచివారే. అయితే గత అయిదేళ్ల నుంచి ఆయన ఒక మహిళతో సంబంధం పెట్టుకున్నాడు. మేము ఉద్యోగరీత్యా వేరే ప్రాంతంలో ఉంటున్నాం. దానివల్ల ఇంటి విషయాలు.....

Published : 14 May 2022 19:39 IST

(Image for Representation)

హాయ్ మేడమ్.. మా నాన్నకు అరవయ్యేళ్లు. సాధారణంగా అన్ని విషయాల్లోనూ ఆయన మంచివారే. అయితే గత అయిదేళ్ల నుంచి ఆయన ఒక మహిళతో సంబంధం పెట్టుకున్నాడు. మేము ఉద్యోగరీత్యా వేరే ప్రాంతంలో ఉంటున్నాం. దానివల్ల ఇంటి విషయాలు మాకు సరిగా తెలియవు. మా అమ్మ ఎప్పుడూ నాన్న గురించే ఆలోచిస్తుంటుంది. ఆ విషయంపై ఇంట్లో తరచూ గొడవలు జరుగుతున్నాయి. దాంతో అదే విషయం గురించి మా అన్నయ్య నాన్నతో మాట్లాడారు. దానికి ఆయన అదంతా ఒక రూమర్.. అని కొట్టిపడేశాడు. మా నాన్న మీద కంప్త్లెంటు చేద్దామంటే, అప్పటికే ఈ విషయం గురించి అమ్మ.. నాన్నను అడిగే ప్రశ్నలకు నాన్న కొన్నిసార్లు ఆత్మహత్యా ప్రయత్నం కూడా చేశారు. ఈ సమస్య నుంచి ఎలా బయటపడాలో అర్థం కావట్లేదు. సలహా ఇవ్వండి. - ఓ సోదరి

జ. మీ తల్లిదండ్రులకు ఈ వయసులో ఒకరిపై ఒకరికి అవగాహన లోపం రావడం, అది ఇద్దరి మధ్య కలతలకి కారణమవడం అనేవి మిమ్మల్ని బాధిస్తున్నాయి. ఆయనకి ఇంకెవరితోనో సంబంధం ఉందని కచ్చితంగా చెప్పగలుగుతున్నారా? లేక అది కేవలం అపోహ మాత్రమేనా? అనే విషయాన్ని ముందుగా తెలుసుకునే ప్రయత్నం చేయండి. ఒకవేళ అదే నిజమైతే మీ అమ్మగారు పడుతున్న బాధను ఆయన అర్థం చేసుకొని, దాన్నుంచి బయటకు వచ్చే అవకాశం ఉందా? అసలు మీ నాన్నగారు ఏ విషయంలో బాధపడుతున్నారో, దానిని పరిష్కరించే అవకాశం ఉందా?.. ఇవన్నీ మీరందరూ కలిసి కూర్చొని మాట్లాడుకోవాల్సిన అంశాలు.

మీ అమ్మానాన్నల ఆలోచనల్లో బాధ, ఆవేదన ఉన్నాయనేది మీ ఉత్తరం స్పష్టం చేస్తోంది. మీ అమ్మగారు వేదనతో మాట్లాడే మాటల వల్ల మీ నాన్నగారు ఆత్మహత్యా ప్రయత్నం దాకా వెళ్లారంటే.. అది తీవ్రంగా పరిగణించాల్సిన విషయం. అలాగే మీ అమ్మగారు కూడా ఇదే విషయం గురించి తీవ్రంగా ఆలోచిస్తున్నారంటే.. దాన్నీ తేలికగా తీసుకోకూడదు.

ఎందుకంటే వారిద్దరినీ అలా వదిలేస్తే సమస్య మరింత తీవ్రమయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి, వారితో మాట్లాడి, అసలు కారణాలేమై ఉండొచ్చు? నిజానిజాలు ఎంతవరకు ఉన్నాయి? ఒకవేళ విషయం నిజమే అయితే అందుకు ఏం చేయాలి? వారిద్దరి మధ్య సఖ్యత కుదర్చడానికి మీరేం చేయగలుగుతారు? ఒకవేళ మీ నాన్న గారికి వేరే వారిపై దృష్టి మళ్లి ఉంటే.. అది ఈ వయసులో ఎందుకు జరిగింది? దాన్నుంచి ఎలా బయటకు రాగలుగుతారు?వంటి విషయాలన్నీ ఆలోచించండి. 

ఈ క్రమంలో మీ తల్లిదండ్రుల ఆరోగ్య పరిస్థితిని కూడా దృష్టిలో పెట్టుకోవడం ముఖ్యం. కాబట్టి మీ కుటుంబ సభ్యులు, ముఖ్యంగా పిల్లలుగా మీరిద్దరూ, ఇంకా ఎవరైనా తోబుట్టువులు ఉంటే.. వారితో కలిసి చర్చించి ఈ విషయాన్ని ఓ కొలిక్కి తీసుకొచ్చే ప్రయత్నం చేయండి. అవసరమైతే మానసిక నిపుణుల సహాయం కూడా తీసుకోండి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్