Top Ten News @ 9 PM: ఈనాడు.నెట్‌లోటాప్‌ 10 వార్తలు

ఈనాడు.నెట్‌లోని పది ముఖ్యమైన వార్తలు మీ కోసం.. 

Updated : 16 Jan 2022 21:11 IST

1. ఏపీలో యథావిధిగా విద్యాసంస్థలు: మంత్రి సురేశ్‌

రాష్ట్రంలో సంక్రాంతి సెలవులు పొడిగింపు ఆలోచన లేదని, ప్రకటించిన విధంగా యథావిధిగా పాఠశాలలు నడుస్తాయని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్‌ ఒక ప్రకటనలో తెలిపారు. విద్యార్థుల ఆరోగ్యభద్రతతో పాటు వారి భవిష్యత్తు గురించి కూడా ప్రభుత్వం ఆలోచిస్తుందని చెప్పారు. ఇప్పటికే ఉపాధ్యాయులకు వ్యాక్సిన్‌ ప్రక్రియ పూర్తి చేశామని, 15 నుంచి 18 సంవత్సరాల వయసు విద్యార్థులకు దాదాపు 92 శాతం వ్యాక్సిన్‌ వేయడం జరిగిందన్నారు. 

2. కాంగ్రెస్‌లో చేరనున్న రాజ్యసభ సభ్యుడు డి.శ్రీనివాస్‌

రాజ్యసభ సభ్యుడు డి.శ్రీనివాస్‌ త్వరలో సొంతగూటికి వెళ్లనున్నారు. ఈనెల 24న కాంగ్రెస్‌ అధినేత్రి సోనియా గాంధీ సమక్షంలో కాంగ్రెస్‌లో చేరే అవకాశం కనిపిస్తోంది. గతంలో పీసీసీ అధ్యక్షుడిగా, మంత్రిగా కాంగ్రెస్‌లో కీలక పాత్ర పోషించిన డీఎస్‌... 2015లో తెరాసలో చేరారు. తెరాస నుంచి రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికైన ఆయన .. కొంతకాలంగా పార్టీకి దూరంగా ఉంటున్నారు.

3. కరోనా ఎఫెక్ట్‌...శ్రీశైలం దేవస్థానం కీలక నిర్ణయాలు

తెలుగు రాష్ట్రాల్లో కొవిడ్‌ కేసులు భారీగా నమోదువుతున్న నేపథ్యంలో దేవాదాయశాఖ ఆదేశాల మేరకు శ్రీశైలం దేవస్థానం అధికారులు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. కరోనా వల్ల స్వామివారి సర్వదర్శనం నిలిపివేస్తున్నట్టు ఈవో లవన్న తెలిపారు. అన్నప్రసాద వితరణ, పుణ్య స్నానాలు తాత్కాలికంగా నిలుపుదల చేస్తున్నట్టు చెప్పారు. ఇకపై రోజుకు నాలుగు విడతల్లో సామూహిక అభిషేకాలు ఉంటాయని వెల్లడించారు.

4. తెలంగాణలో కొత్తగా 2,047 కరోనా కేసులు.. ముగ్గురి మృతి

తెలంగాణలో కరోనా కేసులు భారీగా నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 55,883 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. కొత్తగా 2,047 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం ఇప్పటివరకు నమోదైన కేసుల సంఖ్య 7,09,209కి చేరింది. ఈ మేరకు వైద్య ఆరోగ్యశాఖ బులిటెన్‌ విడుదల చేసింది. గత 24 గంటల వ్యవధిలో రాష్ట్రంలో కరోనాతో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు.

5. 36 ఎంఎంటీఎస్‌ సర్వీసులు రద్దు

సోమవారం సికింద్రాబాద్‌ పరిధిలో 36 ఎంఎంటీఎస్‌ సర్వీసులను రద్దు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. సాంకేతిక కారణాలు, ట్రాక్‌ మరమ్మతుల నిమిత్తం ఈ సర్వీసులను రద్దు చేసినట్లు తెలిపింది. నిత్యం నడిపే 79 ఎంఎంటీఎస్‌ సర్వీసుల్లో రేపు 36 సర్వీసులు రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే పేర్కొంది. 

6. ప్రపంచ విజేతలకు షాకిచ్చిన భారత ఆటగాళ్లు

బీడబ్ల్యూఎఫ్‌ వరల్డ్‌ టోర్నమెంట్‌లో భాగంగా జరిగే ఇండియా ఓపెన్‌ బ్యాడ్మింటన్‌ టోర్నీలో భారత ఆటగాళ్లు సత్తా చాటారు. పురుషుల డబుల్స్‌ ఫైనల్స్‌లో సాత్విక్‌ సాయిరాజ్‌ - చిరాగ్‌ శెట్టి ద్వయం మెరిసింది. మూడుసార్లు ప్రపంచ ఛాంపియన్స్‌ అయిన మహ్మద్‌ అహ్సన్‌-హెండ్రా సెటియావాన్‌ (ఇండోనేషియా) జోడిపై వారు అద్భుత విజయం సాధించారు. అలాగే సింగిల్స్‌ ఫైనల్‌లో ప్రస్తుత ప్రపంచ ఛాంపియన్‌ లోహ్‌ కీన్‌ యూ (సింగపూర్‌)కు యువ ఆటగాడు లక్ష్యసేన్‌ షాకిచ్చాడు.

7. దిల్లీలో కొవిడ్‌ వ్యాప్తి తగ్గుతోంది.. వాటి ఫలితంగానే

దేశ రాజధాని దిల్లీలో రెండు రోజులుగా రోజువారీ కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయని రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి సత్యేందర్‌ జైన్‌ వెల్లడించారు. వారాంతపు కర్ఫ్యూ, ముందస్తు ఆంక్షలు వైరస్‌ వ్యాప్తిని అరికట్టడంలో దోహదపడ్డాయని తెలిపారు. మరో మూడు, నాలుగు రోజులు పరిస్థితులను పర్యవేక్షిస్తామని, ఆపై ఆంక్షల సడలింపుపై నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.

8. శ్రీవారి ఆలయంలో ఏకాంతంగా పార్వేట ఉత్సవం

తిరుమల శ్రీవారి ఆలయంలో ఆదివారం సాయంత్రం పార్వేట ఉత్సవం ఏకాంతంగా జరిగింది. ఏటా కనుమ పండుగ రోజున పార్వేట ఉత్సవం నిర్వహించడం ఆనవాయితీ. ఇందులో భాగంగా సాయంత్రం మలయప్పస్వామివారిని, శ్రీకృష్ణ స్వామిని ఆలయంలోని సంపంగి ప్రాకారంలో ఊరేగించి, కల్యాణ మండపంలో ఆస్థానం నిర్వహించారు.

9. టికెట్ దక్కలేదని సమాజ్‌ వాదీ నేత ఆత్మహత్యాయత్నం

ఎన్నికలు సమీపిస్తున్నా కొద్దీ ఉత్తర్‌ప్రదేశ్‌లో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. టికెట్‌ ఆశించి భంగపడిన పలువురు నేతలు పార్టీలు మారుతున్నారు. మరికొందరు తీవ్ర ఆగ్రహానికి గురై స్నేహితులు, సన్నిహితుల వద్ద బోరున విలపిస్తున్నారు. ఇదిలా ఉంటే సమాజ్​వాదీ పార్టీకి చెందిన ఆదిత్య ఠాకూర్ అనే నేత ఏకంగా ఆత్మహత్యకు యత్నించారు. లఖ్‌నవూలోని పార్టీ కార్యాలయం ముందే ఒంటిపై పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకునే ప్రయత్నం చేశారు.

10. ప్రధాని సమర్థ నాయకత్వం వల్లే ఈ ఘనత సాధ్యమైంది: అమిత్‌ షా

కరోనా కట్టడికి దేశవ్యాప్తంగా చేపట్టిన వ్యాక్సినేషన్‌ ప్రక్రియ నేటితో ఏడాది పూర్తిచేసుకుంది. ఈ సందర్భంగా ప్రధాని మోదీ, వైద్యులు, శాస్త్రవేత్తలు, ఆరోగ్య కార్యకర్తలపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా ప్రశంసలు కురిపించారు. ఇప్పటి వరకు కేంద్రం 156 కోట్లకుపైగా కొవిడ్‌ టీకా డోసులు పంపిణీ చేసింది. వ్యాక్సినేషన్‌లో భారత్‌ ప్రపంచానికే ఆదర్శంగా నిలిచిందని, ఈ ఘనత ప్రధాన మంత్రి నరేంద్రమోదీ వల్లే సాధ్యమైందని అమిత్‌షా అన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని