Top Ten News @ 9 PM

ఈనాడు.నెట్‌లోని పది ముఖ్యమైన వార్తలు మీ కోసం.. 

Published : 13 Jul 2021 20:54 IST

1. ap news: కృష్ణా జలాలపై సుప్రీంకు: సజ్జల

కృష్ణా జలాల వివాదంపై ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్తుందని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. తాడేపల్లిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ...తెలంగాణ చర్యల వల్ల నీరు వృథాగా సముద్రం పాలైందన్నారు. వర్షాలు పడకపోతే రాయలసీమ ప్రాంతానికి అపార నష్టం వాటిల్లుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటివి మరోసారి జరగరాదనే సుప్రీంకోర్టుకు వెళ్లాలని నిర్ణయించినట్టు చెప్పారు.

2. బుగ్గన అబద్ధాలు చెబుతున్నారు: పయ్యావుల

బ్యాంకు పూచీకత్తులపై ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి అబద్ధాలు చెబుతున్నారని పీఏసీ ఛైర్మన్‌ పయ్యావుల కేశవ్‌ ఆరోపించారు. విజయవాడలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ... బ్యాంకు గ్యారంటీల గురించి శాసనసభలో దాచారని విమర్శించారు.

3. ఇకపై ఏటా జాబ్‌ క్యాలెండర్‌ : కేసీఆర్‌

ఇకపై ఉద్యోగ నియామకాలకు ఏటా జాబ్‌ క్యాలెండర్‌ విడుదల చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశించారు. ప్రగతి భవన్‌లో సమావేశమైన తెలంగాణ మంత్రివర్గం రాష్ట్రంలో ఉద్యోగ నియామకాలపై విస్తృతంగా చర్చించింది. ఇదే అంశంపై చర్చించేందుకు రేపు మధ్యాహ్నం 2గంటలకు మరోమారు సమావేశం కావాలని మంత్రివర్గం నిర్ణయించింది. ఏటా నియామకాల కోసం వార్షిక క్యాలెండర్‌ తయారీకి కేబినెట్‌ ఆమోదం తెలిపింది. ఖాళీల గుర్తింపు, భర్తీ ప్రక్రియపై రేపు కూడా మంత్రివర్గం చర్చించనుంది.

4. నీట్‌- పీజీ పరీక్ష తేదీ ఖరారు 

కరోనా సెకండ్ వేవ్‌ ఉద్దృతి కారణంగా వాయిదా పడిన నీట్‌ - పీజీ పరీక్షకు కేంద్రం కొత్త తేదీని ప్రకటించింది. సెప్టెంబర్‌ 11న ఈ పరీక్ష నిర్వహించనున్నట్టు కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్‌సుఖ్‌ మాండవీయ ప్రకటించారు. ఈ మేరకు ఆయన ట్వీట్‌ చేశారు. కొవిడ్‌ నిబంధనల మేరకు పరీక్షకు ఏర్పాట్లు చేయనున్నారు. దేశంలో కరోనా పరిస్థితుల దృష్ట్యా ఆగస్టు నెలాఖరు వరకు ఈ పరీక్ష నిర్వహించబోమని గతంలో కేంద్ర ప్రభుత్వం స్పష్టంచేసిన విషయం తెలిసిందే.

5. CustomsDuty Waiver: తగ్గనున్న కొవిడ్‌ కిట్ల ధరలు!

దేశంలో కరోనా వైరస్‌ విజృంభిస్తోన్న వేళ.. కొవిడ్‌ కిట్లతో పాటు కీలక ఔషధాల ధరలను తాత్కాలికంగా తగ్గించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా కొవిడ్‌ బాధితుల చికిత్సలో ఉపయోగించే కొన్ని రకాల ఔషధాల తయారీకి కావాల్సిన ముడిపదార్థాల (API) దిగుమతిపై కస్టమ్స్‌ సుంకాన్ని మినహాయిస్తున్నట్లు వెల్లడించింది. వీటితోపాటు కొవిడ్‌ టెస్టు కిట్‌ల ముడిపదార్థాల దిగుమతిపై ఇది వర్తిస్తుందని పేర్కొంది.

Zika Virus: కేరళలో చాపకింద నీరులా ‘జికా’

6. Nepal: ప్రధానిగా దేవ్‌బా నియామకం

నేపాల్ కాంగ్రెస్ అధ్యక్షుడు షేర్ బహదూర్ దేవ్‌బా (74) ఐదోసారి ఆ దేశ ప్రధానమంత్రిగా నియమితులయ్యారు. రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 76(5) మేరకు నేపాల్‌ రాష్ట్రపతి విద్యాదేవి భండారీ ఈ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రమాణ స్వీకారం ఎప్పుడు చేస్తారనే వివరాలను మాత్రం వెల్లడించలేదు. ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన 30 రోజుల్లో దేవ్‌బా పార్లమెంట్‌లో తన బలాన్ని నిరూపించుకోవాల్సి ఉంటుంది.

7. modi: కరోనా దానంతట అదే రాదు..పోదు

కరోనా వైరస్‌ మూడోదశ దానంతట అదే విజృంభించదని, మనం ఆహ్వానిస్తేనే మనపై దాడి చేస్తుందని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. మూడో ముప్పు రాకుండా దేశం పోరాడుతుంటే.. హిల్‌ స్టేషన్ల వద్ద భారీగా జనసమూహాలు దర్శనమివ్వడం తీవ్ర ఆందోళన కలిగిస్తోందన్నారు. మాస్కులు ధరించకుండా, భౌతిక దూరాన్ని పూర్తిగా మర్చిపోవడంపై ఆయన దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

8. Chidambaram: డిసెంబర్‌కీ అందరికీ టీకా..ఒట్టి మాటే..

కరోనాను కట్టడి చేసే లక్ష్యంతో కేంద్రం నిర్వహిస్తోన్న టీకా కార్యక్రమం నత్తనడకన సాగుతోందని కాంగ్రెస్ నేత చిదంబరం విమర్శించారు. డిసెంబర్ చివరినాటికి దేశంలోని వయోజనులందరికీ టీకా అందించనున్నామనే ప్రభుత్వ హామీ.. ఒట్టి ప్రగల్భమంటూ నిందించారు. ఒడిశా, దిల్లీ టీకా కొరతను ఎదుర్కొంటున్నాయని ఆరోపించారు.

9. వాతావరణ హెచ్చరికలు కాదు.. కరోనా ఘంటికలు!

దేశంలో పలుప్రాంతాల్లో కొవిడ్‌ నిబంధన ఉల్లంఘనలపై కేంద్ర ప్రభుత్వం ఆందోళన వ్యక్తంచేసింది. కరోనా పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండకపోతే వైరస్‌ కట్టడిలో ఇప్పటివరకు సాధించిన ఫలితమంతా వృథా అవుతుందని హెచ్చరించింది. దేశంలో కరోనా పరిస్థితిపై వైద్యశాఖ ఉన్నతాధికారులు మీడియా సమావేశం నిర్వహించారు. థర్డ్‌వేవ్‌ తీవ్రతను అర్థంచేసుకోవడంలో ప్రజలు విఫలమవుతున్నారని కేంద్ర ఆరోగ్యశాఖ సంయుక్త కార్యదర్శి లవ్‌ అగర్వాల్‌ అన్నారు.

10. అనాథే.. ఒలింపిక్స్‌లో మన ఆశాదీపం

ఐదేళ్ల వయస్సు ఉన్నప్పుడు నాన్న చనిపోయాడు.. ఆ బాధను మరిచిపోయేలోపే అమ్మ కూడా దూరమైంది.. ఏ ఆధారం లేని అమ్మాయి బతికి బట్ట కడితేనే గొప్ప అన్నారు... తను బామ్మ అండతో ఎదిగింది... పరుగునే ప్రాణం చేసుకుంది... కాళ్లకు బూట్లు లేకుండానే చిరుతలా పరుగెత్తింది... చివరికి క్రీడాకారులంతా అసూయపడేలా 400మీటర్ల మిక్స్‌డ్‌ రిలే విభాగంలో ఒలింపిక్స్‌లో దేశానికి ప్రాతినిధ్యం వహించబోతోంది.. ఆ అమ్మాయి రేవతి వీరమణిది స్ఫూర్తిగాథ.

Tokyo Olympics: అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వాలి: మోదీ

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని